Suryaa.co.in

Editorial

ఢిల్లీ ఆదేశిస్తేనే ఈ‘సీరియస్’ అవుతుందా?

– ‘పైనుంచి’ ఆదేశాలు రావాలా?
– వచ్చేంతవరకూ చర్యల కొరడా ఝళిపించరా?
– కొత్తగా ముగ్గురు పరిశీలకుల రాక
– ఆశలన్నీ వారిపైనే
– పోలీసులపై ఇచ్చిన ఫిర్యాదులు బుట్టదాఖలేనా?
– ఇన్చార్జి డీజీపీ హయాంలోనే ఎన్నికలు జరిపిస్తారా?
– బెంగాల్ మాదిరి వేగం ఏదీ?
– వాలంటీర్ల చేతికి పెన్షనర్ల డబ్బులా?
– ఈసీ తీరుపై కూటమి కన్నెర్ర
– అధికారులు భయపడుతున్నారా?
– కూటమి రాదన్న అనుమానంతో ఉన్నారా?
– దీనికోసమేనా కూటమిలో చేరింది?
– ఇలాగైతే పొత్తు ఎందుకు?
– టీడీపీ, జనసేన శ్రేణుల అసంతృప్తి
( మార్తి సుబ్రహ్మణ్యం)

ఢిల్లీ నుంచి ఆదేశాలు వస్తేనే ఏపీలో ఈసీ అధికారులు చర్యల కొరడా ఝళిపిస్తారా? రానంతవరకూ ఇలాగే చర్యల వ్యవహారం నత్తనడక సాగుతుందా? పోలీసు ఉన్నతాధికారులపై ఫిర్యాదు చేసినా ఇప్పటిదాకా చర్యలు తీసుకోవడం లేదంటే అర్ధం ఏమిటి? కోడ్ వచ్చిన తర్వాత బెంగాల్‌లో డీజీపీని మార్చిన ఈసీ, ఏపీలో ఎందుకు కదలడం లేదు? అంటే ఇన్చార్జి డీజీపీ హయాంలోనే ఎన్నికలు కానిచ్చేస్తారా?.. వాలంటీర్లపై ఇస్తున్న పుంఖానుపుంఖాల ఫిర్యాదులు బుట్టదాఖలు చేస్తున్నారా?

పెన్షనర్ల డబ్బులు ఇప్పుడు కూడా వారికే ఇస్తున్నారంటే అసలు ఈసీ పనిచేస్తుందా? లేదా? ఇలాగయితే ఇక బీజేపీతో కూటమి ఏర్పాటు ఎందుకు?.. ఇదీ ఏపీ ఎన్నికల సంఘం అధికారులపై టీడీపీ-జనసేన శ్రేణుల అసంతృప్తి.

ఏపీలో జరుగుతున్న అరాచకాలతోపాటు, ఎన్నికల సమయంలో అధికార వైసీపీ అక్రమాలు-దొంగఓట్లను అడ్డుకుని.. ఎన్నికలు స్వేచ్ఛగా జరిపించాలన్న లక్ష్యంతో, తమ పార్టీ బీజేపీతో జత కట్టిన వైనాన్ని టీడీపీ శ్రేణులు గుర్తు చేస్తున్నారు.

‘‘వాస్తవానికి బీజేపీతో కలిస్తే ముస్లిం ఓట్లు దూరమవుతాయని.. ఐదేళ్లు కష్టపడి పనిచేసిన వారికి అవకాశాలు పోతాయని తెలిసినా, అధికారంలోకి వచ్చిన తర్వాత కేంద్ర సహకారం అవసరమని చంద్రబాబు భావించారు. కేంద్ర సాయం లేకపోతే అప్పుల రాష్ట్రాన్ని గట్టెక్కించడం కష్టమని ఆయనకు తెలుసు. పైగా పార్టీకి వచ్చే ఇతర సాయాలతోపాటు, వైసీపీ నిధులను అడ్డుకోవచ్చన్న అనేక రకాల వ్యూహాలతో టీడీపీ కూటమిలో చేరింది. ప్రధానంగా వైసీపీకి తొత్తులుగా ఉన్న అధికారులకు, ఎన్నికల సమయంలో ముకుతాడు వేయవచ్చన్న ముందుచూపు ఒకటి. అయితే కోడ్ వచ్చిన తర్వాత కూడా వైసీపీ అక్రమాలు ఏవీ ఆగడం లేదు. మేం ఇచ్చిన ఫిర్యాదులపై ఈసీ స్పందించడం లేదు. ఇక మేం కూటమిలో చేరి ఏం ఉపయోగం’’ అని ఓ టీడీపీ సీనియర్ నేత వ్యాఖ్యానించారు.

కోడ్ వచ్చిన వెంటనే పశ్చిమ బెంగాల్ డీజీపీని మార్చిన ఈసీ.. ఏపీలో ఇన్చార్జి డీజీపీగా కొనసాగుతున్న రాజేంద్రనాధ్‌రెడ్డిని మార్చమన్న ఫిర్యాదుపై, ఇప్పటిదాకా స్పందన లేకపోవడమే కూటమిని విస్మయపరుస్తోంది. ఈసీ తీరు చూస్తుంటే ఈ ఎన్నికలు ఆయన ఆధ్వర్యంలో జరిపేలా కనిపిస్తోందని కూటమి నేతలు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

నిజానికి కోడ్ వచ్చిన వెంటనే పూర్తి స్థాయి డీజీపీ నియామకంపై ఈసీ కసరత్తు చేస్తుందని చాలామంది భావించారు. ఇక పల్నాడు, నెల్లూరు, ప్రకాశం ఎస్పీలతోపాటు, ఫోన్‌ట్యాపింగ్‌లో పాలుపంచుకుంటున్న మరో ముగ్గురు అడిషనల్ ఎస్పీలను మార్చమని ఇచ్చిన ఫిర్యాదుపైనా.. ఈసీ మౌనం వహించడంపై, కూటమిలో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. తాజాగా తిరుపతి కలెక్టర్ తీరు కూడా విమర్శల పాలయింది.

ఇక వాలంటీర్ల వ్యవస్థపై కూటమి నేతలు ఇప్పటికే పుంఖానుపుంఖాల ఫిర్యాదులు చేస్తున్నారు. వారిని ఎన్నికల విధుల నుంచి తప్పించాలని అటు ఈసీ కూడా ఆదేశాలిచ్చింది. అయితే విచిత్రంగా.. రాబోయే నెలలో సామాజిక పించన్లు వారి ద్వారానే పంపిణీ చేయాలని సెర్ప్ ఆదేశాలివ్వడం ధిక్కారమేనంటున్నారు. ఈసీ చెప్పినా ప్రభుత్వం బేఖాతరు చేసిన వైనంపై, ఇప్పటివరకూ ఈసీ చర్యల కొరడా ఝళిపించకపోవడంపై కూటమిలో అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

అసలు ఇప్పటిదాకా వాలంటీర్ల నుంచి సిమ్ కార్డులు, రికార్డులు కూడా స్వాధీనం చేసుకునేందుకు ఆదేశాలివ్వలేదంటే.. ఈసీ ఎంత వేగంగా పనిచేస్తుందో అర్ధమవుతోందని కూటమి నేతలు వ్యాఖ్యానిస్తున్నారు.

చిలకలూరిపేట బొప్పూడిలో ప్రధాని నిర్వహించిన సభలో.. పోలీసుల వైఫల్యంపై కూటమి అధికారులు ఫిర్యాదు చేసి వారం రోజులు దాటింది. ఇద్దరు ఎస్పీలను పిలిచి వివరణ కోరిన ఈసీ.. ఇప్పటిదాకా వారిపై చర్యలు తీసుకునేందుకు సాహసించకపోవడంపై విస్మయం వ్యక్తమవుతోంది.

మంగళగిరిలో ఎంపి అయోధ్యరామిరెడ్డి సహా, వైసీపీ నేతల కార్లు తనిఖీ చేయని పోలీసులు.. టీడీపీ అభ్యర్ధి లోకేష్ వాహనాన్ని ఒకేరోజు నాలుగుసార్లు ఆపి, తనిఖీ చేయడం వివాదానికి దారి తీసింది. ఇక జిల్లా స్థాయిలో కలెక్టర్లకు వైసీపీ నేతలు, వారికి అనుకూలంగా పనిచేస్తున్న కొందరు అధికారులపై ఫిర్యాదులు చేస్తున్నా ఇప్పటిదాకా చర్యలకు దిక్కులేదు.
ఈ సమయంలో చర్యల కొరడా ఝళిపిస్తేనే మిగిలిన అధికారులకు భయం ఉంటుందని, అలా చేయకపోవడం వల్ల ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరించినా ఏమీ కాదన్న ధీమా కొందరు అధికారుల్లో స్థిరపడుతుందని విశ్లేషిస్తున్నారు.

ఈ పరిణామాలు కూటమిలో అసహనం, ఆగ్రహానికి కారణమవుతున్నాయి. ‘మేం వైసీపీకి, వారికి కొమ్ముకాస్తున్న అధికారులపై ఇన్ని సార్లు ఫిర్యాదులు చేస్తున్నా ఈసీ స్పందించడం లేదు. అంటే బహుశా అధికారులకు కూటమి అధికారంలోకి వస్తుందని నమ్మకం లేదా అన్న అనుమానం ఉన్నట్లుంది. లేదా జగన్ బెదిరింపులకు భయపడి మౌనంగా ఉంటున్నారా మాకు అర్ధం కావటం లేదు. వారి మౌనం చూస్తుంటే కూటమిలో బీజేపీ ఉన్నప్పటికీ.. వారిపై ‘పైనుంచి’ ఇంకా ఆదేశాలు రాలేదనిపిస్తోంది. పైనుంచి ఆదేశాలు వస్తేనే కదులుతారా? మరి ఇలాగైతే పార్టీ ప్రయోజనాలను పణంగా పెట్టి, బీజేపీతో పొత్తు పెట్టుకుని ఏం లాభం’ అని ఓ మాజీ మంత్రి వ్యాఖ్యానించారు.

నిజానికి ఈసీ మౌనం ఇలాంటి అనుమానాలనే తెరపైకి తెస్తున్నాయి. ఇతర రాష్ట్రాల మాదిరిగా శరవేగంగా స్పందిస్తున్న తీరులో, పదోవంతు కూడా ఏపీలో చూపించకపోవడం సహజంగానే అనుమానాలకు తావిస్తోంది. ఒక సీనియర్ ఐఏఎస్‌ను గతంలో ఉన్న కేసు చూపించి, బెదిరిస్తున్నారన్న కథనాలు గతంలో వచ్చిన వైనాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నారు.

ప్రస్తుత పరిస్థితిలో వాయువేగంతో నిర్ణయాలు తీసుకునే ఈసీ అధికారి అవసరమన్న అభిప్రాయం కూటమిలో వ్యక్తమవుతోంది. ప్రస్తుత అధికారి ముకేష్‌కుమార్ మీనా వ్యవహారశైలిపై, కూటమిలో అసంతృప్తి కనిపిస్తోంది. మీనా నిజాయితీపరుడైన అధికారే అయినప్పటికీ.. ధైర్యంగా నిర్ణయాలు తీసుకోలేకపోతున్నారని, భయపడుతున్నట్లు కనిపిస్తోందంటున్నారు. అది వైసీపీకి లాభం-తమకు నష్టంగా మారుతోందని కూటమి నేతలు వ్యాఖ్యానిస్తున్నారు.

ఈ నేపథ్యంలో రాష్ట్రానికి కేంద్రం పంపిన, ముగ్గురు ఎన్నికల పరిశీలకుల రాకపై కూటమిలో ఆశావహ పరిస్థితి ఏర్పడింది. ఏపీలో ఎన్నికల ప్రక్రియ పర్యవేక్షించేందుకు 1987 బ్యాచ్‌కి చెందిన రిటైర్డు ఐఏఎస్ అధికారి రామ్మోహన్ మిశ్రాను స్పెషల్ జనరల్ అబ్జర్వర్‌గా, 1984 బ్యాచ్‌కి చెందిన రిటైర్డు ఐపీఎఎస్ అధికారి దీపక్ మిశ్రాను స్పెషల్ పోలీస్ అబ్జర్వర్‌గా కేటాయించింది.
వీరిద్దరితో పాటు 1983 బ్యాచ్‌కి చెందిన రిటైర్డ్ ఐఆర్ఎస్ అధికారి నీనానిగమ్‌ను స్పెషల్ ఎక్స్‌పెండేచర్ మానిటరింగ్ సెల్‌ అబ్జర్వర్‌గా నియమిస్తూ ఈసీ ఉత్తర్వులు జారీ చేసింది.ఈ క్రమంలో రాష్ట్రానికి వచ్చిన ముగ్గురు పరిశీలకుపైనే కూటమి ఆశలు పెట్టుకున్నట్లు కనిపిస్తోంది.

LEAVE A RESPONSE