Suryaa.co.in

National

భారతీయుల హృదయం.. బీజేపీ!

1980 ఏప్రిల్ 6 భారతీయ జనతా పార్టీ స్థాపించిన రోజు.స్వతంత్ర భారతదేశంలో రాజకీయంగా ఒక విశేషమైన పరిణామం భారతీయ జనతా పార్టీ ఆవిర్భావం.

అటల్ బీహారీ వాజ్ పేయీ, లాల్ కృష్ణ ఆడ్వాణీల ఆలోచన, ఆచరణల ఫలితం, ఫలం భారతీయ జనతా పార్టీ. శ్యామాప్రసాద్ ముఖర్జీ, భారతీయ జన్ సంఘ్ ప్రేరణా, మూలమూ కాగా భారతీయ జనతా పార్టీ ఆవిర్భవించింది.

జాతీయతా భావం, భారతీయ చింతన, మతాతీతమైన పౌరసమానత్వం, దేశభద్రత, దేశ అభివృద్ధి, విదేశీ మతోన్మాదం నుంచి ప్రజలకు రక్షణ, విదేశాల మాఫియాల నుంచి ప్రజకు రక్షణ, దేశ అఖండత, ఈ మట్టిపై మమకారం వంటి విలువైన అంశాలతోనూ, వాటి కోసమూ భారతీయ జనతా పార్టీ ఆవిర్భవించింది. అంతకు ముందున్న పార్టీలు, ప్రభుత్వాలు ఈ అంశాలను ఏ మాత్రమూ పట్టించుకోకపోవడం మనదేశ దౌర్భాగ్యం. అందువల్ల దేశానికి పెనుహాని జరిగింది అన్నది చారిత్రక సత్యం.

వాజ్ పేయీ, ఆడ్వాణీ, మురళి మనోహర్ జోషి వంటి వాళ్లు నెహ్రూతోనూ, కాంగ్రెస్ తోనూ కలిసిపోయి ఉంటే అప్పటి కేంద్ర ప్రభుత్వంలో ప్రముఖమైన మంత్రులై అన్ని విధాలుగానూ ఎంతో లబ్ది పొంది ఉండేవారు. కానీ వాళ్లు ఆ పని చేయకుండా, దేశ ప్రయోజనాల కోసం పని చేశారు. ఆ క్రమంలో తమ జీవితాల్లో ప్రధానమైన కాలాన్ని కోల్పోయారు. ఈ ఒక్క విషయం చాలు భారతీయజనతా పార్టీ మూలపురుషులు ఎంత ఉన్నతమైనవాళ్లో అర్థమవడానికి.

దశలవారీగా పుంజుకుంటూ, ప్రజాభిమానాన్ని చూరగొంటూ పూర్తి ప్రజాస్వామ్య విజయంగా 2014లో భారతీయ జనతా పార్టీ మన దేశంలో బలమైన నాయకుడు నరేంద్ర మోదీ ప్రధానిగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. విదేశీ దుష్ట శక్తులకు అతీతంగా, స్వదేశీ ద్రోహులకు అతీతంగా, వికృత స్వభావులైన మేధావులకు అతీతంగా, విదేశీ మతోన్మాదానికి అతీతంగా, నిజమైన ప్రజాస్వామ్యానికి వ్యక్తీకరణగా దేశంలో భారతీయజనతా పార్టీ అధికారంలోకి వచ్చింది.

ఈ దశలో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి రాకపోయి ఉంటే దేశం విదేశాల మాఫియాలకు, విదేశీ మతోన్మాదానికి బలై చిన్నాభిన్నం ఐపోయి ఉండేదని మతిస్థిమితం ఉన్న ఎవరికైనా అవగతమయ్యే విషయమే.

అంతకు ముందున్న ప్రజావ్యతిరేక ప్రభుత్వాల నుంచీ, ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నిక అవని, అవలేని నాయకుల నుంచి, అవినీతి, అసమర్ధ పాలన నుంచీ ఈ దేశాన్ని రక్షించుకునేందుకు ఈ దేశ జనత నరేంద్ర మోదీ నాయకుడుగా భారతీయ జనతా పార్టీని ఎన్నుకున్నారు.

2019లో మళ్లీ నరేంద్ర మోదీ నాయకుడుగా భారతీయ జనతా పార్టీని ఎన్నుకోవడం అన్నది దేశాన్ని కాపాడుకునేందుకు దేశ జనత (ప్రజల సమగ్రత) ప్రజాస్వామ్యబద్దంగా చేసిన సరైన, విలువైన ప్రయత్నం.

స్వతంత్ర భారత చరిత్రలో ఎప్పుడూలేని విధంగా భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోదీ పాలనలో ప్రపంచంలో ఒక ప్రముఖమైన దేశంగా, బలమైన దేశంగా ఇవాళ మన దేశం ఉంది. ప్రపంచంలో మన దేశం ఎంతో ప్రశంసించబడుతోంది. ఇది క్షేత్ర స్థాయి వాస్తవం.

స్వతంత్ర భారతదేశం భారతీయ జనతా పార్టీ పాలనకు ముందు, తరువాత అని పరిగణించబడుతుంది. ముఖ్యంగా స్వతంత్ర భారతదేశం 2014కు ముందు, తరువాత అని పరిగణనమౌతుంది. భారతీయ జనతా పార్టీ మన దేశ రాజకీయ, సామాజిక పరివర్తనకు మూలమూ, మూలకమూ ఐంది. ఇది చారిత్రక వాస్తవం.

2024 సార్వత్రిక ఎన్నికల్లోనూ భారతీయ జనతా పార్టీ ఘన విజయం సాధిస్తుంది. ఇప్పటి ప్రజాభీష్టాన్ని పరిశీలిస్తున్న అన్ని సర్వేలూ ఈ విషయాన్ని ధ్రువీకరిస్తున్నాయి. గత పదేళ్లుగా జన, మన ప్రధాని నరేంద్రమోదీ అధ్యక్షతలో భారతీయ జనతా పార్టీ పని తీరును ప్రజలు హర్షిస్తున్నారు అన్నదానికి తిరిగులేని సాక్ష్యం ఇది.

ఇవాళ దేశంలో భారతీయ జనతా పార్టీ ఒక ప్రజా ప్రభుత్వం. మన దేశ కేంద్ర ప్రభుత్వం ప్రజలు కోరుకుని, ఎన్నుకున్న ప్రజా ప్రభుత్వం; ప్రజా స్వామ్యబద్ధంగా ఎన్నికైన ప్రభుత్వం. 2024లోనూ భారతీయ జనతా పార్టీని ప్రజలు ఎన్నుకోనున్నారు.

రానున్న రోజుల్లో భద్రత, అభివృద్ధి, విదేశీమతోన్మాదం నుంచి రక్షణ, వికృత స్వభావులైన మేధావులకు, దేశద్రోహులకు అతీతంగా ముందుకు సాగడం వంటివి సాధించుకునేందుకు భారతీయ జనతా పార్టీ తప్పనిసరి.

స్వతంత్రం వచ్చినప్పటి నుంచీ మన దేశంలోని పెద్ద శాతం ప్రజలు సామాజిక, సాంస్కృతిక, మానసిక, మతపరమైన అణిచివేతకు గురౌతున్నారు. మన దేశంలో పెద్ద శాతం ప్రజల రక్షణ ప్రశ్నార్థకమైపోయింది. మన దేశంలోని పెద్ద శాతం ప్రజలపై దాడి జరుగుతోంది.

విద్వేషవాదులు, వేర్పాటువాదులు, దేశ విచ్ఛిన్నర శక్తులు విదేశీ మతాల, మాఫియాల ప్రయోజనాల కోసం దేశంలోని ఎక్కువ శాతం ప్రజల్ని దెబ్బ కొడుతున్నారు. ఈ పరిస్థితిలో ఈ దేశ ప్రజల రక్షణకు, మనుగడకు, దేశ ప్రజాస్వామ్య పరిరక్షణకు, భారతదేశం ఉనికికి, అభివృద్ధికి భారతీయ జనతా పార్టీ ఎంతో అవసరం.

– పెంజర్ల మహేందర్ రెడ్డి
(అఖిలభారత ఓసి సంఘం మరియు ఎకనామికల్ వీకర్ సెక్షన్ జాతీయ అధ్యక్షుడు )

 

LEAVE A RESPONSE