రాజధాని విధ్వంసంపై మోడీ ఏనాడైనా స్పందించారా?

ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం మేరకు వెనుకబడ్డ రాయలసీమ – ఉత్తరాంధ్ర అభివృద్ధి పథకాన్ని కేంద్ర ప్రభుత్వం అమలు చేసిందా? అందులో భాగంగానే ఏడు జిల్లాలకు, ఏడాదికి, జిల్లాకు రు.50 కోట్లు చొప్పున మూడేళ్ళిచ్చి, అటుపై ఆపేసిందా? మరి, ఇదే పథకం క్రింద తెలంగాణాతో పాటు దేశంలోని అనేక రాష్ట్రాల్లోని వెనుకబడిన జిల్లాలకు కూడా కేంద్ర ప్రభుత్వం ఇదే రీతిలో నిధులను మంజూరు చేసింది కదా!

కడప ఉక్కు కర్మాగారం లాభదాయకం కాదని కేంద్ర ప్రభుత్వం నిరాకరించిందా, లేదా? రామాయపట్నం ఓడ రేవును రాష్ట్ర ప్రభుత్వం మైనర్ పోర్టుగా ప్రతిపాదించింది కాబట్టి, అది మేజర్ పోర్టు కాదని చెప్పి తిరస్కరించిందా, లేదా? కేంద్ర ప్రభుత్వం మేజర్ పోర్టుగా నిర్మిస్తానంటే ఆంధ్రప్రదేశ్ ప్రజలు వద్దన్నారా?

విశాఖపట్నంలో రైల్వే జోన్ ఏర్పాటు చేయడానికి అవసరమైన భవన సముదాయాన్ని నిర్మించడానికి రైల్వే శాఖకు భూమే లేదా? విశాఖ రైల్వే డివిజన్ కార్యాలయ భవనాలను వినియోగించుకోవచ్చు కదా? కేంద్ర విద్యా సంస్థలను అద్దె భవనాల్లో ప్రారంభించి, కొనసాగించలేదా?

పోలవరం జాతీయ ప్రాజెక్టు. దాని నిర్మాణాన్ని 2013 -14 ధరల ప్రకారమే పూర్తి చేయగలరా? డిపిఆర్ – 2 కు కేంద్ర జల సంఘం సాంకేతిక సలహా మండలి ఆమోదం తెలియజేసి ఐదేళ్ళయినా కేంద్ర ఆర్ధిక మంత్రిత్వ శాఖ ఎందుకు ఆమోదించలేదు?

అమరావతి రాజధానికి శంకుస్థాపన చేసిన ప్రధాన మంత్రి మోడీగారు ఏనాడైనా అమరావతి రాజధాని విధ్వంసంపై స్పందించారా?

– టి. లక్ష్మీనారాయణ
సామాజిక ఉద్యమకారుడు,
ఆంధ్రప్రదేశ్ సమగ్రాభివృద్ధి అధ్యయన వేదిక

Leave a Reply