– దేవుడు వరమిచ్చినా కరుణించని పూజారులు
– ట్రాన్స్‌పోర్టర్ల వేలరూపాయల దోపిడీతో సర్కారుకు అప్రతిష్ట
– ఉచిత ఇసుక ఇచ్చినా ఫలితం దక్కని వైనం
– గత సర్కారు కంటే ఎక్కువ రేట్లతో ఇసుక అమ్మకాలు
– ఓవర్ లోడింగ్ విధానం సమీక్షించాలంటున్న కూటమి నేతలు
– ట్రాన్స్‌పోర్టర్ల ఇష్టారాజ్యంతో కూటమి సర్కారుకు చెడ్డపేరు
– టన్ను ఇసుక 750 రూపాయలు
– జగన్ హయాంలో 650 రూపాయలు
– వేలకోట్ల ఆదాయం వదులుకున్నా సర్కారుకు దక్కని కీర్తి
– నియంత్రణ-నిఘా లేక వేలకోట్లు పరులపాలు
– దళారీలతో ఫ్రీ ఇసుక పాలసీకి తూట్లు
– ట్రాన్స్‌పోర్టర్లకు ముకుతాడు వేసేదెవరు?
– చర్యల కొరడా ఝళిపించకపోతే బాబు ఇమేజీకి డ్యామేజీనే
– ‘మహానాడు’ క్షేత్రస్థాయి పరిశీలనలో తేలిన నిజాలు
( మార్తి సుబ్రహ్మణ్యం-వాసిరెడ్డి రవిచంద్ర)
దేవుడువరమిచ్చినా పూజారి కరుణించకపోవడమంటే ఇదే. ఏపీలో ఉచిత ఇసుక విధానం ప్రకటన, కూటమి సర్కారుకు సామాన్యులలో ఇమేజి తెచ్చిపెట్టింది. గ త జగన్ సర్కారులో జేపీ కంపెనీకి వేలకోట్ల రూపాయల కాంట్రాక్టు కట్టబెట్టి, అందులో వందలకోట్లు కొట్టేసిన విధానంతో న ష్టపోయిన సామాన్యులు-బిల్డర్లకు..బాబు సర్కారు ఉచిత ఇసుక ప్రకటన ఊరటనిచ్చింది. నిజానికి ప్రభుత్వం దాని వల్ల వేలకోట్ల ఆదాయం వదులుకుంది. ఉచిత ఇసుక ప్రకటనతో సామాన్యులు, చంద్రబాబు ఫొటోలకు పాలాభిషేకం చేసి సంబరం చేసుకున్నారు.
అయితే ఉచిత ఇసుక కూటమి ప్రభుత్వానికి మంచి పేరు తీసుకురాకపోగా.. జగన్ సర్కారు కంటే ఎక్కువ రేట్లు ఉన్నాయన్న అపప్రద మూటకట్టుకుంటున్న పరిస్థితి. దానికి కారణం ఇసుక సరఫరాపై నిఘా-నియంత్రణ కరవవడమే. ఇసుక యార్డుల వద్ద వినియోగదారులకు, కూటమి ప్రభుత్వం ఉచితంగానే ఇసుక అందిస్తున్నప్పటికీ.. ట్రాన్సుపోర్టర్ల ధనదాహం, అత్యాశ, దోపిడీ కలసి వెరసి.. ఉచిత ఇసుక పాలసీకి తూట్లు పొడిచేలా మారింది.
ట్రాన్స్‌పోర్టర్ల ధరలతో ప్రభుత్వానికి ఎలాంటి సంబంధం లేన ప్పటికీ.. విమర్శలు మాత్రం ప్రభుత్వమే ఎదుర్కొంటున్న వైచిత్రి. అంటే ప్రభుత్వం ఉచితంగా ఇసుక ఇస్తున్నప్పటికీ ట్రాన్సుపోర్టు విధిస్తున్న దారుణమైన ధరలతో, ఉచిత ఇసుక వల్ల ఉపయోగం లే దు. గత ప్రభుత్వం కంటే వంద రూపాయలు ఎక్కువే ఉందన్న భావన స్థిరపడేందుకు కారణమవుతోంది.
నయాపైసా ఖర్చు లేకుండా, వినియోగదారులు 20 టన్నుల ఇసుక తీసుకువెళ్లే వెసులుబాటు కల్పించారు. ఇసుక రేవుల నుంచి తవ్వి లోడింగ్ చేసేందుకు, కూలీలకు అయ్యే ఖర్చు కేవలం టన్నుకు 250 రూపాయలు మాత్రమే. ఈ ప్రక్రియలో ప్రభుత్వానికి ఎలాంటి సీవరేజీ లేదు. అంటే ఒక టన్ను ఇసుకకు అయ్యే ఖర్చు 5 వేలు అవుతుందన్నమాట. ట్రాన్సుపోర్టర్లు కిలోమీటరుకు 10 రూపాయల చొప్పున తీసుకున్నప్పటికీ, కేవలం 8 వేల రూపాయలు మాత్రమే అవుతుంది. కానీ క్షేత్రస్థాయిలో అందుకు జరుగుతున్నది భిన్నం.
ఉదాహరణకు అమరావతి నుంచి గుంటూరుకు దూరం 40 కిలోమీటర్లు. అంటే రానుపోను 80 కిలోమీటర్లన్నమాట. ఆ ప్రకారం 20 టన్నులకు 8 వేలరూపాయల ఖర్చవుతుంది. ఇసుక చార్జీ 5 వేలు-ట్రాన్సుపోర్టు 8 వేలు కలిపి.. 20 టన్నులకు 13వేలు అవుతున్నట్లు స్పష్టమవుతుంది.
కానీ ఇప్పుడు అందుకు భిన్నంగా ధర రెట్టింపవుతోంది. అంటే 17 వేలరూపాయలవరకు అవుతున్నట్లు వినియోగదారులు చెబుతున్నారు. ఆ ప్రకారంగా టన్ను ఇసుక 750 రూపాయలు పైగా ఖర్చు అవుతోందన్నమాట. ఇదే ఇసుక.. జగన్ హయాంలో, ఎన్నికల ముందు ఏడాదిలో 650 రూపాయలు ఉండేదని వినియోగదారులు చెబుతున్నారు.
అయితే ఈ ప్రభుత్వ హయాంలో ఈ రేటు ఎందుకు పెరిగింది? దానికి కారణం ఎవరన్న అంశంపై ‘మహానాడు’ క్షేత్రస్థాయి పరిశీలన చేసింది. ఆ సందర్భంలో అనేక ఆశ్చర్యకరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి.
ఓవర్ లోడింగ్ నిబంధనల పేరుతో, 20 టన్నులకు పరిమతం చేయడమే దీనికి ప్రధాన కారణమని అటు వినియోగదారులు, ఇటు భవన నిర్మాణ దారులు చెబుతున్నారు. గత సర్కారులో 35 నుంచి 50 టన్నుల వరకూ ఇసుక లోడింగ్ జరిగేది. ఆ క్రమంలో కింది నుంచి పైస్థాయి వరకూ 10 వేల రూపాయల ముడుపులతో నిబంధనలు గాలికొదిలి, ఇసుక రవాణా విశృంఖలంగా జరిగేది. ఆ ప్రకారం చూస్తే వినియోగదారుల కోణంలో చూస్తే.. తమకు టన్నుకు వందరూపాయలు ఆదా అయిందని వినయోగదారులు, బిల్డర్లు చెబుతున్నారు.
ఈ క్రమంలో కూటమి సర్కారు ప్రజలకు మేలు చేయాలన్న సదాశయంతో అమలుచేస్తున్న ఉచిత ఇసుక పాలసి.. ట్రాన్సుపోర్టర్ల అత్యాశ-దోపిడీతో నిరుపయోగంగా మారింది. పైగా ఇది ‘ఇప్పటి ప్రభుత్వం కంటే అప్పటి ప్రభుత్వంలోనే ధర తక్కువ’ అన్న భావన స్థిరపడే పరిస్థితి, క్షేత్రస్థాయిలో కనిపిస్తోంది.
ఫలితంగా.. ఉచిత ఇసుక ఇచ్చారంటూ ప్రజలు చంద్రబాబు ఫొటోలకు పాలాభిషేకం చేసిన ఆనందం, ఎక్కువకాలం నిలవ కపోవడం నిరాశపరుస్తోంది.
ట్రాన్సుపోర్టర్ల దోపిడీకి కూటమి సర్కారు, ప్రజల్లో అప్రతిష్ఠపాలవ డం టీడీపీ శ్రేణులను అసంతృప్తికి గురిచేస్తోంది. పోలీసు-రవాణా-మైనింగ్ శాఖల మధ్య సమన్వయం లోపించడమే ఈ సమస్యకు ప్రధాన కారణమని కూటమి నేతలు స్పష్టం చేస్తున్నారు.
ఇది వైసీపీకి వరంగా పరిణమించింది. ట్రాన్సుపోర్టర్ల దోపిడీని ఆధారం చే సుకుని.. ఉచిత ఇసుక అమలు జరగడం లేదని, ‘గతంలో కంటే ఎక్కువ వసూలు చేస్తూ ఉచిత ఇసుక అంటే ఎలా’ అని విమర్శల వర్షం కురిపిస్తున్నారు. ప్రజాప్రతినిధులు-అధికారుల మధ్య సమన్వయలోపంతో అనేకచోట్ల ఇసుక రీచ్‌లు ప్రారంభం కాలేదు. దానితో దూరం పెరగడం ట్రాన్సుపోర్టర్లకు వ ర ం-వినియోగదారులకు శాపంగా మారింది. ఈ నేపథ్యంలో ట్రాన్సుపోర్టపై ఉక్కుపాదం మోపి, ధరలు నియంత్రించకపోతే.. ప్రభుత్వానికి ఉచితంగా ఇసుక ఇస్తుందన్న మంచిపేరు బదులు, గత ప్రభుత్వంలోనే ఇసుక విధానం బాగుందన్న అభిప్రాయం స్థిరపడే ప్రమాదం లేకపోలేదని, కూటమి నేతలు హెచ్చరిస్తున్నారు. ట్రాన్స్‌పోర్టర్ల దోపిడీకి తెరదించడమే దీనికి ఏకైక పరిష్కారమంటున్నారు.