Home » తండ్రి మీద జగన్ కు గౌరవం ఉంటే భరత్ ను పార్టీ నుండి సస్పెండ్ చేయాలి

తండ్రి మీద జగన్ కు గౌరవం ఉంటే భరత్ ను పార్టీ నుండి సస్పెండ్ చేయాలి

-ఆయన్ని సస్పెన్షన్ చేయాలని కోరడమే నేరమైతే… నన్ను పార్టీ నుంచి సస్పెన్షన్ చేయండి
-ఎమ్మెల్సీ ఎన్నికల్లో విప్ జారీ చేసే అధికారం పార్టీలకు లేదు
-పార్టీ నుంచి సస్పెండ్ గురైన ఎమ్మెల్యేలు ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తే, తమ పార్టీ రిజిస్ట్రేషన్ రద్దు కావడం ఖాయం
-నరసాపురం ఎంపీ రఘురామకృష్ణం రాజు

ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి తన తండ్రిపై ఏమాత్రం గౌరవం ఉన్న ఒక పార్టీ నుంచి గెలిచి మరో పార్టీలో చేరిన వారిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన రాజమండ్రి ఎంపీ భరత్ ను తక్షణమే పార్టీ నుంచి సస్పెన్షన్ చేయాలని నరసాపురం ఎంపీ, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు రఘురామకృష్ణం రాజు డిమాండ్ చేశారు. ఆయన్ని పార్టీ నుంచి సస్పెండ్ చేయమని కోరడమే నేరమైతే, దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి పై పడిన నిందను భరించలేకపోవడమే అభిమానులుగా నేరమైతే పార్టీ నుంచి తనని సస్పెండ్ చేయాలన్నారు. శనివారం నాడు రచ్చబండ కార్యక్రమంలో భాగంగా రఘురామకృష్ణంరాజు తన నివాసంలో మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ… ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటమిపాలైన అనంతరం రాజమండ్రి ఎంపీ భరత్ ఒక ఛానల్ డిబెట్లో మాట్లాడుతూ అమ్మ బాబుకు పుట్టిన వారెవరు ఒక పార్టీ తరపున గెలిచి మరొక పార్టీలో చేరరని చేసిన వ్యాఖ్యలు, చివరకు మా పార్టీకే తగిలాయి . టిడిపి తరఫున గెలిచి, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరిన నలుగురు ఎమ్మెల్యేలను ఆ మాట ఆయన అన్నారని ఒక వర్గం అంటూ ఉంటే, 1978లో రెడ్డి కాంగ్రెస్ తరపున ఆవు దూడ గుర్తుపై వైయస్ రాజశేఖర్ రెడ్డి గెలిచారు. గెలిచిన కొద్ది రోజులకే అప్రహతిత విజయం సాధించిన ఇందిరా కాంగ్రెస్ లో చేరారు . ఆ రెండు పార్టీలు కలిసిపోయాయని, అందుకే ఆయన ఇందిరా కాంగ్రెస్ లో చేరారని అందరూ అనుకున్నారు. అప్పట్లో యాంటీ డిఫెక్షన్ లా కూడా లేదు. అప్పట్లో ఇంతగా ఎవరు పార్టీలు మారే వారు కూడా కాదు. ఆయనకు ఎటువంటి పరిస్థితులు ఉన్నాయో, ఎందుకు పార్టీ మారారో తెలియదు. అయినా పిల్ల నల్ల కాకి మాట్లాడిన మాటలు దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డిని ఉద్దేశించి చేసినవని, జగన్మోహన్ రెడ్డి ని అవమానించడానికి అన్నారన్న వాదనలు లేకపోలేదు. సాక్షాత్తు వైయస్ రాజశేఖర్ రెడ్డి పేరిటనే పార్టీని ఏర్పాటు చేసుకొని, ఆయన పేరు ను అనేక ప్రభుత్వ సంక్షేమ పథకాలను నామకరణం చేసి, ఆయన్ని అవమానించే విధంగా మాట్లాడడం దారుణం అని రఘురామకృష్ణం రాజు మండిపడ్డారు.

సస్పెండ్ అయిన ఎమ్మెల్యేలు ఆనందంగానే ఉన్నారు
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి సస్పెండ్ అయిన నలుగురు ఎమ్మెల్యేలు ఆనందంగానే ఉన్నారని రఘురామకృష్ణం రాజు తెలిపారు. షోకాజ్ నోటీసు ఇవ్వకుండానే పార్టీ నుంచి నలుగురు ఎమ్మెల్యేలను సస్పెండ్ చేయడం విడ్డూరం. పార్టీ నుంచి సస్పెన్షన్ గురైన తర్వాత మేకపాటి మాట్లాడుతూ ఇకపై నుంచి తనకు ఐప్యాక్ గొడవ ఉండదని పేర్కొనడం పరిశీలిస్తే, పార్టీ నుంచి సస్పెండ్ అయినందుకు ఎంత ఆనందంగా ఉన్నారో ఇట్టే అర్థం అవుతుంది. ఆనం రామనారాయణ రెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిలను ఓటు వేయమని అడగలేదని సకల శాఖ మంత్రి సజ్జల రామకృష్ణారెడ్డే చెప్పారు. ఓటు వేయమని అడగనప్పుడు చర్యలు తీసుకునే అధికారం ఎక్కడిది?. ఎమ్మెల్సీ ఎన్నికల్లో విప్ జారీ చేయడానికి వీలు లేదు. పార్టీకి ఆ అధికారం ఉండదు. పార్టీ విప్ ను ఎమ్మెల్యే లు ఉల్లంగించారని ఎలా నిర్ధారిస్తారు. ఏ బి డి ఎఫ్ అని కోడ్ ఇచ్చామని చెప్పే హక్కు పార్టీకి లేదు. ఇది ఎన్నికల నిబంధనకుపూర్తి విరుద్ధం. ఇది అనాగరిక చర్య. ఇదే విషయాన్ని పార్టీ నుంచి సస్పెన్షన్ కు గురి అయిన శాసనసభ్యులు ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తే, మా పార్టీ రిజిస్ట్రేషన్ రద్దవుతుంది. ఎన్నికల్లో పార్టీ విప్ ఉల్లంగించారని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు తమ పార్టీ సభ్యులను నలుగురిని ఎందుకు సస్పెండ్ చేయలేదంటే, ఇది సహేతుకమైన కారణం కాదని ఆయనకు తెలుసు. అందుకే పార్టీ విప్ ను ధిక్కరించి ఓటు వేసిన నలుగురు ఎమ్మెల్యేలను సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకోలేదు.

పార్టీ నుంచి ఎమ్మెల్యేలను సస్పెండ్ చేయాలి అనుకుంటే, ముందు వారికి షోకాజ్ నోటీసు ఇవ్వాల్సి ఉంటుంది. షోకాజ్ నోటీసుకు వారు సమాధానం ఇచ్చిన తర్వాత, వారి సమాధానం నచ్చకపోతే పార్టీ నుంచి సస్పెండ్ చేయవచ్చు. ఏ ప్రాతిపదికన తమని పార్టీ నుంచి సస్పెండ్ చేశారని, ఇది రాజకీయ పార్టీయేనా, పార్టీలో సభ్యులకు ప్రాథమిక హక్కులు ఉండవా? అని నలుగురు ఎమ్మెల్యేలు కనుక ప్రశ్నిస్తే కచ్చితంగా ఎన్నికల సంఘం చర్యలు తీసుకునే అవకాశం ఉంది. అందులో ఎటువంటి సందేహం లేదు. ఇది కేవలం ఆవేశంతో చేసిన హత్య వంటిదని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, ఆయన సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి గుర్తించాలి. నలుగురు టిడిపి శాసనసభ్యులను ఏ ప్రాతిపదికన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థులకు ఓటు వేయాలని, తమ ఎమ్మెల్సీ అభ్యర్థులకు కేటాయించారు. ఎమ్మెల్సీ అభ్యర్థికి కోడ్ ఇచ్చామని చెప్పారు. కోడ్ ద్వారా దొరికింది లేదు. టిడిపి దగ్గర నుంచి 20 కోట్ల రూపాయలు తీసుకొని, ఆ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థికి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన నలుగురు శాసనసభ్యులు ఓటు వేశారని అంటున్నారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యులు, టిడిపి వద్ద నుంచి 20 కోట్ల రూపాయలు తీసుకొని ఓట్లు వేస్తే, టిడిపికి చెందిన నలుగురు శాసనసభ్యులకు ఓటు వేయడానికి మీరెంత ఇచ్చారు. మీరు డబ్బులు ఇవ్వకపోతే, మీ దేహ సౌందర్యం, భాషా చాతుర్యం, ఒడ్డు పొడవు చూసి ఆకర్షితులై ఓటు వేశారా అని రఘురామకృష్ణం రాజు సూటిగా ప్రశ్నించారు. ఒక పార్టీ నుంచి గెలిచి మరొక పార్టీలో అమ్మ బాబుకు పుట్టిన వారెవరు చేరరనే ఎంపీ భరత్ వ్యాఖ్యలు పరోక్షంగా తమ పార్టీ వ్యవస్థాపకుడు కానీ అధ్యక్షుడి తండ్రిని, టిడిపి నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరిన ఎమ్మెల్యేలను ఉద్దేశించి అన్నట్లుగా ఉన్నాయి. ఈ తరహా అనుచిత వ్యాఖ్యల గురించి ఆ నలుగురు ప్రశ్నించకపోవచ్చు. కానీ రాజశేఖర్ రెడ్డి అభిమానిగా తనకు మాత్రం సమాధానం చెప్పాలి. ఆ నలుగురు ప్రశ్నించిన ప్రశ్నించకపోయినా, తాను ప్రశ్నిస్తాను. కుర్ర కుంకలతో తిట్టించే ప్రయత్నం చేస్తారా? అంటూ ఆయన మండిపడ్డారు.

బాబాయిని చంపేసినంత ఈజీ కాదు…
తన నియోజకవర్గంలో ప్రజలతో కొట్టించడం అంటే బాబాయిని హత్య చేసినంత సులవు కాదని రఘురామకృష్ణం రాజు అన్నారు. నియోజకవర్గంలోకి అడుగుపెడితే తనని జనాలు కొడతారని ఒక మూర్ఖుడు అడ్డగోలు వ్యాఖ్యలు చేస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తన నియోజకవర్గానికి వస్తుంటే, రాకుండా అడ్డుకొన్న మీరు మగాళ్ళ… మూడో రకం వాళ్లా అనే అనుమానం కలుగుతుంది. తనపై నియోజకవర్గంలో దాడి చేయించేందుకు, బాబాయిని హత్య చేయించడానికి తీసుకువచ్చినట్లు, ఇతర ప్రాంతం నుంచి ఎవరినైనా తీసుకువస్తే నియోజకవర్గ ప్రజలే కైమా చేస్తారు జాగ్రత్త. ఇక మీ దాష్టికాలకు రోజులు దగ్గర పడ్డాయని ఆయన హెచ్చరించారు.

80 శాతం అప్పులు చేసిన రాష్ట్ర ప్రభుత్వం
రాష్ట్ర జిడిపి 12 లక్షల కోట్ల రూపాయలుగా ప్రభుత్వం కాకి లెక్కలు చెప్పింది. ఎఫ్ ఆర్ బి ఎం చట్టం ప్రకారం రాష్ట్ర జిడిపిలో 20 శాతానికి మించి అప్పులు చేయకూడదు. కార్పొరేషన్ పేరిట రాష్ట్ర ప్రభుత్వం వేల కోట్ల రూపాయల అప్పులు చేసిందని కాగ్ చెప్పింది. కార్పొరేషన్ పేరిట అప్పులను రాష్ట్ర ప్రభుత్వం చూపించడం లేదని కాగ్ నే పేర్కొంది. కార్పొరేషన్ల పేరిట 1.15 లక్షల కోట్ల రూపాయల అప్పులు ఉన్నట్లు సమాచారం ఉంది. కార్పొరేషన్ అప్పులు వెలుగులోకి రాకుండా మేనేజ్ చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం చెల్లించాల్సిన బాకీలు 1.75 లక్షల కోట్ల రూపాయల నుంచి 1.80 లక్షల కోట్ల రూపాయలు ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక అరాచకం తీవ్రమైంది. అయినా కాగ్ పట్టించుకోవడం లేదు. ఇదే ఒక ప్రైవేటు కంపెనీ ఇలా చేస్తే కంపెనీ లా ప్రకారం 100 కేసులు నమోదు చేసి ఉండేవారు. రాష్ట్ర ప్రభుత్వం చేసిన కార్పొరేషన్ అప్పులు ఎన్నో, చెల్లించాల్సిన బకాయిలు ఎన్నో ప్రభుత్వం మారాకైనా వెలుగులోకి వస్తాయి. రాష్ట్రాన్ని తాకట్టు పెట్టి మరి అప్పు చేసి, అక్కా చెల్లెమ్మల బాకీలు దీర్చాలని ముఖ్యమంత్రి చెప్పడం హాస్యాస్పదంగా ఉంది. ఈ అప్పులను తీర్చాలంటే రాష్ట్రాన్ని ప్రపంచ బ్యాంకు తాకట్టు పెట్టవలసి వస్తుంది. బడ్జెట్లో ప్రత్యేక ప్రొవిజన్ ఏర్పాటు చేసి, చేసిన అప్పుల బాకీలు తీరుస్తున్నారు. కొత్త అప్పులలో సింహభాగం పాత బాకీలు, వడ్డీలు చెల్లించడానికి సరిపోతుంది. ఉద్యోగులకు సకాలంలో జీతాలు చెల్లించే పరిస్థితి లేదు. ఆసరా పథకం కోసం నాలుగు వేల కోట్ల రూపాయలను అప్పుగా తెచ్చారు. కార్పొరేషన్ అప్పులను పిడి అకౌంట్లోకి తీసుకొని, ప్రభుత్వం ఖర్చు చేస్తోందని రఘురామకృష్ణంరాజు తెలిపారు. గతంలోనూ కార్పొరేషన్ అప్పుల వివరాలు తెలపాలని లేఖలు రాశాను. మళ్లీ రాస్తానని వెల్లడించారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ పర్యటన విజయవంతమైనట్లు ఉంది. ప్రత్యేక హోదా, పోలవరం పెండింగ్ బిల్లుల సాధనలో విఫలమైనప్పటికీ, వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు విచారణలో భాగంగా కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి ని అరెస్టు చేస్తామని కోర్టులో చెప్పిన సిబిఐ, ఇప్పుడు ఉలుకు పలుకు లేనట్టుగా వ్యవహరిస్తుంది. తన సోదరుడు అరెస్ట్ కాకుండా అడ్డుకోవడంలో ఆయన సక్సెస్ అయినట్లు కనిపిస్తోంది. ఈనెల 27వ తేదీన తులసమ్మ వేసిన పిటిషన్ పై విచారణ జరగనుంది. ఎన్ని గజకర్ణ గోకర్ణ టక్కు టమార విద్యలను ప్రదర్శించి సూట్ కేసులతో యుద్ధాలు చేసినప్పటికీ, డాక్టరు వైఎస్ సునీతకు న్యాయమే జరుగుతుంది. ప్రభుత్వ చర్యల వల్ల పార్టీ దెబ్బతింటుందని తాను పేర్కొన్నాను. పార్టీని ఎప్పుడు విమర్శించలేదు. పార్టీ అధ్యక్షుడిగా జగన్మోహన్ రెడ్డిని విమర్శించని తాను, ముఖ్యమంత్రిగా ఆయన పనితీరును తప్పు పట్టానని రఘురామకృష్ణం రాజు ఒక ప్రశ్నకు సమాధానంగా తెలిపారు.

Leave a Reply