– హెల్త్ డిపార్ట్మెంట్లో జగన్ చేసిన లీలలు అన్నీ ఇన్నీ కావు
– ఆరోగ్య శాఖలో రూపాయి బిళ్ళ లేదు
– పరిమితులకు లోబడి పార్టీని విస్తరిస్తాం
– ప్రతి కార్యకర్తకు బీజేపీ అండగా ఉంటుంది
– ఏపీ వైద్యశాఖ మంత్రి వై. సత్యకుమార్ యాదవ్
ధర్మవరం ‘‘ నా గెలుపు కార్యకర్తలు పెట్టిన భిక్ష. ఎన్నికల సమయంలో కష్టపడి పని చేసిన ప్రతి కార్యకర్తకు ధన్యవాదాలు. గల్లీ, ఢిల్లీలో ఉన్నవారిని నాయకులను చేసింది కేవలం బీజేపీ మాత్రమే ’’ నని ధర్మవరం ఎమ్మెల్యే, ఏపీ వైద్యశాఖ మంత్రి వై. సత్యకుమార్ యాదవ్ వ్యాఖ్యానించారు.
తన శాఖలోని పరిస్థితులను ప్రస్తావిస్తూ.. జగన్ వైద్యశాఖను తూట్లు పొడిచి ఖాళీ ఖజానా ఇచ్చి వెళ్లారన్నారు. రాష్ట్రంలో పరిస్థితుల దృష్ట్యా కొన్ని పరిమితులకు లోబడి పార్టీని విస్తరిస్తామని చెప్పారు.
ఇంకా సత్యకుమార్ యాదవ్ ఏమన్నారంటే…
పదవుల కోసం ఎదురు చూపులు అవసరం లేదు. ప్రతి కార్యకర్త ఏదో ఒక రోజు ఎమ్మెల్యే, ఎంపీ అవుతారు. అనేక విషయాలను పరిగణనలోకి తీసుకుని, సామాన్య కార్యకర్తకి సైతం బీజేపీ అధిష్ఠానం అవకాశం కల్పిస్తుంది. పదవుల్లో ఇవాళ మేము రేపు మరొకరు.
బీజేపీ ప్రాబల్యం తగ్గిందని ఎన్ని అసత్య ప్రచారాలు చేసినా ప్రయోజనం లేదు. భగభగ మండే సూర్యుడు నరేంద్ర మోడీ మళ్లీ గెలిచారు. పదేళ్లపాటు మోడీ ప్రధానిగా ఉన్నారు. అప్పటి ఓట్లే ఇప్పుడూ వస్తే ఆదరణ ఎలా తగ్గినట్లు? అవినీతికి వ్యతిరేకంగా అభివృద్ధి దిశగా ఏపీ ప్రజలు ఓట్లు వేశారు. పులివెందులకు ఒక వైపు.. ధర్మవరం మరో వైపు జమ్మలమడుగు కాషాయం అయ్యింది.
వైసీపీ ప్రభుత్వంలో ఆరోగ్య శాఖను, అనారోగ్య శాఖగా మార్చారు. ఆరోగ్య శాఖలో రూపాయి బిళ్ళ లేదు. అంతా అప్పులే. మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత అధికారులు చెబుతుంటే నమ్మలేకపోయా. కేంద్రం నుంచి వచ్చిన నిధులను దారి మళ్లించారు. జగన్ హెల్త్ డిపార్ట్మెంట్లో చేసిన లీలలు అన్నీ ఇన్నీ కావు. ఆరోగ్య శాఖ మంత్రిగా నాకు ప్రజలు బాధ్యతలు అప్పగించారు. కానీ ఖజానాలో మాత్రం చిల్లిగవ్వ లేదు. ఈ శాఖలో వేల కోట్లు అప్పులు ఉన్నాయి. ప్రజలు ఆరోగ్యం కోసం శాయశక్తుల పని చేస్తా.
ప్రభుత్వ భాగస్వామిగా బీజేపీ ఉంది. కొన్ని పరిమితులకు లోబడి పార్టీని విస్తరిస్తాం. ప్రతి కార్యకర్తకు బీజేపీ అండగా ఉంటుంది. ఈ స్థాయిలో తనను ఉంచిన నియోజకవర్గ ప్రజలకు ధన్యవాదాలు.