ఆంధ్రా రోడ్లు.. సుందర ముదనష్టం.. నడవడం యమా కష్టం!

-ఏజెన్సీ ఏరియా రోడ్లు సొగసుచూడతరమా?
-వాహన వేగాన్ని చూసి నత్తలూ నవ్వుతున్నాయ్
( మార్తి సుబ్రహ్మణ్యం)

ఇంటిని చూసి ఇల్లాలిని.. రోడ్లను చూసి పాలకులను చూడటం ఇప్పటి నయా స్టైల్. ఇంటిని చూసి ఇల్లాలిని చూడమన్నారు. అంటే ఇల్లాలు ఇంటిని ఎంత చక్కగా తీర్చిదిద్దితే, ఆ ఇల్లాలి శక్తిని అంత ఎక్కువగా అంచనా వేయవచ్చన్నది అప్పట్లో ఒక భావన. పెళ్లిచూపులకు వెళ్లినప్పుడు, మగపెళ్లివారు మొదట చూసేది అదే కోణంలో. అది పూర్వకాలపు సామెత. ఇప్పుడు కాలంతో పాటు సామెతలూ మారిపోయాయి. రోడ్లను చూసి పాలకులను చూడమన్నది, ఇప్పటి లేటెస్ట్ సామెత. అంటే పాలకుడి జమానాలో జరుగుతున్న అభివృద్ధికి, రోడ్లు ఒక ఉదాహరణ అన్నది ఇప్పటి జనాల కవి భావన. రోడ్లు ఎంత బాగుంటే సదరు పాలకుడు అంత పనిమంతుడన్నది జనాల అంచనా. అవి ఎంత అధ్వానంగా ఉంటే, ఏలికల పాలన అంత ఏడ్చినట్లుందన్నది అర్ధం.

ఇంతకూ ఈ ఉపోద్ఘాతం ఎందుకంటే.. ఏపీలోని నర్సీపట్నం నియోజకవర్గంలో ‘సుందర ముదనష్టం’గా మారిన రోడ్లు, గత రెండురోజుల నుంచి సోషల్‌మీడియాలో హాట్‌టాపిక్‌లా మారాయి. రోడ్ల దుస్థితిని వివరిస్తూ.. బ్యాక్ గ్రౌండ్‌లో జగనన్న అభివృద్ధి తాలూకు ప్రసంగాలు- రావాలి జగన్-కావాలి జగన్ అంటూ గత ఎన్నికల్లో వైసీపీ వినిపించిన పాలటను నెటిజన్లు రిపీట్ చేసి వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు. నర్సీపట్నం-తాండవ సర్వీసు ఆర్టీసీ బస్సు డ్రైవర్-కండక్టర్ బస్సు దిగి, గుంతల్లో పెద్ద పెద్ద రాళ్లు పేర్చి బస్సు దాటించే దృశ్యాలు ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.మొన్నామధ్య తమ గ్రామంలో ‘రోడ్లు వేయించండి మహాప్రభో’.. అంటూ జై జగనన్న నినాదాలతో బురద రోడ్డులోనే పొర్లు దండాలు పెట్టిన వీడియో ఒకటి, సోషల్‌మీడియా లోకాన్ని నివ్వెరపరిచింది.

అంతకంటే ముందు.. భిక్షాటన ద్వారా వచ్చిన చందాలతో, టీడీపీ నేతలు కొద్దిమేరకు రోడ్లు వేయించుకున్న వైనం కూడా సోషల్‌మీడియాలో వైరల్ అయింది. అది నేరం-ఘోరం-చట్టవిరుద్ధం- అంటూ అదేదో దేశద్రోహం మాదిరిగా పోలీసులు.. రోడ్లేసిన వారికి నోటీసులిచ్చారు. గతంలో గుంతలుపడ్డ రోడ్లపై జనసేన నేతలు జెండా పాతిన వైనం.. ఆంధ్రాలో సుందర ముదనష్టంగా ఉన్న రోడ్లను ప్రపంచానికి చాటాయి. వాహనవేగాన్ని చూసి చివరాఖరకు నత్తలూ నవ్వుకుంటున్న వైచిత్రి. అమ్మ పెట్టదు. అడుక్కోనివ్వదన్నట్లు… ‘అన్న వేయడు.. వేస్తే ఊరుకోడన్నట్లుంది’ట ఇప్పుడు ఆంధ్రామాలోకాల యవ్వారం.

Leave a Reply