నాడు బాబు వద్దు.. నేడు సీటు ముద్దు

– అనపర్తి బీజేపీ అభ్యర్ధి రాజు తీరిది
– బాబు వెన్నుపోటుదారుడంటూ చేసిన ట్వీట్ ప్రచారంలోకి
– ఎలా పనిచేస్తామంటున్న టీడీపీ క్యాడర్
( అన్వేష్)

ఆయన ఒకప్పుడు టీడీపీకి బద్ధ వ్యతిరేకి. అంతేనా? టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు వెన్నుపోటుదారుడంటూ సోషల్‌మీడియాలో ప్రచారం చేసిన బీజేపీ నాయకుడు. సీన్ కట్ చేస్తే.. ఇప్పుడు ఆయన పొత్తులో భాగంగా బీజేపీ సీటు దక్కించుకున్న అభ్యర్ధి. సరే ఇదంతా ఎప్పటి సందతో కదా? ఇప్పుడెందుకని సరిపెట్టుకోవచ్చు. కానీ సోషల్‌మీడియా మహా ప్రమాదకారి కదా? అది ఊరకనే చేతులుముడుచకుని, దుప్పటికప్పేసుకుని పడుకోదు కదా? ఎవరు మర్చిపోయినా అది మర్చిపోదు కదా? ఇప్పుడు సరిగ్గా అదే జరిగింది.

అనపర్తి బీజేపీ సీటు దక్కించుకున్న ఎంఎస్‌ఆర్‌కె రాజు సోషల్‌మీడియాలో చేసిన పోస్టులు, ఇప్పుడు మళ్లీ ప్రచారంలోకి రావడంతో అక్కడ కలకలం రేగింది. ‘‘ఇంకొద్దు గొడ్డలిపోటు జగనన్న- మళ్లీ వద్దు వెన్నుపోటు చంద్రన్న’’ పేరుతో ఆయన పెట్టిన పోస్టు ఒకటి ఇప్పుడు సోషల్‌మీడియాలో హల్‌చల్ చేస్తోంది.

దానితో చంద్రబాబుకు బద్ధ వ్యతిరేకి అయిన రాజుకు మేం ఎలా పనిచేస్తామని, అందునా పార్టీ కోసం ఎన్నో త్యాగాలు చేసి-జైలుకు సైతం వెళ్లిన నల్లమిల్లిని పక్కనపెట్టి, టీడీపీ వ్యతిరేకి రాజుకు సీటిస్తే ఎలా పనిచేస్తామని, తమ్ముళ్లు కారాలు మిరియాలు నూరుతున్నారు. అందుకే రాజకీయ నాయకులు ఎప్పుడూ ఓవర్ యాక్షన్ చేయకూడదు. చేస్తే.. ఇదిగో.. ఇలాంటి పితలాటకమే ఎదురవుతుంది.

సదరు నేతలు పూర్వాశ్రమంలో ఏం రెచ్చిపోయారన్నది సోషల్‌మీడియా కడుపులో పైపు వేసి మరీ కక్కిస్తుంది ఇలాగే! మరి రాజు గారేమంటారో చూడాలి. అసలు రెడ్డి సామాజికవర్గం ప్రభావం విపరీతంగా ఉండే అనపర్తి సీటును, బీజేపీ కోరుకోవడమే కామెడీ అని, అక్కడ ‘ఫ్యాను’కు బాగా గాలిపోసేందుకే ఈ సీటు తీసుకున్నట్లుందన్నది.. అటు కమలదళంలో కూడా వినిపిస్తున్న గుసగుస.

Leave a Reply