Suryaa.co.in

Andhra Pradesh Political News

నాడు లగడపాటి.. నేడు కేశినేని నాని

రెండుసార్లు గెలిచి రాజకీయ సన్యాసం
(జగదీష్)

కాకతాళీయమో.. విధి విచిత్రమో తెలీదు కానీ, రాష్ట్ర రాజకీయాల్లో క్రియాశీలకంగా వ్యహరించిన విజయవాడ మాజీ ఎంపీలిద్దరు అనూహ్యంగా రాజకీయ సన్యాసం పుచ్చుకున్నారు. 2004, 2009 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుంచి రెండుసార్లు గెలుపొందిన లగడపాటి రాజగోపాల్.. రాష్ట్ర రాజకీయాల్లో సంచలన నేతగా పేరుగాంచారు.

రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా తనదైన శైలిలో పోరాడిన ఘన చరిత్ర లగడపాటి సొంతం. విభజన బిల్లు పార్లమెంటులో ఆమోదం పొందే సమయంలో పెప్పర్ స్ప్రే కొట్టి వార్తలోకెక్కిన లగడపాటి.. రాష్ట్ర విభజన తర్వాత రాజకీయ సన్యాసం పుచ్చుకున్నారు. 2014, 2019 ఎన్నికల్లో టీడీపీ నుంచి గెలుపొందిన కేశినేని శ్రీనివాస్ (నాని) తొలినాటి నుంచి వివాదాస్పద నేతగా పేరుగాంచారు.

ప్రజారాజ్యం పార్టీ నుంచి రాజకీయ రంగంలో అడుగిడిన నాని, అక్కడ ఇమడలేక టీడీపీలో చేరారు. 2019లో వైసీపీ ప్రభంజనంలోనూ గెలుపొందిన కేశినేని నాని.. పలు వివాదాలకు కేంద్ర బిందువయ్యారు. టీడీపీ అధినేత చంద్రబాబు నిర్ణయాలను వ్యతిరేకిస్తూ, పలుమార్లు ధిక్కారస్వరం వినిపించారు. నాని ప్రవర్తనతో విసిగిపోయిన చంద్రబాబు, విజయవాడ పార్లమెంట్ టిక్కెట్టును కేశినేని నాని సోదరుడు కేశినేని శివనాథ్ (చిన్ని)కి కేటాయించారు.

తదనంతర పరిణామాల్లో, నాని వైసీపీలో చేరడం.. తన సోదరుడి చేతిలో ఓటమి పాలవ్వడం చకచకా జరిగిపోయాయి. ఎంపీగా హ్యాట్రిక్ కొట్టాలని ఆశించిన కేశినేని నాని ఆశలు నెరవేరకపోవడంతో, రాజకీయాల నుంచి వైదొలగుతున్నట్లు నాని ప్రకటించారు. దీంతో, విజయవాడ నుంచి గెలిచిన తాజా మాజీ ఎంపీలిద్దరూ రాజకీయ సన్యాసం పుచ్చుకోవడం గమనించదగ్గ విషయం.

LEAVE A RESPONSE