Suryaa.co.in

Political News

ప్రభుత్వం ఓ యాభై శ్వేత పత్రాలు ప్రకటించాలి!

ఏదైనా ప్రభుత్వ ప్రమేయానికి సంబంధించిన ఒక అంశం పై ప్రజలలో విస్తృత అవగాహన కల్పించడం కోసం విడుదల చేసే ప్రకటన ను “శ్వేత పత్రం ” అంటారు . శ్వేత పత్రం అనే పదం కంటే , “వైట్ పేపర్ ” అనే పదం బాగా పాపులర్ కూడా . మొత్తం ప్రభుత్వం తరఫున శ్వేత పత్రం ను అధికారికం గా విడుదల చేస్తారు కనుక ; సాధారణం గా ఇందులో అసత్యాలు ఉండవు .

నిజానికి , ఈ వైట్ పేపర్ సంస్కృతి బ్రిటన్ లో 1920 వ సంవత్సరం లోనే వాడుకలోకి వచ్చింది. అప్పటి బ్రిటిష్ ప్రధాని చర్చిల్ తొలి సారిగా ఈ శ్వేత పత్రాన్ని విడుదల చేశారు. కెనడా లో అయితే, ఒక విధాన నిర్ణయాన్ని మంత్రివర్గం ముందుగా ఆమోదించి, డానికి పార్లమెంట్ అనుమతి తీసుకుని, అప్పుడు ప్రజల కోసం విడుదల చేస్తారు.

మనదేశం లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు రహస్యం ఎక్కువ. ఎక్కడ, ఎందుకు, ఎలా, ఎంత దోపిడీ చేసేదీ ప్రజలకు తెలవనివ్వరు. అందుకని, ఆ అంశం పై శ్వేత పత్రం వేయండి, ఈ అంశం పై శ్వేత పత్రం విడుదల చేయండి అంటూ ప్రతిపక్షాలు నానా యాగీ చేస్తూ ఉంటాయి.

ఇక ఆంధ్ర ప్రదేశ్ విషయానికి వస్తే; ఈ శ్వేత పత్రాల ప్రచురణ పట్ల ముఖ్యమంత్రి చంద్రబాబు కు ఆసక్తి మెండు అనే చెప్పాలి . సంస్కరణలు చేపట్టాలి అనుకున్నప్పుడు , శ్వేత పత్రాలతో ఆయన ప్రజలకు ఆయా అంశాలపై మెరుగైన అవగాహన కల్పించే ప్రయత్నాలు ఆయన చేసిన సందర్భాలు గతం లో కూడా ఉన్నాయి .

ఆ అనుభవం తో ఆయన ఇప్పుడు ఓ యాభై కి తక్కువలేని శ్వేత పత్రాలతో ప్రజల ముందు కు రావాలి . ఎందుకంటె , 2019 జూన్ నుంచి 2024 జూన్ వరకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాధికారాలను కబ్జా చేసిన వారి వ్యవహార శైలి ప్రతిదీ రహస్యమే . ప్రతిదీ అనుమానాస్పదమే .ప్రతిదీ అభ్యంతరకరమే . ప్రతిదీ బరితెగింపే .

అందుకే 151 సీట్లను 2019 లో కట్టబెట్టిన పార్టీకి ఇప్పుడు 11 మాత్రమే విదిల్చారు .అక్కడికీ ప్రజల ఆగ్రహం చల్లారినట్టు లేదు .

తమ పట్ల ఇంతటి ప్రజాగ్రహానికి కారణం తమ దుశ్చర్యలు , తమ దోపిడీలు , తమ దౌర్జన్య చర్యలు , రక రకాల నామధేయాలతో రాష్ట్రం పై దండెత్తిన తమ రామకృష్ణారెడ్డి లు , పోలీసులతో చేయించిన అరాచకాలు , యథేచ్ఛగా బొక్కేసిన ఇసుక , కొండలు , గుట్టలు , భూగర్భ వనరులు , ప్రాజెక్టులు, హత్యలు వంటివి కారణం అని వైసీపీ వారు అనుకోవడం లేనట్టు కనపడుతున్నది . ఈవీఎం ల వల్లనే ఓడిపోయాము అంటూ సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు .

అసలు , ప్రజల పట్ల ….,సమాజం పట్ల , రాష్ట్రం పట్ల ఎన్ని అరాచకాలకు పాల్పడ్డారో వారికి కూడా తెలిసినట్టు లేదు.
అవన్నీ ప్రజలకు , రాష్ట్రాన్ని ఐదేళ్ల పాటు చెరబట్టిన వారికి కూడా తెలియాల్సిన అవసరం ఉంది . అందుకే , ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శ్వేత పత్రాల బాట పట్టాల్సిన అవసరాన్ని గుర్తించాలి .

ఒక అంశం అయితే ..ఒక శ్వేత పత్రం తో సరిపెట్టవచ్చు . కానీ. , ఇప్పుడు ……; ఒక శ్వేత పత్రం అంటే సముద్రం లో ఓ నీటి బిందువు . కనీసం ఓ యాభై శ్వేత పత్రాలు అయితే , గత పాలకుల వ్యాహార శైలి రేఖామాత్రం గా రికార్డ్ చేయవచ్చు .
ఉదాహరణకు ;

1. ప్రకృతి వనరుల దోపిడీ. ఇసుక, అక్రమ మైనింగ్, కొండలు – గుట్టల అక్రమ తవ్వుడు, ఎవరు…. ఎంత చేశారు? వారికి ఎవరు రక్షణ గా నిలిచారు? ఎంత దోచారు? ప్రభుత్వం నుంచి వారికి సహకరించిన వారు ఎవరు? ఎవరు ఏ చర్యలకు అర్హులు?
2.మద్యం దుకాణాల్లో అమ్మిన మద్యం. అవి ఎక్కడ తయారయ్యాయి? ఎవరి డిస్టిలరీల్లో తయారయ్యాయి? ప్రభుత్వానికి ఎంతకు అమ్మారు? దానిని ప్రజలకు ఎంతకు అమ్మారు? క్యాష్ మాత్రమే తీసుకోడానికి కారణం ఏమిటీ? ఆ డబ్బు ఎక్కడికి వెళ్ళింది?

3.ఈ అయిదేళ్ల లో పన్నులు, గ్రాంట్ల రూపం లో ప్రభుత్వానికి వచ్చిన ఆదాయం ఎంత? అప్పులు ఎన్ని? వాటిని ఏం చేశారు?
4.రాష్ట్ర సలహాదారులు ఎవరు? వారు ఇచ్చిన సలహాలు ఏమిటీ? వారిపై ఖర్చు చేసిన జీతభత్యాలు ఎంత?
డెప్యూటేషన్ పై వచ్చిన అధికారులు ఎవరు? వారి అర్హతలు ఏమిటీ? వారికి ఇక్కడ ఇచ్చిన హోదాలు ఏమిటీ? వారి వల్ల ప్రభుత్వానికి జరిగిన లాభనష్టాలు ఏమిటీ?

5.ముఖ్యమంత్రి ఇంటికి, నిర్వహణకు, పర్యాటనలకు, సెక్యూరిటీ కి అయిన ప్రభుత్వ వ్యయం ఎంత?
6.వాలంటీర్ల వ్యవస్థ, గ్రామ వార్డు కార్యదర్సులా వ్యవస్థ ను ఎలా, ఎందుకు ఏర్పాటు చేశారు, ఆ వ్యవస్థల పనితీరు.

7. ఎంతమంది అధికారులను ప్రభుత్వానికి దూరం పెట్టారు, ఏ కారణాల వల్ల, వారిని దూరం గా ఉంచడానికి ప్రభుత్వం వ్యయం చేసిన డబ్బు ఎంత?
8. ఈ అయిదేళ్ళల్లో న్యాయవాదులపై ప్రభుత్వం చేసిన ఖర్చు ఎంత? దేనికి? ఫలితం ఏమిటి? ప్రభుత్వంలో జీతాలు, సౌకర్యాలు తీసుకుంటూ పార్టీ పనులు ఎంత మంది చేశారు?

ఇలా చెప్పుకుంటూ పోతే, గతం లో ప్రభుత్వాన్ని చెరబట్టిన వారి ప్రతి చర్యా ప్రజలను భయ కంపితులను చేసేదే.
నిజానికి, ఈ శ్వేత పత్రాలను ఏయే అంశాలపై విడుదల చేయాలి అనేది నిర్ధారించడం చిన్న విషయం కాదు.

ఇందుకు, ఒక హై కోర్టు/ సుప్రీం కోర్టు రిటైర్డ్ న్యాయమూర్తి / న్యాయమూర్తుల కమిటీ / కమిషన్ ఏర్పాటు చేయాలి.
చంద్రబాబు కావాలి అని జనం ఓటు వేయలేదు. “ఆ” పాలకులు వద్దు బాబోయ్ అని ప్రజలు ఓటు వేశారు. ప్రజల అభిమతాన్ని చంద్రబాబు, పవన్ కళ్యాణ్ అందిపుచ్చుకున్నారు. అంతే!

పగలు తలుచుకుంటే, రాత్రిళ్ళు కలల్లోకి వచ్చే పాత పాలకుల్లోని అత్యధికుల నేర మనస్తత్వాన్ని, దోపిడీని దౌర్జన్యాలను ప్రజల ముందుకు సాధికారికం గా తీసుకు రావడం లో అలసత్వం వ్యక్తమైతే, తమను ప్రజలు క్షమించరు అనే విషయాన్ని చంద్రబాబు, పవన్ కళ్యాణ్, తెలుగుదేశం ఉత్తరాధికారి నారా లోకేష్ గమనించాలి.

-భోగాది వేంకట రాయుడు

LEAVE A RESPONSE