Suryaa.co.in

Editorial

స్వామి వారూ బాబు భక్తుడేనట!

– గతంలో బాబు కోసం పనిచేశానన్న స్వరూపానంద
– సీఎంగా ముహుర్తబలం కూడా భేషుగ్గా ఉందట
– నాలుక మడతేసిన విశాఖ స్వరూపానంద స్వామి
– ఐదే ళ్ల క్రితం జగన్ కోసం తపశ్శక్తులు ధారపోశానన్న స్వామి
– జగన్‌ను సిగ్గులేకుండా ముద్దుపెట్టుకున్న జగన్గురువు
– విశాఖలో భూకబ్జా ఆరోపణలతో ఉక్కిరిబిక్కిరి
– ఆశ్రమం పక్కనే పెరిగిన రియల్‌ఎస్టేట్ వ్యాపారం
– సర్కారు మారటంతో మీడియా ముందుకొచ్చిన స్వామి
– కొత్తగా బాబు భజనతో అతి తెలివి
– సిగ్గులేని స్వామి అంటూ బ్రాహ్మణ సంఘాల సీరియస్
– ఆస్తులు కాపాడుకునేందుకే బాబు భజన అంటూ విమర్శలు
– స్వామి భూకబ్జాలపై విచారణకు టీడీపీ బ్రాహ్మణనేత శ్రీధర్ డిమాండ్డ్
( మార్తి సుబ్రహ్మణ్యం)

సొమ్ములోరి ఊసరివెళ్లి స్వరూపం
ఇక్కడా అక్కడా తన భోక్తలిద్దరూ
15 ఏళ్లు కొనసాగమని
తానిచ్చిన ఆశీర్వాదంతో
వారి రాజకీయ జీవితాలే
బుగ్గి అయ్యేసరికి
సర్వసంగభూఫలహార ప్రియుడు
వారిద్దరినీ త్యజించి
కొత్త బకరా భక్తుల కోసం ఎదురుచూస్తున్నాడు
ఆశీర్వ’దించే’ద్దామని.

ఆ స్వామికి సిగ్గు, ఎగ్గూలేదు… ఆస్తులు కాపాడుకోవడమే ఆయన లక్ష్యం..
మొన్నటి వరకూ జగన్‌కు పెట్టిన ముద్దులేమయ్యాయి స్వామీ..
మీ అతితెలివితేటలు ఇక ఆపండి. ఇప్పుడు ఆయన పాత చంద్రబాబు కాదు.
త్వరలో చినముషిడివాడలోని మీ వైసీపీ ఆఫీసు ఖాళీ అవుతుంది. ఇక తెలంగాణకు దుకాణం సర్దేయండి స్వామీ..
స్వామీ.. జగన్‌తో కలసి ఇంకా నదికిపోలేదా?
జగన్‌కు పెట్టిన ముద్దులు సరిపోక బాబుకు పెట్టాలనా మీ ఆలోచన?
మీరు చేసిన రాజశ్యామలయాగంతో కేసీఆర్‌ను 119 సీట్లతో గెలిపించారు. ముద్దులుపెట్టి జగన్నను 171 సీట్లతో గెలిపించారు. ఇక నాటకాలు చాలించి, మీ అసలు స్వరూపం బయటపెట్టండి స్వామీ..
– ఇదీ.. చంద్రబాబు కోసం తాను గతంలోనే పనిచేశానన్న, విశాఖ పీఠాథిపతి స్వరూపానందస్వామి వ్యాఖ్యల అనంతరం.. టీడీపీ బ్రాహ్మణ నేతలు- బ్రాహ్మణసంఘాలు కమ్ సోషల్‌మీడియా నెటిజన్లు ఆయనపై కమండలంతో కొట్టి చేసిన కామెంట్లు.

జగన్ 15 ఏళ్లు ముఖ్యమంత్రిగా కొనసాగుతారని, ఆయన రాజ్యంలో రాష్ట్రం సుభిక్షంగా ఉంటుందని, రామరాజ్యానికి జగనన్నపాలన జిరాక్సు అంటూ.. భట్రాజులు కూడా ఈర్య్యపడేలా పొగిడిన, విశాఖ పీఠాథిపతి శ్రీమాన్ స్వరూపానందుల వారు గుర్తున్నారా? లేరా?.. పోనీ పుష్కరాల్లో జగనన్న తలను, నీళ్లలో మూడుసార్లు ముంచి నలుగురి ఎదుటే నిస్సిగ్గుగా ముద్దులు పెట్టిన స్వరూపానందస్వామి గుర్తుందా? లేదా?…

పోనీ విశాఖలో భూములను కారుచౌకగా కొట్టేశారన్న నిందలు ఎదుర్కొంటున్న స్వామి తెలుసా?.. అదీ తెలియదా? ఓకే. ఐదేళ్లలో మంత్రులు,ఎమ్మెల్యేలు, నాయకులకోసం జగన్ దగ్గర పదవుల పైరవీ చేశారన్న ఆరోపణలకు గురైన స్వామి పేరైనా గుర్తుందా? ఆ.. యస్. ఆ స్వాములోరే ఈ సాములోరు.
ఇప్పుడు సదరు సాములోరు నాలిక అడ్డంగా మడతేసి.. తాను జగనన్నకు పెట్టిన ముద్దులు మర్చిపోయి.. మరో 15 ఏళ్లు జగనన్నే సీఎంగా ఉంటారన్న తన భవిష్యవాణికి భిన్నంగా.. అసలు చంద్రబాబు కోసం అప్పట్లో శ్రమదానం చేసిన కార్యకర్తను, తానేనని నిస్సిగ్గుగా చెప్పుకోవడం విమర్శలకు దారితీసింది. అప్పట్లో బాబు విజయం కోసం తానే పీఠాథిపతులను తీసుకువచ్చి, టీడీపీ విజయానికి సమిథనయ్యానని ఇప్పుడు గుర్తుచేయడం, చావు తెలివేనన్నది తెలుగుతమ్ముళ్ల వాదన.

జగన్ అధికారంలో ఉన్న ఐదేళ్లూ, దేవదాయ శాఖను శాసించింది ఈ స్వామివారే. కమిషనర్లును బిళ్లబంట్రోలు లెక్క ఆడించి, ఏ దేవాలయం తన కార్యక్రమాలకు ఎంత ఇవ్వాలన్నది నిర్ణయించిందీ ఈయనే. ఎన్ని దేవాలయలు పీఠానికి ఊడిగం చేశాయో లెక్కాపత్రం లేదు. జగనన్నను కలవలేని అల్పులంతా స్వామి వారి చానెల్ ద్వారా వెళ్లిన వారే. దానికోసం స్వామివారికి సమన్వయం చేసేందుకు సాక్షిలో పెద్ద నెట్‌వర్కే ఏర్పాటుచేసుకున్నారట.

విశాఖలో సర్కారు భూములను అప్పనంగా కొట్టేసి, దాని చుట్టూ ఉన్న భూమిని సర్కారు ఖర్చుతోనే చదును చేయించి, చుట్టుపక్కల రియల్‌ఎస్టేట్ యాపారానికి కాళ్లు తెచ్చిన సాములోరి సంగతి తేల్చాలని, ఇప్పుడు బ్రాహ్మణ సంఘం నేతలే రోడ్డెక్కి యాగీ చేయడం బ్యాడ్‌లక్. మొన్నటివరకూ సర్కారీ స్వామిగా ఉన్న స్వరూప, ఇప్పుడు నాలుక మడత పెట్టి.. నిస్సిగ్గుగా బాబు భజన చేస్తే, నమ్మేదెవరన్నది బ్రాహ్మణ సంఘాల ప్రశ్న.

పైగా స్వాములోరు కొట్టేసిన సర్కారు భూములను.. స్వాధీనం చేసుకోవాలని డిమాండ్ చేస్తున్న, బ్రాహ్మణ సంఘాల గళాలతో విశాఖ పీటం ఉక్కిరిబిక్కిరవుతోంది. చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు దర్మం గతి తప్పుతోందని, మతిలేని విమర్శలు చేసిన ఇదే స్వామి.. ఇప్పడు మాటమార్చి బాబు పాలన అద్భుతంగా ఉంటుందని కితాబివ్వడం వెనుక, ఆస్తులు కాపాడుకునే వ్యూహం ఉందన్నది టీడీపీ బ్రాహ్మణ సంఘాల ఆరోపణ. బాబు సర్కారు తన భూముల జోలికి రాకుండా ఉండేందుకు, స్వాములోరు ఇప్పటినుంచే చావు తెలివితో, ముందరకాళ్లకు బంధం వేస్తున్నారని టీడీపీ బ్రాహ్మణ సంఘాల ఉవాచ. అసలు స్వరూపా ఆక్రమించిన సర్కారు భూములపై విచారణ చేయాలన్న టీడీపీ బ్రాహ్మణ నేతల డిమాండుతో విశాఖ పీఠం వణికిపోతోందట.

LEAVE A RESPONSE