‘లోకేష్ , రాహల్….’ లెగ్.. రివర్సవుతోందా?

– పాదయాత్ర తర్వాత మొదలైన టీడీపీ అద్భుత విజయాలు
– పోర్టుబ్లెయిర్‌లో టీడీపీ అభ్యర్ధి చైర్మన్ పదవి కైవసం
– అండమాన్‌లో బీజేపీతో పొడిచిన పొత్తు
– మూడు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో అనూహ్య విజయం
– రాయలసీమలోనూ మొదలైన తెలుగుదేశం విజయం
– తాజాగా ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో అద్భుత విజయం
– ‘లోకేష్ లెగ్’పై ఇక ట్రోలింగులకు తెరపడినట్లేనా?
– పాదయాత్ర ముహుర్త బలం ఫలిస్తోందా?
– రాహల్ -లోకేష్ ట్రోలింగులను అధిగమించినట్లేనా?
– జోడోయాత్రతో రాహల్.. యువగళంతో లోకేష్ పాదయాత్రలు
– రాజకీయాల్లో రాటుతేలుతున్న ఇద్దరు యువనేతలు
( మార్తి సుబ్రహ్మణ్యం)

రాజకీయాల్లో సెంటిమెంట్ బాగా పనిచేస్తుంటుంది. అది ఒక్కోసారి చాలా ప్రభావితం చూపిస్తుంటుంది. ఆ సెంటిమెంట్ వర్కవుటయితే, ఇక మిగిలిన వారు అలాంటి సాహసం చేసేందుకు భయపడుతుంటారు. ఫలానా సీఎం ఫలానా ప్రాంతానికి వెళితే, ఇక ఆ తర్వాత మాజీ అయిపోతారన్న ప్రచారం ఉంది. ఫలానా చోటకు వెళ్లిన వారికి ఆ తర్వాత, రాజకీయ నిష్క్రమణ తప్పదన్న ప్రచారం కూడా వినిపిస్తుంది. ఇంకా విచిత్రంగా ఫలానా దేవాలయానికి వెళ్లిన వారెవరూ మళ్లీ గెలవలేదన్న ప్రచారం కూడా లేకపోలేదు.

ఫలానా ఎమ్మెల్యే గెలిస్తే ఆ పార్టీ అధికారంలోకి రాదన్న ప్రచారం కూడా తరచూ వినిపిస్తుంటుంది. ఇక కొందరు అగ్రనేతలకు నామినేషన్ రోజున ఫలానా వ్యక్తి నామినేషన్ ఫీజు కడితే, గెలుస్తారన్న ప్రచారం వినిపిస్తుంటుంది. మరికొందరు ఫలానా వ్యక్తి ఎదురొస్తే విజయం ఖాయమన్న నమ్మకం ఉంటుంది. ఇవన్నీ పాలిటిక్స్‌ను ఫాలో అయ్యే వారందరికీ తెలిసినవే.

కొద్దికాలం క్రితం వరకూ టీడీపీ యువనేత నారా లోకేష్ పై కూడా, దాదాపు ఇలాంటి సెంటిమెంట్ ప్రచారంలో ఉండేది. ఆయనది ఐరన్ లెగ్ అని వైసీపీ సోషల్‌మీడియా సైనికులు తెగ ట్రోల్ చేస్తుంటారు. ఈ దేశంలో రాజకీయ ప్రత్యర్ధుల ట్రోలింగ్‌కు గురైన వారిలో ఒకరు రాహుల్‌గాంధీ అయితే, మరొకరు నారా లోకేష్. ఇద్దరినీ పప్పు అంటూ రాజకీయ ప్రత్యర్ధులు సోషల్‌మీడియాలో తెగ ర్యాగింగ్ చేసేవారు. వారి ప్రసంగాల్లో తప్పులను వెతికి మరీ ట్రోలింగ్ చేసేవారు.

కానీ ఇప్పుడు ఇద్దరికీ సీన్ రివర్స్ అయింది. ఇద్దరూ పాదయాత్రలతో తామేమిటో నిరూపించుకునే పనిలో ఉన్నారు. జనంతో మమేకమవుతున్నారు. నిజానికి ఇద్దరివీ గోల్డెన్‌స్పూన్ జీవితాలే. వడ్డించిన విస్తరే. రాహుల్ తండ్రి రాజీవ్‌గాంధీ, నానమ్మ ఇందిరాగాంధీ, ముత్తాత జవహర్‌లాల్ నెహ్రు ప్రధాన మంత్రులయితే.. లోకేష్ తండ్రి చంద్రబాబు నాయుడు, తాత ఎన్టీఆర్ ముఖ్యమంత్రులుగా సుదీర్ఘంగా పనిచేసిన వారే.

అయితే అటు రాహుల్, ఇటు లోకేష్ ఇద్దరికీ తాత, తండ్రుల వారసత్వం తప్ప, తమంతట తాము పెంచుకున్న రాజకీయ అనుభవమేమీ లేదు. విద్యార్ధి దశలో రాజకీయాల్లో పాల్గొన్న అనుభవం కూడా లేదు. అలాంటి ఇద్దరు యువనేతలు, ఇప్పుడు రాజకీయాల్లో రాటుదేలే ప్రయత్నాలు చేస్తున్నారు. టెక్నాలజీని అందిపుచ్చుకుని, నయా రాజకీయాలకు తెరలేపారు. తమ పార్టీకి టెక్నాలజీ సొగబులు అద్దే పనిలో ఉన్నారు. రాహుల్ జోడో యాత్ర పేరుతో దేశవ్యాప్త పాదయాత్ర చేస్తే, లోకేష్ యువగళం పేరుతో ఏపీలో పాదయాత్ర నిర్వహిస్తున్నారు.

ఇక లోకేష్ లక్ష్యంగా.. వైసీపీ సోషల్‌మీడియా సైనికులు విపరీతంగా ట్రోల్ చేస్తుంటారు. ఆయన భాషాశైలి, ప్రసంగంలో తత్తరపాటును ఎద్దేవా చేస్తూ ట్రోల్ చేస్తుంటారు. నిజానికి లోకేష్ మంత్రిగా ఉన్నప్పుడు కూడా మీడియాకు భయపడి మొహమాటంతో దూరంగా ఉండేవారు. ఆ తర్వాతే నిదానంగా రాటుతేలడం ప్రారంభించారు. ఇప్పుడు లోకేష్ మీడియాను పిలిచి మరీ నిర్భయంగా మాట్లాడుతున్నారు.

మొన్నామధ్య అధికార పార్టీ మీడియా ప్రతినిధిని, పిలిచి మరీ కూర్చోపెట్టిన వీడియో ఒకటి బాగా వైరల్ అయింది. అదే సందర్భంలో జగన్ విపక్ష నేతగా ఉండగా, తాము బహిష్కరించిన ఓ మీడియా ప్రతినిధిని ‘మీరెందుకు వచ్చారు. వారద్దన్నాం కదా?’ అని ప్రశ్నించిన వీడియో కూడా లోకేష్ వీడియోకు జతపరిచిన వైనం సోషల్‌మీడియాను బాగా ఆకట్టుకుంది.

ఆ తర్వాత సీఎం జగన్ తెలుగు ప్రసంగాల్లోని తప్పులు-చదవలేక పడిన తత్తరపాటును, లోకేష్ సోషల్‌మీడియా బృందం బాగా ట్రోల్ చేస్తోంది. దానితో అప్పటివరకూ లోకేష్ ఉన్న స్థానాన్ని, జగన్ ఆక్రమించినట్లయింది. ఇప్పుడు బాగా ట్రోలింగ్‌కు గురవుతున్న రాజకీయనేతల్లో, జగనన్న కూడా చేరిపోయారు. అలా ఎదురుదాడి రాజకీయాల్లో లోకేష్ కూడా ముదిరిపోయే దిశగా సాగుతున్నట్లు కనిపిస్తోంది.

ఇక లోకేష్‌ను ఐరన్‌లెగ్ అని ట్రోల్ చేసే రాజకీయ ప్రత్యర్ధులను.. ఇటీవలి కాలంలో శరపరంపరగా కొనసాగుతున్న, టీడీపీ విజయాలు ఖంగుతినిపించాయి. లోకేష్ తిరుమలలో పూజలు చేసి, కుప్పం నుంచి పాదయాత్ర ప్రారంభించారు.

లోకేష్ అన్నమయ్య జిల్లాలో పాదయాత్ర చేస్తున్న సమయంలోనే.. కేంద్రపాలిత ప్రాంతమైన అండమాన్ రాష్ట్రంలోని, పోర్ట్‌బ్లెయిర్ మున్సిపాలిటీకి చైర్మన్ ఎన్నికలు జరిగాయి. ఆ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్ధి సెల్వి బీజేపీతో పొత్తులో భాగంగా చైర్మన్‌గా గెలిచారు. ఏపీలో బీజేపీతో పొత్తు లేని టీడీపీ, అండమాన్‌లో మాత్రం పొత్తు పొడిచినట్లయింది.

ఇక వారం రోజుల క్రితమే మూడు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరిగాయి. పాదయాత్రలో ఉన్న లోకేష్‌ను ఆ సమయంలో, అధికారులు ఎన్నికల కోడ్ పదేరుతో అక్కడి నుంచి పంపించేశారు. అయితే, తనను పంపించిన రాయలసీమ గడ్డ సహా, మిగిలిన రెండు స్థానాల్లోనూ టీడీపీ అభ్యర్ధులు అనూహ్య విజయం సాధించడం విశేషం.

తాజాగా ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో, అసాధ్యమైన టీడీపీ అభ్యర్ధి అనురాధ విజయం సుసాధ్యమయింది. అవసరానికి మించి ఒక ఓటుతో, ఆమె అద్భుత విజయం సాధించడం టీడీపీ శ్రేణుల్లో సమరోత్సాహం నింపింది. నలుగురు అధికార వైసీపీ ఎమ్మెల్యేలు, జగన్‌కు ఝలక్ ఇచ్చి, సంచలం సృష్టించారు.

ఈ మూడు విజయాలూ లోకేష్ పాదయాత్రలో ఉన్న సమయంలో నమోదు కావడం విశేషం. ఫలితంగా ఆయనపై ఉన్న ‘లోకేష్ లెగ్’ అన్న విమర్శ కాస్తా, అనివార్యంగా ప్రశంసగా మారిపోయింది. ఇప్పుడిక లోకేష్‌ను ట్రోల్ చేయడానికి వైసీపీ వద్ద అస్త్రాలేమీ లేవని టీడీపీ నేతలు చెబుతున్నారు.

ఐరన్ లెగ్ అని విమర్శిస్తున్న వాళ్లే ఇప్పుడు.. ‘లోకేష్‌ది గోల్డెన్‌లెగ్’ అని ప్రశంసించక తప్పదంటున్నారు. బహుశా ఇది పాదయాత్ర ప్రారంభించినరోజు, వేదపండితులు పెట్టిన ముహుర్తబలం కూడా కావచ్చన్నది వారి ఉవాచ. ఏదైతేనేం.. లోకేష్ కూడా రాహుల్‌గాంధీ మాదిరిగా, రాజకీయ ప్రత్యర్ధుల ట్రోలింగులకు సరైన సమాధానం ఇచ్చి, తమను తాము నిరూపించుకున్నారన్నది రాజకీయ పరిశీలకుల విశ్లేషణ.

Leave a Reply