Suryaa.co.in

Editorial

ముద్రగడ పద్మనాభరెడ్డి అనే నేను…

– పేరు మార్చుకున్న ముద్రగడ పద్మనాభం
– పద్మనాభరెడ్డిగా గెజిట్‌లో మార్పు
– ఇక కాపుల పేరెత్తితే చెప్పుతో కొడతామన్న బలిజనాడు కన్వీనర్ ఓవి రమణ
– ముద్రగడ రెడ్డి ఎలా అవుతారంటున్న రెడ్డి సంఘం నేతలు
– మారింది పేరే తప్ప కులం కాద ంటున్న కాపు సంఘాలు
– కాపు ఉద్యమనేత ఇకపై రెడ్డినేత అంటూ సోషల్‌మీడియాలో సెటైర్లు
– కాపుకులంతో వీడిన ముద్రగడ అనుబంధం
– రాజకీయాల్లో ఇక ఆయన ప్రాధాన్యతకు తెర
( మార్తి సుబ్రహ్మణ్యం)

కొందరు లవ్‌జిహాద్‌లో భాగంగా హిందు-క్రైస్తవ మతం నుంచి ముస్లింగా మారుతుంటారు. మరికొందరు హిందు-ముస్లిం మతం నుంచి క్రైస్తవులుగా మారుతుంటారు. ఇది మనం కొన్ని దశాబ్దాలుగా చూస్తున్న మతాల ముచ్చటనే. కానీ కులాలు మారడం మీరెప్పుడైనా చూశారా? అసలు రాజ్యాంగంలో అలాంటి సౌకర్యం ఉందా? ఒక కులం నుంచి మరో కులానికి మారవచ్చా?..యస్.. మారవచ్చంటున్నారు మొన్నటి కిర్లంపూడి కాపు పీఠాధిపతి.. నేటి రెడ్డి నేత ‘ముద్రగడ పద్మనాభరెడ్డి’!

ఎవరికైనా ‘కార్డు’ ఉన్నంతవరకే గుర్తింపు. అది పోతే ఇంట్లో పనిచేసే పాలేరు కూడా పట్టించుకోడు. ఇప్పుడు ముద్రగడ పద్మనాభంరెడ్డిగా మారిన, మొన్నటి కాపు నేత ముద్రగడ పద్మనాభం కూడా అంతే. ముద్రగడ అంటే కాపులకు ఒక బ్రాండ్ ఇమేజ్. కిర్లంపూడి కేంద్రంగా ఆయన చేసిన కుల రాజకీయాలే ఆయనకు ఆ కీర్తి తెచ్చిపెట్టాయి. ముఖ్యమంత్రులను కూడా భయపెట్టే కులం కార్డు ఆయనది. ఆయన ఎక్కడ కన్నెర్ర చేస్తారోనన్న భయం పాలకుల్లో ఉండేది.

ఒక్కముక్కలో చెప్పాలంటే.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్- విభజిత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రులకు ఎంత ఇమేజ్ ఉండేదో.. ముద్రగడకూ అంతే ఇమేజ్ ఉండేది. కారణం కులం. జనాభాలో పెద్ద సంఖ్యాబలం ఉన్న కాపులకు ఆయన తిరుగులేని నాయకుడు. బట్ ఇప్పుడు ఉత్తి పద్మనాధం మాత్రమే. కాపు నుంచి రెడ్డిగా మారిన ముద్రగడ పద్మనాధరెడ్డిని, రేపటి నుంచి ఎవరూ దేకే పరిస్థితి లేదు. కిర్లంపూడి చెట్టు-పుట్టలతో సహా!

అతిగా ఆశపడ్డ మగవాడు బాగుపడినట్లు చరిత్రలో కనిపించదు. ఇది రజనీకాంత్ డైలాగు మాత్రమే కాదు. నిజజీవితంలో కూడా ఇదే కనిపిస్తుంది. ఒకప్పుడు కాపునేతగా పాలకులకు చెమటలు పట్టించిన కిర్లంపూడి కాపు పీఠాథిపతి శ్రీమాన్ ముద్రగడ పద్మనాభం, ఇప్పుడు ‘ముద్రగడ పద్మనాభరెడ్డి’గా గెజిట్‌లో పేరు మార్చుకోవడం పెను విషాదం. తమపై తమకు ఎక్కువ నమ్మకం-భ్రమలున్న వారి రాజకీయ జీవితాలు చివరాఖరకు ఇలాగే విషాదంగానే ముగుస్తుంది. అందుకు ఒకప్పటి కాపునేత-ఇప్పటి రెడ్డినేత ముద్రగడ వ్యవహారం ఒక కేస్ స్టడీ.

కొడుకు రాజకీయ భవిష్యత్తు కోసం, చివరకు కులాన్ని కూడా వదిలేసుకున్న ఒక తండ్రి త్యాగం.. ‘ప్రతి తండ్రీ ఒక ధృతరాష్ర్టుడే’నని స్పష్టం చేసేదే. వారసుల ఉన్నతి కోసం పాకులాడే తండ్రులకు ఇదో గుణపాఠం. కొడుకు రాజకీయ భవిష్యత్తు కోసం, జనసేనాధిపతి పవన్ కల్యాణ్‌ను కులం ముగ్గులోకి దింపి, తాను రాజగురువు అవతారమెత్తాలన్న ముద్రగడ వ్యూహం వికటించింది. చివరకు తన అసలు ముసుగు తొలగించి, రెడ్లపార్టీగా ముద్ర ఉన్న వైసీపీలో చేరడం మరో విషాద మలుపు. కొడుకును ఎంపీనో, ఎమ్మెల్యేనో చేసి, తన శేషజీవితాన్ని కిర్లంపూడి పీఠంలో గడిపేద్దామన్న ఆలోచన వికటించింది. తాను చేయెత్తి జైకొట్టిన జగన్ కూడా ఆయనకు ఝలక్ ఇచ్చారు.

పవన్ తనకు సీటివ్వలేదన్న కసితో.. ‘‘పిఠాపురంలో పవన్ గెలిస్తే పేరు మార్చుకుని పద్మనాభరెడ్డిగా మార్చుకుంటా’’నని మంగమ్మశపథం చేసిన ఈ మాజీ కాపునేత సవాల్‌ను, పిఠాపురం కాపులు సీరియస్‌గా తీసుకుని, జనసేన దళపతిని 70వేల మెజారిటీతో గెలిపించారు. దానితో పేరు మార్చుకోక తప్పలేదు. ఆరకంగా కాపునేత పద్మనాభం కాస్తా.. పద్మనాభరెడ్డిగా గెజిట్‌లో మార్చుకోవటం అనివార్యమయింది.

ఇప్పుడు ముద్రగడ పద్మనాభరెడ్డిది విచిత్ర పరిస్థితి. ఇకపై కాపుల గురించి మాట్లాడే నైతిక అర్హత కోల్పోయారు. అలాగని రెడ్లకు జరుగుతున్న అన్యాయంపై ఉద్యమిస్తే, రెడ్డి సంఘాలు ఆయన కులమార్పును ఒప్పుకోవడం లేదు. ‘కాపు వచ్చి మా రెడ్డి కులంలో చేరితే ఎందుకు ఆహ్వానిస్తామ’ని ముందరి కాళ్లకు బంధం వేస్తున్నారు. కాకపోతే.. రేపటి నుంచి జగనన్న పిలిచి.. టీడీపీలో ఉన్న రెడ్లపై విమర్శలు చేయమని చెబితే, అప్పుడు మహదానందంగా పద్మనాభరెడ్డి పేరుతో, విమర్శలు చేసి శునకానందం పొందవచ్చు.

అటు కాపు-బలిజ సంఘాలు కూడా.. ఇకపై కులం మారిన పద్మనాభరెడ్డి, కాపుల గురించి మాట్లాడితే సహించేది లేదని అల్టిమేటమ్ ఇస్తున్నాయి. ‘ఇకపై ముద్రగడ కాపు-బలిజల సమస్యలు, రిజర్వేషన్ల గురించి మాట్లాడితే చెప్పుతో కొడతాం. ఆయన తనంతట తానే కాపు కులం నుంచి వెలివేసుకున్నారు. ఈరోజు నుంచి ఆయనను కులం మారిన రెడ్డిగానే చూస్తామే తప్ప కాపుగా చూడం. అయినా కాపు రిజర్వేషన్ల గురించి మెట్టుతో కొడతాం. ఇక కాపుల గురించి మాట్లాడే నైతిక అర్హత ఆయన కోల్పోయారు. అప్పట్లో ముద్రగడ-జోగయ్యకు వ్యతిరేకంగా మాట్లాడిన నాపై వారి అనుచరులు దాడి చేశారు. ఇప్పుడు వారిద్దరికీ కాపు-బలిజ గురించి మాట్లాడే నైతిక హక్కు పోయింద’ని టీటీడీ మాజీ సభ్యుడు, బలిజనాడు కన్వీనర్ డాక్టర్ ఓవి రమణ వ్యాఖ్యానించారు.

దీన్నిబట్టి పాపం కులం మారిన ముద్రగడ, ఉభయభ్రష్టత్వం చెందినట్లు స్పష్టమవుతుంది. అటు కాపులకు- ఇటు కొత్తగా కులం స్వీకరించిన రెడ్లకు కాకుండా పోయిన ముద్రగడ రాజకీయ జీవితం, ఇంత విషాదంగా ముగుస్తుండటం జాలి వేస్తోంది. అన్నట్లు.. కిర్లంపూడిలో ముద్రగడతో సంసారం చేసే ఆయన ఆస్థాన కాపు సంఘ నేతలు కూడా, రెడ్డిగా రూపాంతరం చెందారా? లేదా? అన్నదే డౌటనుమానం.

అటు ముద్రగడ పద్మనాభరెడ్డి పేరు మార్పుపై సోషల్‌ మీడియాలో సెటైర్లు పేలుతున్నాయి. రేపటి నుంచి రెడ్డి కుల సమస్యలపై కంచాలు-చెంచాలు మోగిస్తారామో అని వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు. ‘ముద్రగడతో రోజూ ప్రెస్‌మీట్లలో పాల్గొనే కాపు నేతలు మాత్రం కులం మార్చులేదు. అంటే ఆయన పలుకుబడి ఏమిటో అర్ధం చేసుకోండి. కిర్లంపూడే నమ్మని ముద్రగడను ఎవరు నమ్ముతారు’ అంటూ ఎకసెక్కాలాడుతున్నారు. అటు కాపు సంఘాలు కూడా మారింది ఆయన పేరే తప్ప కులం కాద ంటున్నారు. ఫాఫం.. ముద్రగడ పద్మనాభ రెడ్డికాపు!

LEAVE A RESPONSE