– కేంద్ర బడ్జెట్‌లో ఏపీ కి ప్రాధాన్యం ఇవ్వడంపై ఎంపీ వేమిరెడ్డి హర్షం
– సీఎం చంద్రబాబు నాయుడు ఢిల్లీ పర్యటనలు ఫలించాయని వ్యాఖ్య
– మరిన్ని నిధులు రాబట్టేందుకే సీఎం కృషి చేస్తున్నారు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలు, అన్ని రంగాల అభివృద్ధికి సీఎం నారా చంద్రబాబు నాయుడు కృషి చేస్తున్నారని నెల్లూరు పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి అన్నారు. మంగళవారం ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సారథ్యంలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్‌లో ఆంధ్రప్రదేశ్‌కు ప్రాధాన్యం ఇవ్వడంపై ఎంపీ వేమిరెడ్డి హర్షం వ్యక్తం చేశారు.
కేంద్రం నుంచి భారీగా నిధులు రాబట్టిన కూటమి ప్రభుత్వానికి ఆయన అభినందనలు తెలియజేశారు. సీఎం చంద్రబాబు ఢిల్లీ పర్యటనలు రాష్ట్రానికి భారీ స్థాయిలో నిధులు రాబట్టేలా చేశాయని వ్యాఖ్యానించారు. సమర్థవంతమైన నాయకత్వం ఎలా ఉంటుందో సీఎం చంద్రబాబు చేసి చూపారన్నారు.
సీఎం చంద్రబాబు నాయుడు ఢిల్లీ పర్యటనల ఫలితంగా రాష్ట్రానికి కేంద్ర బడ్జెట్‌లో అధిక ప్రాధాన్యం దక్కిందని ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి అన్నారు. బడ్జెట్‌లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అమరావతి అభివృద్ధికి రూ.15 వేల కోట్ల ఆర్థిక సాయం ప్రకటించడం గొప్ప విషయమని, అలాగే భవిష్యత్తులోనూ రాజధాని నిర్మాణానికి సహాయం అందుతుందని కేంద్ర ఆర్థిక మంత్రి ప్రకటించడంపై ఆయన ధన్యవాదాలు తెలిపారు. రాష్ట్ర జీవనాడి పోలవరం పూర్తికి అధిక నిధులు కేటాయింపుపై ఎంపీ సంతోషం వ్యక్తం చేశారు. బడ్జెట్‌లో వెనుకబడిన రాయలసీమ ప్రాంతం, ప్రకాశం జిల్లా, ఉత్తరాంధ్ర జిల్లాలకు ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వడం ద్వారా ఆయా ప్రాంతాలు అభివృద్ది చెందుతాయన్నారు.
అలాగే పారిశ్రామికంగా రాష్ట్రాన్ని బలోపేతం చేసేలా హైదరాబాద్-బెంగళూరు పారిశ్రామిక కారిడార్ అభివృద్ధి, విశాఖ-చెన్నై పారిశ్రామిక కారిడార్‌లోని నోడ్‌లకు ప్రత్యేక సాయం ప్రకటించడం శుభపరిణామన్నారు. కొప్పర్తి, ఓర్వకల్లు పారిశ్రామిక కేంద్రాల అభివృద్ధి ద్వారా కంపెనీలు ఏర్పడి వేలాదిమంది యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు దక్కుతాయని అన్నారు. పూర్వోదయ పథకం ద్వారా ఆంధ్రప్రదేశ్ కి ప్రత్యేక ప్రాజెక్ట్, ఏపీ విభజన చట్టం అమలుకు పూర్తి స్థాయిలో కట్టుబడి ఉన్నామని బడ్జెట్‌లో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించడంపై ఎంపీ వేమిరెడ్డి ధన్యవాదాలు తెలియజేశారు.