-మామిడిపళ్లు, స్వీట్లు ఇచ్చి ర్యాంగింగ్ చేసిన అమరావతి రైతులు
-జగన్ ఇంటికి తరలివెళ్లిన అమరావతి మహిళలు
-నిన్న ఎస్పీ జాషువాకు పూలు ఇచ్చి గాంధీగిరి ప్రకటించిన పట్టాభి
-నేడు జగన్ ఇంటికి పండ్లు తీసుకువెళ్లి ర్యాంగింగ్ చేసిన అమరావతి మహిళలు
-ఏపీలో పెరుగుతున్న ‘గాంధీగిరి’
( మార్తి సుబ్రహ్మణ్యం)
ప్రత్యర్ధిని నేరుగా వారి పద్దతిలోనే ఢీ కొట్టడం ఒక యుద్ధం. విమర్శలు-ప్రతి విమర్శలు, ఆరోపణలు-ప్రత్యారోపణలు చేసుకోవడం ఒక పద్ధతి. కానీ తమను ఐదేళ్లు ఏడిపించి, కడుపులో బూటుకాళ్లతో తన్ని, జుట్టుపట్టుకుని ఈడ్చుకెళ్లిన నియంతకు.. స్వయంగా పండ్లు, స్వీట్లు ఇచ్చి ర్యాంగింగ్ చేయడం నయా స్టైల్ గాంధీగిరి. అమరావతి మహిళలు ఇప్పుడు అలాంటి గాంధీగిరి ర్యాగింగునే ఎంచుకున్నారు.
అసలే 11 సీట్లకు పరిమితమయి, ఇంట్లో విషాదపరిస్థితిలో ఉన్న మాజీ సీఎం జగన్‌ను ర్యాగింగ్ చేసేందుకు అమరావతి మహిళలు ‘కట్టలుతెంచుకున్న ఆనందంతో’ మాజీ సీఎం జగన్ ఉండే తాడేపల్లి ప్యాలెస్‌కు, స్వీట్లు-పండ్లతో వెళ్లి గాంధీగిరి చేయడం ఆసక్తికలిగించింది. నిన్ననే ఐపిఎస్ అధికారి జాషువా ఇంటికి వెళ్లి బొకే ఇచ్చి గాంధీగిరి చేసిన టీడీపీ సీనియర్ నేత పట్టాభిని అమరావతి రైతులు ఆదర్శంగా తీసుకున్నట్లుంది.
తమకు మేలుచేసిన జగనన్నకు కృతజ్ఞతలు చెబుదామనే ఉద్దేశంతోనే, అంతదూరం నుంచి మామిడిపండ్లు, స్వీట్లు తీసుకువచ్చామని మహిళలు జగన్ సెక్యూరిటీకి చెప్పారు. అయితే జగన్ అపాయింట్‌మెంట్ లేనందున, లోపలికి పంపించడం సాధ్యం కాదని చెప్పడంతో మహిళలు మండిపడ్డారు. ‘మూడు రాజధానుల పేరుతో మమ్మల్ని నాశనం చేశారు. మాకు కౌలు ఇవ్వకుండా మోసం చేశారు. మా జీవితాలను నాశనం చేసి, అమరావతిని అనాధను చేశారు. అయినా సరే మేం జగన్ ఓడిపోయి మాకు మంచిచేసినందుకు కృతజ్ఞతలు చెప్పడానికి వచ్చాం. వచ్చేముందు ఖాళీ చేతులతో రాకూడదని, పండ్లు-స్వీట్లు తీసుకువచ్చినా ఎందుకు పంపించర’ని సెక్యూరిటీతో వాగ్వాదానికి దిగారు.
ఇంట్లో వంట చేసుకునే తమకు, జండాలు పట్టి ఉద్యమాలు చేసే స్థాయికి తీసుకువచ్చినందుకు జగన్‌కు కృతజ్ఞత చెప్పడం తప్పా? మాకు ఉద్యమస్ఫూర్తి ఆయనే. పోనీ ఈ పండ్లు మీరు తీసుకుని జగన్‌కు పంపించండి అని కోరారు. దానికి సైతం వారు నిరాకరింతో కాసేపు జగన్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేసి, అక్కడి నుంచి వెళ్లిపోయారు. అమరావతి రైతుల శాపమే జగన్‌కు తగిలిందని, ఇప్పుడున్న 11 మందితోనే ‘ఆడదాం ఆంధ్ర’ ఆడుకోండని జగన్ ఇంటిని వేలితో చూపిస్తూ, వెటకారంగా మాట్లాడారు.
నిజానికి ఈ పరిణామం జగన్ సైతం ఊహించనిదే. ఐదేళ్ల పాటు తాడేపల్లి ప్యాలెస్ వైపు నిరసనకారులను రానీయకుండా.. అసెంబ్లీకి వచ్చి వెళ్లే సమయంలో వారిని చూడకుండా పరదాలు-పోలీసులను అడ్డుపెట్టుకున్న జగన్.. అదే అమరావతి జనం తన ఇంటిమీదకు మిడతల దండులా వచ్చి గాంధీగిరి చేసి, పండ్లు-స్వీట్లు ఇచ్చి తననే ర్యాంగింగ్ చేస్తారని బహుశా ఊహించి ఉండరు. జనం తిరుగుబాటు ఈ తరహాలో కూడా ఉంటుందా అని అటు సెక్యూరిటీ కూడా నివ్వెరపోయింది.