తిరుపతి..గోవిందా గోవిందా!

– సిటీ.. పిటీ పిటీ
– రేపటి నుంచి రంగంలోకి టీడీపీ బృందాలు
– ఈ పాపం ఎవరిది?
– చిత్తూరు జిల్లా జలమయం
( మార్తి సుబ్రహ్మణ్యం)
కలియుగ దైవం వెంకటేశ్వరస్వామి కొలువైన తిరుమల కొండ, కింద ఉన్న తిరుపతి నగరం జలంలో మునిగిపోయింది. కొండమీద నీటి ప్రవాహానికి అన్నీ కొట్టుకుపోయాయి. చివరకు మనుషులు కూడా నీటిలో కొట్టుకుపోతున్న దృశ్యాలు దయనీయంగా ఉన్నాయి. కొండపైన, నడక దారి మొత్తం నీటి లో మునిగిపోయాయి. ఇక వాహనాలు వెళ్లే దారిలో కొండచరియలు, చెట్లు విరిగిపడ్డాయి. కొండ కింద ఉన్న తిరుపతి నగర విషాదమయితే మాటలకు అందడం లేదు.


కాలనీలన్నీ నీటిలో మునిగిపోగా, వాహనాలు కొట్టుకుపోయాయి. కరెంటు సరఫరా కూడా నిలిచిపోవడంతో నగర జీవనం స్తంభించిపోయింది. జనం ఇళ్లకే పరిమితం కావల్సిన దుస్థితి. ప్రధానంగా.. దైవదర్శనాలకు వచ్చిన భక్తుల ఇబ్బందులు వర్ణనాతీతం. ముందే తిరుగు ప్రయాణాలు బుక్ చేసుకున్నవారు, కొండపైకి వెళ్లాల్సిన భక్తులు తిరుమల-తిరుపతిలో చిక్కుకుపోయారు. అటు హోటళ్లకు వెళ్లే అవకాశం లేకపోవడం, ఇటు ఎక్కడుండాలో తెలియని అయోమయ పరిస్థితి వారిది. విద్యుత్ సరఫరా లేకపోవడంతో సెల్‌ఫోన్లు చార్జింగు పెట్టుకోలేని దుస్థితి మరొకవైపు. రేణిగుంట ఎయిర్‌పోర్టులో విమానాలు కదలలేదు. ఒక్క తిరుమల-తిరుపతి మాత్రమే కాకుండా, చిత్తూరు జిల్లా మొత్తం నీటిలో చిక్కుకున్న విషాద దృశ్యాలు కనిపిస్తున్నాయి.

కాగా.. తిరుమల-తిరుపతిలో ఈ విషాదదృశ్యాలు ఇటీవలి కాలంలో అలవాటుగా మారాయని, దీనికి ప్రభుత్వ ముందుచూపు లోపమే కారణమని, తిరుపతి వాసులు విరుచుకుపడుతున్నారు. వరదముంపు ప్రాంతాలను గుర్తించి, వారిని ముందస్తుగా ఇతర ప్రాంతాలకు తరలించకపోవ డంపై ఆగ్రహం వ్యక్తమవుతోంది. ‘ప్రభుత్వ నిర్లక్ష్యమే ఈ విపత్తుకు కారణం. వాతావరణ శాఖ హెచ్చరికలు

పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్ల సామాన్యులు, పేదలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముంపు ప్రాంతాల వారిని ఇప్పటికయినా తరలించే ప్రయత్నాలు చేయకపోవడం దారుణం. ఇకనయినా ప్రత్యేక దళాలతో వారిని తరలించాలి. భక్తులను వారి గమ్యస్థానాలకు చేర్చాల’ని టీడీపీ ప్రధాన కార్యదర్శి లోకేష్ డిమాండ్ చేశారు.

ఈ నేపథ్యంలో తన సొంత చిత్తూరు జిల్లా దుస్థితి తెలుసుకున్న మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు రేపటి నుంచి సహాయచర్యల్లో దిగాలని తన పార్టీ యంత్రాంగాన్ని ఆదేశించారు. నీటిలో చిక్కుకున్న వారికి సాయం అందించేందుకు, అన్నీ కోల్పోయిన పేదలు, చేతివృత్తుల వారిని ఆదుకునేందుకు ఎన్టీఆర్ ట్రస్టు పక్షాన సాయం అందించాలని నిర్ణయించారు.

Leave a Reply