Home » జగన్.. యుపిఎస్సీ..ఒక ఏబీ వెంకటేశ్వరరావు

జగన్.. యుపిఎస్సీ..ఒక ఏబీ వెంకటేశ్వరరావు

(మార్తి సుబ్రహ్మణ్యం)

ఆంధ్రప్రదేశ్ చరిత్రలో.. అప్పుడు.. ఇప్పుడు.. ఎప్పుడూ.. ఒక ఐపిఎస్ అధికారి ముఖ్యమంత్రిని కలవని వైనం మీరెప్పుడైనా విన్నారా? కన్నారా? నో.. నెవ్వర్.. ఏ ఐపిఎస్ అయినా.. ఐఏఎస్ అయినా, పోస్టింగుల కోసమో.. లేక ప్రొటోకాల్‌ను గౌరవించో.. ఇవన్నీ కాకుండా మొహమాటం కోసమో ముఖ్యమంత్రిని కలిసి తీరాలి. తీరతారు కూడా! అలాంటిది ఒక ఐపిఎస్ అధికారి, ఈ ఐదేళ్లలో కనీసం ఒక్కసారి కూడా సీఎం ముఖం చూడలేద ంటే నమ్ముతారా? నమ్మరు కదా? ఎందుకంటే.. ఆయన డీజీపీ ఆలూరు బాల వెంకటేశ్వరరావు.. సింపుల్‌గా ఏబీ వెంకటేశ్వరరావు కాబట్టి!

పోలీసులు ఏబీగా పిలుచుకునే ఆయన బాబు సర్కారులో నిఘా దళపతిగా పనిచేశారు. ఆ సమయంలో 23 మంది వైసీపీ ఎమ్మెల్యేలను టీడీపీలో చేర్పించడంలో.. నాటి సీఎంఓ ముఖ్య కార్యదర్శి సతీష్‌చంద్ర, ఏబీవీ ఇద్దరూ శ్రమదానం చేశారన్నది వైసీపీ అధినేత జగన్, ఎంపి విజయసాయిరెడ్డి ప్రధాన ఆరోపణ. ఆ ఆరోపణలతోనే ఏబీపై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసి, ఆయనను ఎన్నికల సమయంలో తప్పించడంలో విజయం సాధించారు. ఆ తర్వాత వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ఇది తెలిసిన కథనే!

జగన్ సీఎం అయిన తర్వాత ఏసీబీ డీజీగా ఉన్న ఏబీపై సస్పెన్షన్ వేటు వేశారు. పెగాసెస్ కొనుగోలులో అవినీతి జరిగిందన్నది ప్రధాన ఆరోపణ. అసలు తాము అలాంటిదేమీ కొనలేదని, పెగాసెస్ లేదూ పొట్లకాయ లేదని ఆర్ధిక శాఖ తేల్చేసింది. ఆర్ధిక శాఖ డబ్బులిస్తేనే కదా కొనుగోలు చేసేది? అంటే అసలు ఖరీదు చేయని పరికరంలో గోల్ మాల్ జరిగింది ఆరోపించిన, సర్కారు మందబుద్ధి చూసి అప్పుడే చాలామంది విస్తుపోయారు. అది వేరే విషయం. ఆ తర్వాత కోర్టుకు వెళ్లి న్యాయం సాధించిన ఏబీకి ప్రింటింగ్ అండ్ స్టేషనరీ డీజీపీగా పోస్టింగ్ ఇచ్చారు. మళ్లీ కొద్దిరోజులకే అదే ఆరోపణలతో సస్పెండ్ చేశారు.

ఇంతజరిగినా.. తనను లక్ష్యంగా చేసుకుని జగన్ చేస్తున్న కక్షసాధింపులకు ఏబీ లొంగలేదు. వెళ్లి పోస్టింగు కోసం ప్రాధేయపడలేదు. దటీజ్ ఏబీ! చిత్రంగా ఏబీని ఏ కోపంతోనయితే పోస్టింగు ఇవ్వకుండా పక్కనపెట్టారో.. అదే కోపం ఉన్న ఐఏఎస్ సతీష్‌చంద్ర మాత్రం.. చక్కగా జగన్‌ను కలవడం, ఆయనకు మళ్లీ కీలక బాధ్యతలు ఇవ్వడం జరిగిపోయింది. ఏబీ కూడా అదే పనిచేసి ఉంటే, చక్కగా కడుపులో చల్ల కదలని చోట పోస్టింగు ఇచ్చేవారేమో తెలియదు!

అంటే 23 మంది వైసీపీ ఎమ్మెల్యేల జంపింగులో ఉత్తరాదికి చెందిన సతీష్‌చంద్ర ఉన్నా ఫర్వాలేదు గానీ, ఏబీవీ ఉంటే శిక్షించారన్న మాట. ఆ సమయంలో ఏబీకి, తెలుగు అధికారులెవరూ మద్దతునిచ్చేందుకు ధైర్యం చేయలేదు. సతీష్‌చంద్ర వెనుక నార్త్‌లాబీ మొత్తం దన్నుగా నిలిచింది. అదే తేడా!

ఈ మొత్తం వ్యవహారంలో.. ఏ టీడీపీ కోసం ఏబీవీ ఇవన్నీ చేశారని ఆరోపిస్తున్నారో.. ఆ టీడీపీ మాత్రం బహిరంగంగా ఇప్పటిదాకా ఏబీ కోసం పోరాడింది లేదు. నిలబడిందీ లేదు. పైగా అసలు ఆయన వల్లే టీడీపీ ఓడిందన్న ప్రచారం నడిచింది. టీడీపీ అగ్రనేతలు సైతం ఇప్పటికీ అలాంటి అభిప్రాయంతోనే ఉంటారు. అయితే చాలామందికి తెలియని విషయం ఏమిటంటే… ఏ వ్యవస్థలోనయినా కొందరు బలిపశువులుంటారు. కథంతా వారిపైనే నడుస్తుంటుంది. అప్పుడు కూడా ఏబీ పేరుతోనే కథ నడిచినట్లుంది. అది వేరే ముచ్చట.

ఇక ఇప్పుడు ఏబీ సస్పెన్షన్ కేసు క్యాట్ ముందుకొచ్చింది. అంటే ఏబీ సస్పెన్షన్ కథ క్లైమాక్సుకు చేరిందన్నమాట. మొన్ననే వాడి వేడి వాదనలు జరిగాయి. ఆధారాలేవని క్యాట్ సర్కారుకు తలంటుపోసింది. మీ దగ్గరున్న అన్ని డాక్యుమెంట్లు ప్రవేశపెట్టమని ఆర్డరేసింది. దానికంటే ముందు ఏం జరిగింది? యుపిఎస్సీ ఏం చేసింది? ఏబీవీ దానికి ఏం సమాధానం రాశారు? ఈ కేసులో జగన్‌కు అనుకూలంగా కథ నడిపించిన ఆ బెంగళూరు స్వామి ఎవరు? తెలుసుకోవాలంటే ఇది చదవాల్సిందే.

ప్రస్తుతం వార్తా పత్రికల్లో వస్తున్న కథనాల ప్రకారం డీజీపీ ఏబీ వెంకటేశ్వరరావు మీద పెట్టిన క్రమశిక్షణ చర్యల కేసును ఒక కొలిక్కి తీసుకురాకుండా తాత్సారం చేస్తున్న జగన్ ప్రభుత్వ పని తీరు హాస్యాస్పదంగా తయారైంది. ఒక రూలు, పద్దతి లేకుండా అధికారముంది కదాని ఒక అఖిల భారత సర్వీస్ అధికారితో ప్రవర్తిస్తున్న తీరు రాబోయే రోజుల్లో అందరు అధికారులనూ ముంచుతుంది.

సరే ఈ కథేంటో చూద్దాం. జగన్ ప్రభుత్వం ఏబీ మీద కక్ష సాధింపుకు పూనుకుంది. అంతే కాదు, ఏబీ ని ఒక ఉదాహరణగా చూపి మొత్తం ఐ పి ఎస్ అధికారుల్ని చిగురుటాకుల్లా వణికించేశారు. ఎల్ వీ సుబ్రహ్మణ్యం ని చూపించి ఐఏఎస్ ఆఫీసర్లని కంట్రోల్ చేసినట్టు. ఏబీ మీద పిచ్చి పిచ్చి ఆరోపణలతో 2020 ఫిబ్రవరి లో సస్పెండ్ చేసి, శాఖాపరమైన విచారణకు ఆదేశించారు.

విచారణ 2021 ఏప్రిల్లో పూర్తయ్యింది. ఒక మూల మూలుగుతున్న సిసోడియా అనే అధికారికి పోస్టింగ్ ఆశ చూపించి సాక్షులు చెప్పిన నిజాలతో సంబంధం లేకుండా, కొన్ని ఆరోపణలు నిరూపణయ్యాయని రిపోర్టు రాయించారు. ప్రతిఫలంగా సిసోడియాకి గవర్నర్ సెక్రటరీ గా పోస్టింగ్ ఇచ్చారు. మళ్ళీ కొద్దీ నెలల్లోనే ఒక ఉద్యోగ సంఘం నాయకుడికి గవర్నరుతో అప్పోయింట్మెంట్ ఇప్పించాడనే కోపంతో అక్కడ్నుంచి కూడా పీకేశారు. జగన్ ని నమ్ముకుని తప్పుడు పనులు చేసే అధికారులందరికీ ఈ వాతలు తప్పలేదు. ఇంకా శాంపిల్స్ కావాలంటే గౌతమ్ సవాంగ్, సునీల్ కుమార్, ప్రవీణ్ ప్రకాష్ లని చూడండి.

సరే అసలు విషయానికొద్దాం. ఏబీ మీద విచారణ జరిపి సిసోడియా ఇచ్చిన రిపోర్టు పట్టుకుని జగన్, ఏబీ ని డిస్మిస్ చేయాలని 2021 జులైలో కేంద్రాన్ని అడిగాడు. కేంద్రం రూల్స్ ప్రకారం, యుపిఎస్సీ ని అభిప్రాయం అడిగింది. జగన్ మనుషులు యుపిపిఎస్సీ మీద కూడా విపరీతమైన ఒత్తిడి పెట్టారు. కానీ ఆ ఒత్తిడి పాక్షికంగానే పనిచేసింది. డిస్మిస్ కుదరదు, కావాలంటే ఇంక్రెమెంట్లు కోసుకోండి అని యుపిఎస్సీ 2022 అక్టోబర్ లో సలహా ఇచ్చింది. కేంద్రం ఒక మంచి పోస్ట్ ఆఫీస్ లాగా 2023 జనవరి లో జగన్ ని ఆ రకంగానే నిర్ణయం తీసుకోమంది.

రూల్స్ ప్రకారం యుపిఎస్సీ ఇచ్చిన సలహా ఏబీ కి పంపి తన రెస్పాన్స్ అడిగినప్పుడు ఏబీ , యుపిఎస్సీ ఇచ్చిన విశ్లేషణను తూర్పార పట్టి యుపిఎస్సీ సలహా ఎంత లోపభూయిష్టంగా ఉందో, అసలు రికార్డులో లేని విషయాలను యుపిఎస్సీ ఉటంకించడంతో, అసలా సలహా యుపిఎస్సీ దా, లేక ఎవరైనా రాసిస్తే సంతకం పెట్టారా అని మొహమాటం లేకుండా ప్రశ్నించాడు ఏబీ . సరే ఏబీ ఏం చెప్పినా వినేవాడెవడు? ఏం ప్రశ్నించినా సమాధానం

జగన్ కేంద్రం సూచించినట్టు నిర్ణయం తీసుకోపోగా, కేసును మళ్ళీ తిప్పి కేంద్రానికి పంపాడు. ఏబీ దగ్గర స్వాధీనం చేసుకున్న కంప్యూటర్ లో కొన్ని ఈమెయిల్ లు దొరికాయని, కాబట్టి ఏబీ ని డిస్మిస్ చెయ్యాల్సిందేననీ 2023 జులై లో మళ్ళీ కేంద్రానికి పంపాడు. 2023 మే లో అవినాష్ రెడ్డి అరెస్టు ఆపినట్టే, బెంగుళూరు స్వామీజీ లను ప్రయోగించి ముందస్తు బెయిల్ ఇప్పించినట్టే, ఏబీ డిస్మిస్ ఆర్డర్ కూడా తెచ్చుకుందామనుకున్నాడు.

కేంద్రం అసలా లెటర్ని చెత్త బుట్టలో పడేయాలి. కానీ స్వామీజీ మహత్యమో ఏమో, మళ్ళీ యూపీఎస్సీ కి పంపింది. ఈ విషయం తెలుసుకున్న ఏబీ కేంద్రానికి, యుపిఎస్సీ కి ప్రోపర్ ఛానల్ ద్వారా లెటర్లు పెట్టాడు. యేమని? ఒకసారి విచారణ పూర్తయ్యాక కొత్త సాక్ష్యాలను, నాకు చెప్పకుండా, నా వివరణ తీసుకోకుండా వాటి ఆధారంగా మీ పాత నిర్ణయాలను ఎలా మార్చుకుంటారు? అది సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధం కదా?

మీకు అంతగా ఆ సాక్ష్యాలను పరిగణనలోకి తీసుకోవాలనిపిస్తే, ఇంతకు ముందు చేసిన విచారణని క్యాన్సిల్ చేసి, మళ్ళీ విచారణ మొదలెట్టండి, నేను రెడీ అని రాశాడు. అసలా కొత్తగా ‘కనిపెట్టిన’ సాక్ష్యాల్లో ఏమీ లేదు. అసలేమైనా తప్పు చేసుంటేగా సాక్ష్యాలకు భయపడడానికి?

యుపిఎస్సీ తీరిగ్గా ఇదే విషయం చెప్పింది. కొత్త సాక్ష్యాలను ఏబీ పరోక్షంలో ఎలా పంపుతారు, ఎలా పరిశీలించమంటారు అని గడ్డి పెడుతూ 2024 జనవరిలో యుపిఎస్సీ కేంద్రానికి రాస్తే, పోస్టాఫీస్ లాంటి కేంద్రం అదే నెలలో ఆ గడ్డి జగన్ కి పార్సెల్ చేసింది.

యుపిఎస్సీ ఇంతకుముందు ఇచ్చిన పాత సలహా మేరకు.. ఏబీ పై శాఖాపరమైన విచారణ విషయంలో నిర్ణయం తీసుకుని, తమకు తెలియపరచమని అడిగింది. జగన్ వైపు నుంచి చర్యలు శూన్యం. మార్చ్ 2024 లో మళ్ళీ కేంద్రం అడిగింది, ఆ సంగతేమ్ చేసావ్ అని. ఇప్పటికీ సౌండు లేదు.

అయినా, ఒక సారి విచారణ పూర్తయ్యాక కొత్త సాక్ష్యాలు ప్రవేశ పెట్టగూడదనే ఇంగిత జ్ఞానం స్టేట్ మొత్తంలో ఏ అధికారికీ, చీఫ్ సెక్రటరీ కి, సీఎంఓ అధికారులకీ లేకపోవడం అసలు విషాదం.
AB-Venkateswara-Rao-1

Leave a Reply