Suryaa.co.in

Features

నది నవ్వుతూ పరిగెత్తుతుంది

నది నవ్వుతుంది నిండిన తానును చూసి
చెట్టును పలకరిస్తుంది ప్రేమతో మురిసి
కోయిలను ఆహ్వానిస్తుంది ఆనందముతో తడిసి
మనసు ఉయ్యాలలో ఊపిరి బిగించి నడుస్తూ..

గిరులను వసంత చిగుర్లుగా మలుస్తూ
కొండల సందుల మధ్య వయ్యారంగా తిరుగుతూ
వలపులు ఎన్నింటినో మలుపులు తిప్పుతూ
శిఖరము నుండి నేలకు జాలువారుతుంది..

చిరుజల్లులతో పులకించిపోతూ
చినుకు చినుకును ఒడిసి పట్టి నిలుపుతూ
డొంకను వంకను వాగును ఏకం చేస్తూ
సంపూర్ణ రూపాన్ని సంతరించి సాగుతుంది….

ఎండిన నేలకు అమృతాన్ని అందిస్తూ
మండిన వనానికి పచ్చదనాన్ని తొడుగుతూ
రాలిన విత్తుకు పునర్జీవం కల్పిస్తూ
మొక్కల రాశిని మురిపెంగా తీర్చిదిద్దే…

ఆకాశానికి ఆహ్వానం పలుకుతూ
బరువైన జల కుండలను నింపుకుంటూ
నేలమ్మకు పురుడు పోస్తూ
రైతన్నకు అండగా నేల నిండా పంటలు పండించే..

సముద్రములో కలవాలని తపిస్తుంది
ప్రియుడు చెంత నిలవాలని కోరుకుంటూ
ఉరుకుల పరుగుల గలగలతో సాగుతూ
నాగరికతకు ప్రాణం పోసుకుంటూ కదులుతుంది…

ధాన్య లక్ష్మికి స్వాగత సత్కారాలు చేస్తూ
మట్టిని పరమాన్నంగా మలుస్తూ
సకల జీవులకు ఆహారాన్ని సమకూరుస్తూ
పాడిపంటలకు నీటి లక్ష్మి ఆకారం శ్రీకారం చుట్టింది..

కొప్పుల ప్రసాద్
నంద్యాల
9885066235

LEAVE A RESPONSE