Suryaa.co.in

Editorial

కేసీఆర్‌కు ఝలక్

– సొంత ఇలాకాలోనే తిరుగుబాటు
– కాంగ్రెస్ ఎంపీపీ గెలుపు
– అవిశ్వాసంలో ఓడిన బీఆర్‌ఎస్
– ఇది కేసీఆర్ నైతిక ఓటమి
( మార్తి సుబ్రహ్మణ్యం)

ఆయన వందరోజుల క్రితం వరకూ రారాజు. పాలన కూడా రాచరికమే. తెలంగాణ గడ్డ కేంద్రంగా దేశ రాజకీయాలను ఏకం చేయబోయిన నేత. మహారాష్ట్ర-కర్నాటక-ఆంధ్ర రాష్ట్రాల్లో కూడా గులాబీని పరిమళింపచేయాలన్న పట్టుదలతో పనిచేసిన గులాబీదళపతి. సొంత జిల్లాలో ఏ ఒక్క పార్టీ కనిపించకుండా, రాజకీయ అశ్వమేధయాగం చేసిన రాజకీయ నేత ఆయన. కానీ వందరోజుల క్రితం జరిగిన ఎన్నికల్లో.. ‘కారు-సారు’ జమిలిగా బోల్తా పడ్డారు. ఇక అప్పటినుంచీ వరస వెంట వరస పరాభవాలు, ప్రతికూల పరిణామాలే. ఎంపీ-ఎమ్మెల్యేలు తెలుగు టీవీ సీరియళ్ల మాదిరిగా ఝలక్ ఇవ్వడం ప్రారంభించారు. తాజాగా సొంత ఇలాకాలోనే, ఒక సాధారణ ఎంపిపిని గెలిపించలేని నిస్సహాయ పరిస్థితిది సారు-కారుది. బీఆర్‌ఎస్ అధినేత ‘కల్వకుంట్ల’ ఇలాకాలో ఆయనకు ‘తెల్వకుంట’ జరిగిపోయిన విషాద ‘ఫలిత’మిది.

అధికారంలో ఉన్నప్పుడు మహారాష్ట్ర-ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలో సైతం జైత్రయాత్ర చేసిన బీఆర్‌ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌కు సొంత ఇలాకాలో దారుణ పరాభవం ఎదురైంది. ఆయన సొంత ఇలాకాలోనే తన పార్టీ ఎంపీపీపై విపక్షాలు పెట్టిన అవిశ్వాసాన్ని, ఓడించలేక చతికిలపడ్డారు. ఇది కేసీఆర్ వ్యక్తిగత ఓటమి కిందే లెక్క అని రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.

అధికారంలో ఉన్నప్పుడు విపక్షాలకు చెందిన ఎమ్మెల్యే, ఎంపీ, జడ్పీ చైర్మన్లు, మున్సిపల్ చైర్మన్లు, కార్పొరేటర్లు, కౌన్సిలర్లను.. చివరికి అసెంబ్లీలో శాసనసభాపక్షాన్నే మందబలంతో విలీనం చేయించిన బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్‌కు, సొంత నియోజకవర్గంలోనే దారుణమైన అవమానం ఎదురయింది. దేశాన్ని ఏలతానన్న కేసీఆర్.. చివరకు తన సొంత ఇలాకాలో, ఒక సాధారణ ఎంపీపీని గెలిపించలేని దయనీయ పరిస్థితి బీఆర్‌ఎస్ విషాదానికి అద్దం పట్టింది. చూడ్డానికి ఇది సాధారణ ఎంపిపి ఎన్నికే అయినప్పటికీ, కేసీఆర్ కోణంలో చూస్తే అది బీఆర్‌ఎస్‌కు సంస్థాగతంగా- కేసీఆర్‌కు వ్యక్తిగతంగా దారుణ పరాభవమేనన్నది విశ్లేషకుల వ్యాఖ్య.

సిద్దిపేట జిల్లా కొండపాక మండలం ఎంపీపీగా బీఆర్‌ఎస్‌కు చెందిన ర్యాగల సుగుణ దుర్గయ్య కొనసాగుతున్నారు. అయితే ఆయనపై సొంత పార్టీ సహా కాంగ్రెస్, బీజేపీ సభ్యులు అవిశ్వాసం పెట్టారు. స్వయంగా కేసీఆర్ ఉండగా తన గెలుపు ఖాయమన్న ధీమాతో ఉన్న దుర్గయ్య, ధైర్యంగానే అవిశ్వాస తీర్మానానికి సిద్ధమయ్యారు.

తీరా ఓటింగ్ సమయానికి సొంత బీఆర్‌ఎస్‌కు చెందిన ఆరుగురు, బీజేపీకి చెందిన ఒకరు, కాంగ్రెస్‌కు చెందిన ఇద్దరు సభ్యులు బీఆర్‌ఎస్‌కు వ్యతిరేకంగా ఓటేయడంతో.. దుర్గయ్య పీఠం కదిలి, అది కాంగ్రెస్ సభ్యుడైన మంచాల అనసూయ కనకరాములు చేతికొచ్చింది. అంటే అక్కడ కాంగ్రెస్ పాగా వేసిందన్నమాట.

చూడటానికి ఇది అతి చిన్న అంశంగానే కనిపిస్తున్న్పటికీ.. అధికారంలో ఉండగా దేశ రాజకీయాల్లో చక్రం తిప్పి.. మహారాష్ట్రలో కూడా భూకంకం సృష్టించబోయిన కేసీఆర్‌కు, వ్యక్తిగతంగా ఎదురైన దారుణ అవమానమేనన్నది విశ్లేషకుల వ్యాఖ్య. సొంత ఇలాకాలోని ఒక చిన్నపాటి ఎంపీపీనే కాపాడుకోలేని కేసీఆర్.. పార్లమెంటు ఎన్నికల తర్వాత ఎంతమంది ఎమ్మెల్యేలను కాపాడుకుంటారన్న వ్యాఖ్యలు సహజంగానే తెరపైకి వస్తున్నాయి. ఇప్పటికే 26 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్-బీజేపీ వైపు చూస్తున్నారన్న ప్రచారం నేపథ్యంలో.. కేసీఆర్ సొంత ఇలాకాలో ఎంపీపీ ఓటమి చర్చనీయాంశమయింది.

LEAVE A RESPONSE