Suryaa.co.in

Editorial

జగన్‌ పై తిరుగుబాటు?

– ముగ్గురు ఎంపి, ఐదుగురు ఎమ్మెల్యేలు జంప్?
– బీజేపీలోకి ఐదుగురు ఎమ్మెల్యేలు?
– అదే దారిలో రాజంపేట ఎంపి మిథున్‌రెడ్డి, తిరుపతి ఎంపి గురుమూర్తి, అరకు ఎంపి తనూజారాణి ?
– కడప ఎంపి అవినాష్ దారెటు?
– ‘అన్న’ జగన్ కోసం పదవిని త్యాగం చేస్తారా?
– అరెస్టు కాకుండా ‘కమల’వనంలో చేరతారా?
– ఇప్పటికే పీకల్లోతు కష్టాల్లో అవినాష్
– లోక్‌సభకు పోటీచేసే యోచనలో జగన్?
– పులివెందులలో భారతీని పోటీ చేయించే వ్యూహం
– బీజేపీ వైపు బాలినేని చూపు?
– ‘ఫ్యాను’కు ముచ్చెమటలు
( మార్తి సుబ్రహ్మణ్యం)

వైసీపీ అధినేత జగన్‌కు సినిమా కష్టాలు మొదలయ్యాయి. ఓడిపోతే పరిణామాలు ఎంత చేదుగా-దారుణంగా ఉంటాయో, జగన్ అనుభవంలో అర్ధం చేసుకుంటున్నారు. 151 మెజారిటీ చూసుకుని మిడిసిపడ్డ జగన్.. ప్రజాప్రతినిధులను పురుగుల్లా చూశారు. ఇపుడు 11 మందికి నాయకుడిగా మిగిలిపోయిన తర్వాత, విధేయత ఎంత విచిత్రంగా మారుతుందో తెలుసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో జగన్ స్వయంగా తానే తిరుగుబాటును, ఎదుర్కొనే విషాద పరిస్థితి కొని తెచ్చుకుంటున్నారు.

మాజీ సీఎం జగన్‌పై వైసీపీ ప్రజాప్రతినిధులు తిరుగుబాటు బావుటా ఎగురవేసేందుకు సిద్ధమవుతున్నారు. ఐదుగురు ఎమ్మెల్యేలు, ముగ్గురు ఎంపీలు బీజేపీలో చే రేందుకు రెడీ అవుతున్నారన్న వార్తలు, ‘ఫ్యాను’కు చెమటలు పట్టిస్తున్నాయి. ఇప్పటివరకూ రాజంపేట ఎంపి మిథున్‌రెడ్డి, తిరుపతి ఎంపి గురుమూర్తి, అరకు ఎంపి తనూజారాణి బీజేపీ టచ్‌లోకి వెళ్లినట్లు ప్రచారం జరుగుతోంది. వీరిలో మిగిలిన వారిని పక్కనపెడితే..వ్యాపార సామ్రాజ్యాన్ని కాపాడుకునేందుకు, రాజకీయాల్లో కొనసాగడం మిథున్‌రెడ్డికి అత్యవసరం. పైగా ఆయనకు అమిత్‌షా కుమారుడు జైషా సహా, బీజేపీ జాతీయ నాయకులు, కేంద్రమంత్రులతో సత్సంబంధాలున్నాయి.

జగన్ సీఎంగా ఉన్నప్పుడు బీజేపీ నేతలతో మిథునే లాబీయింగ్ చేశారు. ఇప్పుడు ఆ సంబంధాల కారణంతోనే, బీజేపీ వైపు చూస్తున్నారన్న ప్రచారం పార్టీ వర్గాల్లో జోరుగా వినిపిస్తోంది. ఆ మేరకు మిగిలిన ఇద్దరు ఎంపీలతో బీజేపీలో చేరాలని నిర్ణయించుకున్నట్లు వైసీపీ వర్గాల్లో చర్చ జరుగుతోంది.

ఇదిలా ఉండగా రాష్ట్రంలో వైసీపీకి చెందిన ఐదుగురు వైసీపీ ఎమ్మెల్యేలు బీజేపీ వైపు.. ఒక ఎమ్మెల్యే టీడీపీ వైపు చూస్తున్నారన్న వార్తలు, వైసీపీని వణుకు పుట్టిస్తున్నాయి. శాసనసభ సమావేశాలు ప్రారంభమయ్యేనాటికి అసలు వైసీపీలో ఎంతమంది ఉంటారన్నది ప్రశ్నార్ధకంగా మారింది.

వైసీపీలో ఉన్నందున ఐదేళ్లు నియోజకవర్గాల్లో తమకు ఎలాంటి పనులు కావన్న ముందుచూపే, వారిని బీజేపీ-టీడీపీ వైపు నడిపిస్తోందని పార్టీ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. దానితో కేంద్రంలో అధికారంలో ఉన్న, బీజేపీలో చేరడమే రాజకీయంగా తెలివైన నిర్ణయంగా భావిస్తున్నారు.పైగా తాజా పరిస్థితులలో రాష్ట్రంలో బీజేపీకి రాజకీయ భవిష్యత్తు ఉందన్నది వారి నమ్మకమట. మరొక ఎమ్మెల్యే మాత్రం, టీడీపీలో చేరాలని భావిస్తున్నట్లు సమాచారం.

కాగా ఈ గోడదూకుళ్ల ఆటలో, కడప ఎంపి అవినాష్‌రెడ్డి ఎటు వైపు ఉంటారన్న ఆసక్తికరమైన చర్చకు తెరలేచింది. వివేకానంద హత్య కేసులో ఇప్పటికే బెయిల్‌పై తిరుగుతున్న అవినాష్ మెడపై, ఆ కేసు కత్తి వేళ్లాడుతూనే ఉంది. మారిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో.. అవినాష్‌ను ఎప్పుడైనా అరెస్టు చేసి, జైలుకు పంపించవచ్చన్న ప్రచారం జోరుగా వినిపిస్తోంది. జగన్ సీఎంగా ఉన్నప్పుడు, కేంద్రంలోని బీజేపీతో ఉన్న సత్సంబంధాల కారణంగా జగన్-అవినాష్ కేసులు నత్తలతో పోటీ పడ్డాయి. జగన్ సీఎంగా ఉన్నప్పుడు వ్యవస్థలను మేనేజ్ చేయడం వల్ల, ఇప్పటివరకూ జగన్ కోర్టుకు హాజరుకాలేదన్న విమర్శలు కూడా లేకపోలేదు.

ఈ క్రమంలో అవినాష్ ఎటు వైపు ఉంటారు? అన్న వైపా? బీజేపీ వైపా? అన్న ఆసక్తికరమైన చర్చ పార్టీ వర్గాల్లో జరుగుతోంది. గతంలో అవినాష్‌రెడ్డిపై చర్య తీసుకోవాలని సునీత కోరినప్పుడు.. ‘అతనిపై చర్య తీసుకుంటే బీజేపీలో చేరతార’ని జగన్ అన్నట్లు, స్వయంగా సునీతనే వెల్లడించిన విషయం తెలిసిందే. అదే నిజమైతే కేసుల భయానికి, అవినాష్ బీజేపీలో చేరినా ఆశ్చర్యపడాల్సిన పనిలేదంటున్నారు.

అటు జగన్ బంధువు, మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి కూడా పార్టీని వీడతారన్న ప్రచారం జరుగుతోంది. ఎన్నికల ముందు ఇళ్ల స్థలాల కోసం సీఎంఓ చుట్టూ కాళ్లరిగేలా తిరిగినా, ధనంజయరెడ్డి పట్టించుకోలేదన్న ఆగ్రహం బాలినేనిలో లేకపోలేదు. ఎన్నిసార్లు జగన్ అపాయింట్‌మెంట్ కోసం ప్రయత్నించినా ఇవ్వకపోవడం, ఎన్నికలకు ముందు ఇళ్ల స్థలాలకు నిధులు విడుదల చేయడం, తన ఇష్టానికి వ్యతిరేకంగా చెవిరెడ్డిని ఎంపీగా తీసుకురావడాన్ని బాలినేని జీర్ణించుకోలేకపోయారు. అయినా బంధుత్వం కారణంగా వైసీపీని వీడలేకపోయారు. ఇప్పుడిక వైసీపీకి భవిష్యత్తు లేదన్న నిర్ణయానికి వచ్చిన బాలినేని, బీజేపీలో చేరాలని భావిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది.

కాగా కేంద్ర రాజకీయాల్లో మార్పులు వచ్చే అవకాశం ఉందని భావిస్తున్న జగన్.. తన పులివెందుల శాసనసభ్యత్వానికి రాజీనామా చేసి, లోక్‌సభకు పోటీచేయాలని భావిస్తున్నారు. అసెంబ్లీలో తన పాత్ర ఏమీలేదని గ్రహించిన తర్వాతనే, ఆయన ఈ నిర్ణయానికి వచ్చారంటున్నారు. ఈ చర్చ గత మూడురోజులుగా పార్టీలో, అంతర్గతంగా జరుగుతోంది.
దానికోసం అవినాష్‌రెడ్డితో ఎంపీ పదవికి రాజీనామా చేయించి, ఉప ఎన్నికలో జగన్ పోటీ చేయాలని భావిస్తున్నారట. అదే సమయంలో తాను రాజీనామా చేసిన పులివెందుల స్థానం నుంచి.. భార్య భారతీరెడ్డిని బరిలోకి దించి, పార్టీ పగ్గాలు కూడా ఆమెకు అప్పగించాలని యోచిస్తున్నారట.

కోరికలు, వ్యూహాలు ఎలా ఉన్నప్పటికీ.. అవినాష్‌రెడ్డి తన ఎంపీ పదవికి రాజీనామా చేస్తారా? లేదా? అన్నదే ప్రశ్న. గత నెల వరకూ జగన్ సీఎం కాబట్టి, అవినాష్ ఆయన ఆదేశాలు పాటించక తప్పని అనివార్యత. కానీ ఇప్పుడు జగన్ అధికారంలో లేరు. పైగా ప్రస్తుతం జగన్ మేలు కంటే, తన కేసు ముఖ్యం. ఎంపీగా ఉన్నంతవరకే తనకు రక్షణ అన్న సంగతి అవినాష్‌కు తెలుసు. అందుకే ఇటీవలి ఎన్నికల్లో మీరు అసెంబ్లీకి ఈ ఓటు వేసుకుని, ఎంపీకి నాకు వేయమని అవినాష్.. టీడీపీ అసెంబ్లీ అభ్యర్ధులతో మ్యాచ్‌ఫిక్సింగ్ చేసుకున్నారన్న వార్తలు వెలువడిన విషయం తెలిసిందే.

అంటే చివరకు వైసీపీ ఓడిపోయినా.. జగన్ పరువుపోయినా ఫర్వాలేదు గానీ, తనను మాత్రం ఎంపీగా గెలిపించాలన్న అవినాష్ కోరిక బయటపడింది. అలాంటి అవినాష్ .. అన్న జగన్ కోసం తన ఎంపీ పదవిని త్యాగం చే స్తారా?.. ఇదే ఇప్పుడు వైసీపీ వర్గాలో హాట్‌టాపిక్.

విజయసాయిరెడ్డి కూడా బీజేపీ వైపే?
వైసీపీ దళపతి జగన్‌కు మరో శరాఘాతమిది. పార్టీలో చాలాకాలం నెంబర్‌టూగా ఉన్న, ఎంపి విజయసాయిరెడ్డి కూడా బీజేపీలోకి జంపయిపోతున్నారట. ఎన్నికల్లో వైసీపీ ఓడిపోతే వైసీపీ పార్లమెంటరీపార్టీ నేతగా ఉన్న వేణుంబాక విజయసాయిరెడ్డి బీజేపీలో చేరతారన్న వార్తలు, ఎన్నికల సయంలోనే జోరుగా సాగాయి. అయితే వాటిని ఆయన ఖండించకపోవడం గమనార్హం.

నిజానికి జగన్ కోసం అందరికంటే ఎక్కువ త్యాగాలు చేసిన విజయసాయిరెడ్డిని, జగన్ అనేకసార్లు అవమానించారన్న చర్చ అప్పుడే జరిగింది. విజయసాయి జైల్లో ఉన్నప్పుడు తనకు కేటాయించిన లాయర్లకు సంబంధించి, సజ్జల వ్యవహరించిన తీరుపై ఆయన ఆగ్రహంతో రగిలిపోయేవారట. తనకు ఢిల్లీ స్థాయి లాయర్లు అవసరం లేదన్న సజ్జల తీరు, అప్పట్లో ఆయనకు ఆవేదన కలిగించింది. పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడు కూడా వారిద్దరి మధ్య ఉప్పు-నిప్పుగానే ఉండేది.

అనేక జిల్లాలకు కో ఆర్డినేటర్లు, పార్టీ ఆఫీసు పెత్తన ం చేసిన విజయసాయికి అన్ని అధికారాలు కట్ చేసి, కొన్నిటికే పరిమితం చేశారు. సజ్జలతో విజయసాయి అధికారాలకు కత్తెర వేశారు. అసలు వైవి సుబ్బారెడ్డికి రాజ్యసభ సీటు ఇచ్చింది కూడా విజయసాయికి చెక్ చెప్పడానికేనన్నది ఒక ప్రచారం. ఓడపోతారని తెలిసే, విజయసాయిని నెల్లూరు ఎంపీ బరిలో దింపారన్నది మరో టాక్.

ఢిల్లీలో జగన్ కోసం పీఎంఓలో సైతం లాబీయింగ్ చేసిన విజయసాయిరెడ్డి సైతం, జగన్ తీరుతో విసిగిపోయారంటున్నారు. దానితో బీజేపీ పెద్దలతో తనకున్న సంబంధాలు వినియోగించుకుని, ఆ పార్టీ చేరాలని విజయసాయి భావిస్తున్నట్లు పార్టీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.

LEAVE A RESPONSE