Suryaa.co.in

Editorial

ఆ ముగ్గురికీ బాబు ఝలక్

– మాజీ డీజీపీ రాజేంద్రనాధ్‌రెడ్డికి ప్రింటింగ్ కమిషనర్
– సునీల్, రిషాంత్‌రెడ్డికి నో పోస్టింగ్
– జగన్ బ్యాచ్‌కు బాబు ఝలక్
– గతంలో సునీల్, రిషాంత్‌రెడ్డి ఓవరాక్షన్
– టీడీపీ కార్యకర్తలకు సునీల్ వేధింపులు
– ఎంపి రాజుపై థర్డ్ డిగ్రీలో హస్తం
– తాజాగా ఆయనపై ఫిర్యాదు చేసిన రఘురామరాజు
– వైసీపీ కార్యకర్తలా పనిచేసిన రిషాంత్‌రెడ్డి
– ఏకంగా చంద్రబాబుపైనే హత్యాయత్నం కేసు
– బాబు ఫోన్ చేసినా తీయని రాజేంద్రనాధ్‌రెడ్డి
– టీడీపీ నేతలకు అపాయింట్‌మెంట్ ఇవ్వని నిర్లక్ష్యం
– వైసీపీ నేతలొస్తే లేచి నిలబడి విధేయత ప్రదర్శించిన వైనం
– బాబు నిర్ణయాలపై టీడీపీ శ్రేణుల ఖుషీ
– రాజేంద్రనాధ్‌రెడ్డికి పోస్టింగ్‌పై అసంతృప్తి
( మార్తి సుబ్రహ్మణ్యం)

జగన్‌రెడ్డి హయాంలో వైసీపీ కార్యకర్తలు కూడా ఈర్ష్యపడే స్థాయిలో ఆ పార్టీతో అంటకాగారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న వారికి.. చంద్రబాబు సర్కారు వరస వెంట వరస షాకులిస్తోంది. తాజాగా జగన్ ఫ్యాన్స్‌గా ముద్ర పడ్డ ముగ్గురు ఐపిఎస్‌లకు ఝలక్ ఇచ్చింది. మరికొద్దిరోజుల్లో ‘జగన్ ఫ్యాన్స్ రెడ్డి బ్యాచ్ ఐపిఎస్’లకు ఝలక్ ఇచ్చేందుకు జాబితా సిద్ధమవుతోంది. బహుశా వీరికి కొన్నేళ్ల పాటు ఎక్కడా పోస్టింగ్ ఇవ్వకపోయినా ఆశ్చర్యం లేదు.

మాజీ డీజీపీ కసిరెడ్డి రాజేంద్రనాధ్‌రెడ్డిని ప్రింటింగ్ స్టేషనరీ కమిషనర్‌గా బదిలీ చేశారు. ఫైర్ సర్వీసు డీజీగా ఉన్న సునీల్‌ను, జీఏడీలో రిపోర్టు చేయాలని ఆదేశించారు. ఆయన స్ధానంలో శంకబ్రత బగ్చీ నియమితులయ్యారు. ఎస్పీ రిషాంత్‌రెడ్డిని ఎర్రచందనం టాస్క్‌ఫోర్స్ నుంచి రిలీవ్ చేస్తూ, డీజీపీ ఆఫీసులో రిపోర్టు చేయాలని ఆదేశించింది.

టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు తన పార్టీ కార్యకర్తలను మెప్పించే బదిలీ ప్రక్రియకు తెరలేపారు. జగన్‌రెడ్డి ఐదేళ్ల హయాంలో ఆయన దన్ను చూసుకుని రెచ్చిపోయిన ఐపిఎస్, ఐఏఎస్‌లను శంకరిగిరి మాన్యాలు పట్టిస్తున్న చంద్రబాబు వైఖరిపై పార్టీ వర్గాల్లో హర్షం వ్యక్తమవుతోంది. చంద్రబాబు ఈవిధంగా వ్యవహరిస్తారని తాము ఊహించలేదని, ఆయన ఏమాత్రం మారరు. తామే మారాలన్న అభిప్రాయంతో ఉన్న పార్టీ శ్రేణులు-నేతలు తాజా బదిలీలలపై సంభ్రమాశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

తాజాగా మాజీ డీజీపీ కసిరెడ్డి రాజేంద్రనాధ్‌రె డ్డిని ప్రింటింగ్ కమిషనర్‌గా నియమించారు. నిజానికి ఇది పనిష్మెంట్ పోస్టు. పెత్తనం చేయడానికి అక్కడ ఏమీ ఉండవు. ఆయనకు అప్రాధాన్యమైన ఈ పోస్టు కూడా, ఈ పరిస్థితిలో ఎక్కువేనని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. పోలీసు శాఖలో రెడ్లకు పట్టం కట్టి, ఫోన్-వీడియో కాన్ఫరెన్సులో తనకు గిట్టని అధికారుల సంగతి చూస్తానంటూ బెదిరించే కసిరెడ్డి, అప్పట్లోనే విమర్శలు ఎదుర్కొన్నారు.

ఇటీవల పల్నాడు జిల్లా ఎస్పీగా పనిచేసిన బిందుమాధవ్‌ను.. కాన్ఫరెన్సులోనే అందరి సమక్షంలో ‘నీ సంగతి తేలుస్తా’నని, బహిరంగంగా హెచ్చరించారన్న ఆరోపణలు ఆ శాఖలో వినిపించాయి. ఇక ఎన్నికల సమయంలో రాజేంద్రనాధ్‌రెడ్డి, ఇంటలిజన్స్ చీఫ్ పీఎస్సార్ ఆంజనేయులు.. ఐజీలు.. ఎస్పీ నుంచి డీఎస్పీల వర కూ ఫోన్లు చేసి.. మళ్లీ వైసీపీనే అధికారంలోకి వస్తున్నందున, ఆ పార్టీకి వ్యతిరేకంగా పనిచేసి ఇబ్బందుల్లో పడవద్దని ెహ చ్చరించినట్లు టీడీపీ నేతలే ఆరోపించిన విషయం తెలిసిందే.

ఇక రాజేంద్రనాధ్‌రెడ్డి పార్టీ కార్యకర్తగా పనిచేశారని టీడీపీ నేతలు అప్పట్లోనే ఆరోపించారు. వివిధ సమస్యలపై వినతిపత్రాలు, ఫిర్యాదులిచ్చేందుకు వెళ్లిన టీడీపీ నేతలకు ఆయన అపాయింట్‌మెంట్ ఇవ్వలేదు. ఒకవేళ ఇచ్చినా ఆ సమయంలో ఆఫీసులో ఉండేవారు కాదు. చివరకు టీడీపీ నేతలు డీజీపీ ఆఫీసులో డీఎస్పీ స్థాయి అధికారికి వాటిని ఇచ్చి వెళ్లిపోయిన దుస్థితి. అదే వైసీపీ నేతలు వస్తే లేచి నిలబడి ఫిర్యాదులు తీసుకునేంత ప్రేమ కనబరిచేవారు.

స్వయంగా చంద్రబాబునాయుడు అనేకసార్లు ఫోన్లు చేసినా తీయని నిర్లక్ష్యం ఆయనది. అలాంటి రాజేంద్రనాధ్‌రెడ్డిని అప్రాధాన్య శాఖకు బదిలీ చేయడంపై, పార్టీ శ్రేణుల్లో హర్షం వ్యక్తమవుతోంది. అసలు ఆయనకు ఆ పోస్టింగ్ కూడా ఇవ్వడంపై చాలామంది అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఆయనకు కొన్నేళ్లు ఎక్కడా పోస్టింగ్ ఇవ్వరని తాము భావించామంటున్నారు.

జగన్‌రెడ్డి ఐదేళ్ల జమానాలో డీజీపీలను కూడా ఖాతరు చేయకుండా, జగన్ దన్ను చూసుకుని రెచ్చిపోయారన్న ఆరోపణలున్న సునీల్‌కు, ఎక్కడా పోస్టింగ్ ఇవ్వకపోవడంపై పార్టీ శ్రేణులు ఖుషీగా ఉన్నారు. సీఐడీని దుర్వినియోగం చేసి, టీడీపీ కార్యకర్తలను అమానుషంగా-అమానవీయంగా వేధించి, కేసులు పెట్టించిన సునీల్‌కు ఈ శాస్తి జరగాల్సిందేనని కార్యకర్తలు ఆనందిస్తున్నారు. కులం కార్డు అడ్డుపెట్టుకుని ఉనికి కాపాడుకుంటున్నారని అప్పట్లో ఆయనపై మాదిగ నేతలు విరుచుకుపడిన విషయం తెలిసిందే.

సోషల్‌మీడియా పోస్టింగుల పేరుతో కొన్ని డజన్ల మంది టీడీపీ కార్యకర్తలను వేధించిన సునీల్ బృందం అరాచకాలపై, టీడీపీ ఆనాడే ఆరోపణలు గుప్పించింది. అప్పటి రిటైరైన అడిషనల్ ఎస్పీ విజయ్‌పాల్‌ని తెచ్చి, టీడీపీ కార్యకర్తలను టార్చర్ చేశారని గుర్తు చేశారు. చివరకు గుంటూరు శంకర్‌విలాస్ యజమాని అయిన వృద్ధురానిలి కూడా విడిచిపెట్టకుండా, కేసులు నమోదు చేశారు. దానితో ఆమె అసలు రాష్ట్రం విడిచిపెట్టి వెళ్లిపోవలసి వచ్చింది.

ఇక ఎంపి రఘురామకృష్ణంరాజును కస్టడీ టార్చర్‌కు గురిచేసిన వైనం.. లోక్‌సభ స్పీకర్, సభాహక్కుల సంఘం వరకూ వెళ్లింది. రఘురామకృష్ణంరాజును కాళ్లపై కొడుతున్న వీడియోను, జగన్‌రెడ్డికి లైవ్‌లో చూపించి పాశవిక ఆనందం పొందారని రఘురామరాజు అప్పట్లోనే వెల్లడించారు. రాజును కస్టడీలో కొట్టినట్లు ఆసుపత్రి వర్గాలు కూడా ధృవీకరించడంతో, సునీల్ చిక్కుల్లో పడ్డారు. తాజాగా రఘురామకృష్ణంరాజు ఆ కేసులో సునీల్‌పై చర్య తీసుకోవాలని పోలీసులకు ఫిర్యాదు చేశారు. ప్రస్తుత బదిలీల్లో సునీల్ కూడా ఉండటం, ఆయనకు ఎక్కడా పోస్టింగ్ ఇవ్వకపోవడం టీడీపీ శ్రేణులను తృప్తిపరిచినట్లు కనిపిస్తోంది.

ఇక జగన్‌రెడ్డి వీరాభిమానిగా, రెడ్డికులాభిమానిగా ఆరోపణలున్న రిషాంత్‌రెడ్డిని కూడా బదిలీ చేసి, ఎక్కడా పోస్టింగ్ ఇవ్వకపోవడంపై చిత్తూరు జిల్లా కార్తకర్తలు టపాసులతో సంబరం చేసుకుంటున్నారు. చంద్రబాబునాయుడు అంగళ్లులో ప్రచారానికి వెళ్లిన సందర్భంలో, వైసీపీ కార్యకర్తలు ఆయనపై రాళ్ల దాడి చేశారు. ఆ ఘటనలో వైసీపీ కార్యకర్తలపై నామమాత్రపు కేసు కట్టిన రిషాంత్‌రెడ్డి.. దాడికి గురైన చంద్రబాబునాయుడుపై ఏకంగా హత్యాప్రయత్న కేసు నమోదు చేసి.. మీడియాముందుకొచ్చి టీడీపీపైనే విమర్శలు గుప్పించిన ‘జగనాభిమానం’పై అప్పుడే విమర్శలు వెల్లువెత్తాయి. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, చెవిరెడ్డి భాస్కరరెడ్డి ఆదేశాలు పాటించి, వారి దయ వల్ల సంపాదించుకున్న ఎర్రచందనం టాస్క్‌ఫోర్స్ బాధ్యతలను కూడా, ఇప్పుడు బాబు సర్కారు తప్పించింది.

LEAVE A RESPONSE