Suryaa.co.in

Andhra Pradesh

చంద్రబాబుతోనే రాష్ట్రానికి భవిష్యత్

-అభివృద్ధి చేయడానికే వచ్చా… ఆశీర్వదించండి!
-తటస్థ ప్రముఖులతో యువనేత నారా లోకేష్ భేటీ

మంగళగిరి: మంగళగిరి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతోనే మీ ముందుకు వచ్చా, తనను ఆశీర్వదించి సమగ్రాభివృద్ధికి సహకారం అందించాలని యువనేత నారా లోకేష్ విజ్ఞప్తిచేశారు. మంగళగిరి నియోజకవర్గానికి చెందిన పలువురు తటస్థ ప్రముఖులను యువనేత లోకేష్ సోమవారం మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. తొలుత నవులూరుకు చెందిన ప్రముఖ వ్యాపారవేత్త, మంగళగిరి ఆటోనగర్ ప్లాట్ ఓనర్స్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి ఆదెపు శివనాగేశ్వరరావును కలుసుకున్నారు. ఈ సందర్భంగా పద్మశాలీలు ఎదుర్కొంటున్న సమస్యలను ఆయన యువనేత ఎదుట ప్రస్తావించారు.

లోకేష్ స్పందిస్తూ… యువగళం పాదయాత్ర సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా చేనేతలు ఎదుర్కొంటున్నసమస్యలను ప్రత్యక్షంగా చూశాను. ప్రత్యేకించి మంగళగిరిలో చేనేత సమస్యలపై నాకు పూర్తి అవగాహన ఉంది. చేనేతలను ఆదుకునేందుకు వీవర్స్ శాలను ఏర్పాటుచేశా. టాటా సంస్థతో ఒప్పందం చేసుకుని మార్కెటింగ్, డిజైనింగ్ సహకారం అందిస్తున్నా. చేనేత ఉత్పత్తులకు జిఎస్టీ రద్దుచేయాలని ఇప్పటికే నిర్ణయం తీసుకున్నాం. చేనేతలకు 500 యూనిట్ల ఉచిత విద్యుత్ ఇస్తామని ఇప్పటికే చంద్రబాబు ప్రకటించారు. మంగళగిరిలో చేనేతల సమస్యలను శాశ్వతంగా పరిష్కరించి పేదరికం నుంచి బయటకు తెచ్చే బాధ్యత నేను తీసుకుంటానని హామీ ఇచ్చారు.

అనంతరం ఉండవల్లికి చెందిన ప్రముఖుడు గాదె పోలయ్యను కలుసుకున్నారు. ఈ సందర్భంగా కాపులు ఎదుర్కొంటున్న పలు సమస్యలతో ఉండవల్లిప్రాంత ప్రజల ఇబ్బందులను యువనేత దృష్టికి తెచ్చారు. కృష్ణానది చెంతనే ఉన్నా ఇక్కడి ప్రజలు నీటికి ఇబ్బంది పడాల్సిన పరిస్థితులు నెలకొన్నాయని చెప్పారు. కొండవాలు ప్రాంతాల్లో ఏళ్లతరబడి నివాసం ఉంటున్న వారికి పట్టాలు ఇప్పించాలని కోరారు. లోకేష్ స్పందిస్తూ… రాబోయే ఎన్నికల్లో ప్రజాప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కాపు కార్పొరేషన్ కు నిధులు కేటాయించి బలోపేతం చేస్తామని, కాపు విద్యార్థుల విద్య, ఉపాధి అవకాశాల మెరుగుకు చర్యలు చేపడతామని అన్నారు.

కొండవాలు ప్రాంతాల్లో నివసించే వారికి పట్టాలు ఇస్తామని, నియోజకవర్గంలో ప్రతి ఇంటికి కుళాయిద్వారా తాగునీరు అందించేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు. చివరకు ఉండవల్లికి చెందిన మరో ప్రముఖుడు పల్లప్రోలు నాగిరెడ్డి కుటుంబాన్ని మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ఈ సందర్భంగా పలు సమస్యలను నాగిరెడ్డి యువనేత దృష్టికి తెచ్చారు. మంగళగిరి ప్రజలతో మమేకమై అయిదేళ్లుగా చిత్తశుద్ధితో సేవలందిస్తున్నానని, రాబోయే ఎన్నికల్లో మీ ఇంటి బిడ్డలా నన్ను ఆశీర్వదించాలని కోరారు.

LEAVE A RESPONSE