Suryaa.co.in

Editorial

వేచి ‘ఉండి’న ‘రాజు’కు అసెంబ్లీ సీటు

– ఉండి టీడీపీ అభ్యర్ధిగా ఎంపి రఘురామకృష్ణంరాజు
– నర్సాపురం ఎంపీ అభ్యర్ధి సీటు మార్పిడికి బీజేపీ నో
– ఉండి బీజేపీకి ఇస్తామన్నా ఒప్పుకోని బీజేపీ
– ఏలూరు ఎంపీ ఇచ్చి నర్సాపురం తీసుకుంటామన్నా అంగీకరించని బీజేపీ
– రాజు ఎంపీ సీటు కోసం చివరిదాకా ప్రయత్నించిన చంద్రబాబు
– బాబు సమక్షంలో రేపు రాజు టీడీపీలో చేరిక?
– అయినా రాజుకు ఎంపీ సీటివ్వాలంటూ సోషల్‌మీడియాలో కొనసాగుతున్న ఉద్యమం
( మార్తి సుబ్రహ్మణ్యం)

నర్సాపురం ఎంపీ సీటును రఘురామకృష్ణంరాజుకు ఎట్టి పరిస్థితిలో ఇవ్వకూడదన్న బీజేపీ పంతమే చివరకి నెగ్గేలా కనిపిస్తోంది. సీఎం జగన్‌తో ఉన్న మొహమాటం కారణంతో.. ఆ సీటు వదిలేయాలన్న బీజేపీ కీలకనేత ఒత్తిడి ఫలించే సూచనలు కనిపిస్తున్నాయి. ఈ విషయంలో టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు చివరి వరకూ రఘురామరాజు కోసం చేసిన ప్రయత్నాలు, ఫలించే అవకాశం కనిపించడం లేదు. దానితో టీడీపీనే చొరవ తీసుకుని, తన ఉండి అసెంబ్లీ స్థానాన్ని, రఘురామరాజుకు కేటాయించేందుకు సిద్ధపడింది. అయితే చివరి నిమిషంలో ఏదైనా అద్భుతం జరిగి, రఘురామరాజుకు ఎంపీ ఇస్తారన్న ఆశలు ఆయన అభిమానుల్లో తొంగిచూస్తున్నాయి.

నర్సాపురం ఎంపీ సీటు కోసం చివరివరకు వేచి ‘ఉండి’నందుకు, రఘురామకృష్ణంరాజుకు చివరకు అసెంబ్లీ దక్కేలా ఉంది. ఆయన ఉండి టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్ధిగా బరిలో దిగనున్నట్లు తెలుస్తోంది. అన్నీ కలసివస్తే ఆయన.. శుక్రవారం చంద్రబాబునాయుడు భీమవరం పర్యటనలో టీడీపీలో చేరే అవకాశాలు కనిపిస్తున్నాయి.

పోలీసులు, అధికార యంత్రాంగం సాయంతో జగన్ అన్ని వ్యవస్థలనూ గుప్పిట్లో పెట్టుకుని, టీడీపీ నేతలను భీతావహులను చేస్తున్న రోజులవి. కేసులతో హడలెత్తించిన కాలమది. నియోజకవర్గ ఇన్చార్జిలు ఇస్తామన్నా మాకు వద్దని బెంగళూరు, హైదరాబాద్, చెన్నైలో వ్యాపారాలు చేసుకుంటున్న మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు.. వైసీపీతో యుద్ధమంటేనే పారిపోయిన రోజులవి. చివరకు పార్టీ ఆఫీసుపైనే వైసీపీ ముష్కరమూకలు దాడి చేసినా ఎదుర్కోలేని నిస్సహాయ పరిస్థితి.

అప్పుడు అధినేత చంద్రబాబునాయుడు మాత్రమే ఒంటరి సేనానిలా యుద్ధం చేస్తున్నారు. జనసేన దళపతి పవన్ కల్యాణ్ ఎక్కువ కాలం షూటింగులలో నిమగ్నమై, అప్పుడప్పుడూ ఆంధ్రా పర్యటనలకు వచ్చిన రోజులు. నాటి బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ, ఎంపి సుజనాచౌదరి, జాతీయ కార్యదర్శి సత్యకుమార్, ఆదినారాయణరెడ్డి లాంటి వారు మాత్రమే వైసీపీని ఢీకొన్న కాలమది. ఒకదశలో బీజేపీనే ఏకైక ప్రతిపక్షంలా పోరాడుతుందన్న భావన ఏర్పడింది. అప్పుడే కన్నాను మార్చడం ద్వారా బీజేపీ ఆ ఊపును విజయవంతంగా చంపేసుకుంది.

ఆ సమయంలో నర్సాపురం వైసీపీ ఎంపి రఘురామకృష్ణంరాజు తన పార్టీ అధినేత-సీఎం జగన్‌తో ప్రత్యక్ష యుద్ధానికి తెరలేపారు. నేరుగా జగన్‌పై అస్త్రశస్త్రాలతో యుద్ధం ప్రారంభించారు. ‘రచ్చబండ’తో రచ్చ చేశారు. జగన్ సర్కారుపై కేంద్రానికి ప్రతిరోజూ లేఖాస్త్రం సంధించడం ప్రారంభించారు. చివరకు జగన్ బెయిల్ రద్దు చేయాలని సుప్రీంకోర్టులో పిటిషన్ వేసేంత వరకూ వెళ్లారు. దానితో రాజుకు గుణపాఠం చెప్పాలనుకున్న జగన్.. హైద రాబాద్ పుట్టినరోజు వేడుకలో ఉన్న రఘురామరాజును, గుంటూరుకు బలవంతంగా ఎత్తుకెళ్లారు. శారీరక హింసల తర్వాత, కోర్టు జోక్యంతో ఆయనకు బెయిల్ దక్కింది. అప్పుడే రాజుకు దేశవిదేశాల్లోని తెలుగువారి సానుభూతి హిమాలయమంత ఎత్తు పెరిగింది.

ఇక అక్కడి నుంచి మరింత రెచ్చిపోయిన రఘురామరాజు.. సీఎం జగన్‌పై అన్నింటికీ తెగించి యుద్ధం కొనసాగించారు. ప్రధాని, హోంమంత్రి, ఆర్ధిక మంత్రులకు శరపరంపరగా ఫిర్యాదులు చేశారు. సీఎస్, డీజీపీ, సీఐడీ చీఫ్‌లపై ఫిర్యాదు చేశారు. మద్యం అమ్మకాలకు డిజిటల్ పేమెంట్ లేని ఏకైక రాష్ట్రం ఏపీయేనని లోక్‌సభకు వెల్లడించారు. ఇసుక తవ్వకాలు, దళితులపై దాడులు, దేవాలయాలపై దాడుల అంశాన్ని ప్రస్తావించారు. దేశంలోని లోక్‌సభ-రాజ్యసభ సభ్యులు, రాజకీయ పార్టీల అధ్యక్షులకు జగన్ పాలన గురించి లేఖలు పంపించి సంచలనం సృష్టించారు.

దమ్ముంటే తనపై అనర్హత వేటు వేయాలని జగన్‌కు సవాల్ విసిరి, ఇప్పటిదాకా వేటు వేయించ లేకపోయారు. అంటే ఏపీలో జగన్‌పై యుద్ధం చేసేందుకు విపక్షాలు భయపడిన రోజుల్లోనే.. రఘురామరాజు విపక్షాలకు అస్త్రంలా మారార ని మెడపై తల ఉన్న ఎవరికైనా అర్ధమవుతుంది. అంటే రఘురామరాజు విపక్షాలకు స్ఫూర్తి నిచ్చారా? లేక విపక్షాలే రఘురామరాజుకు స్ఫూర్తినిచ్చాయా అన్నది సులభంగా అర్ధమయిపోతుంది.

అప్పటినుంచి రఘురామరాజు ప్రారంభించిన ‘రచ్చబండ’ సామాన్యుల వరకూ చేరింది. ప్రతిరోజూ టీవీ చానెళ్లు, ఫేస్‌బుక్ ద్వారా రాజు రచ్చబండ చూసిన దేశ విదేశాల్లోని తెలుగువారు ఆయనకు వీరాభిమానులయిపోయారు. కారణం ఎవరూ ఎదిరించని జగన్‌పై ఆయన ప్రత్య యుద్ధం చేయడమే. చంద్రబాబు అరెస్టు తర్వాత హైరరాబాద్‌లో ఐటి నిపుణులు, ఏపీ మూలాలున్న వారు నిర్వహించిన సభలకు, రాజునే ముఖ్య అతిథిగా పిలిచారంటే ఆయనకు రచ్చబండ ఎంతటి ఇమేజ్ తెచ్చిపెట్టిందో సుస్పష్టం. చివరకు ఆయన విదేశీ పర్యటనల్లోనూ తెలుగువారు ఆయనకు బ్రహ్మరథం పట్టారు. ఆయనతోపాటు ఉన్న టీడీపీ ఎంపి కనకమేడల రవీంద్రకుమార్ లాంటి వారిని ఈ వైనం ఆశ్చర్యపరిచింది.

ఏపీలో టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి ఏర్పడాలంటూ, బీజేపీ చీఫ్ నద్దా సహా పలువురు అగ్రనేతల వద్ద, రఘురామరాజు లాబీయింగ్ చేశారు. ఆరెస్సెస్ అగ్రనేతల వద్ద సైతం ఆ మేరకు తన వాణి వినిపించారు. ఢిల్లీ వేదికగా ఏపీ ఉద్యమకారులు వినిపించిన నిరసన గళానికి మద్దతునిచ్చిన రాజు, వారికి అక్కడ సౌకర్యాలు కల్పించారు. అంటే.. జగన్‌పై ప్రత్యక్ష యుద్ధానికి తెరలేపిన ఏకైన నేత రఘురామరాజు ఒక్కరేనని స్పష్టమవుతోంది.

ఈ నేపథ్యంలో బీజేపీతో కూటమి కట్టిన వేళ.. రఘురామకృష్ణంరాజుకు నర్సాపురం ఎంపీ సీటు వస్తుందని అందరూ అంచనా వేశారు. ఆయనకు బీజేపీ సీటు ఇస్తుందని, ఆ మేరకు నద్దా కూడా రాజుకు హామీ ఇచ్చారన్న ప్రచారం జరిగింది. ఒక దశలో రాజు బీజేపీలోచేరేందుకు సిద్ధమైనప్పటికీ, నద్దా కొంతకాలం వేచి ఉండాలని సూచించారట. అయితే టీడీపీ కార్యకర్తలు మాత్రం, రాజు తమ పార్టీ ఎంపీగానే పోటీ చేయాలని ఆశించారు.

కూటమిలోని మూడు పార్టీలో ఏదో ఒక పార్టీ నుంచి తాను పోటీ చేస్తానని స్వయంగా రాజు, టీడీపీ-జనసేన అధిపతుల సమక్షంలోనే బహిరంగసభ వేదికగా ప్రకటించారు. దానితో అంతా రాజుకు నర్సాపురం ఖరారవుతుందని, బీజేపీ లేదా టీడీపీలో ఒకదాని నుంచి ఎంపీగా పోటీ చేస్తారని భావించారు.

కానీ అనూహ్యంగా కూటమి రాజకీయాల్లో రంగప్రవేశం చేసిన జగన్.. బీజేపీలో చక్రం తిప్పారు. ఆ పార్టీలోని తన కోవర్టులతో, రాజుకు సీటు రాకుండా ‘కొసు రాజు’లతో మోకాలడ్డారు. హోంమంత్రి అమిత్‌షా, ఆయన తనయుడితో ఉన్న సంబంధాలతో రాజుకు, బీజేపీ ఎంపీ సీటు రాకుండా పలుకుబడి వినియోగించారు. ఈ విషయంలో చంద్రబాబు కూడా ప్రతిఘటించలేని పరిస్థితి.

జరుగుతున్న పరిణామాలపై దేశ విదేశాల్లోని టీడీపీ కార్యకర్తలు, ప్రధానంగా కమ్మ సామాజికవర్గం అసంతృప్తితో రగిలిపోయింది. విచిత్రంగా రఘురామరాజును తన సొంత క్షత్రియుల కంటే, కమ్మ సామాజికవర్గమే ఎక్కువగా సొంతం చేసుకుంది. హైదరాబాద్-విదేశీ కార్యక్రమాల్లో రాజు వెంట, ఎక్కువగా కనిపించేది కమ్మ సామాజికవర్గమే కావడం ప్రస్తావనార్హం. అక్కడి నుంచి రాజుకు జరిగిన అన్యాయంపై, సోషల్‌మీడియాలో పెద్ద ఉద్యమమే మొదలయింది.

టీడీపీ సోషల్‌మీడియా గ్రూపుల్లోనూ ఒకటే విమర్శల వర్షం. ప్రధానంగా మహిళలు, రాజుకు సీటివ్వకపోవడంపై ఇంకా నిప్పులు చెరుగుతున్నారు. వ్యాసాలు రాస్తున్నారు. ‘‘జగన్‌పై ప్రాణాలకు తెగించి పోరాడిన రాజుకే న్యాయం చేయకపోతే, ఇక మీరు ఎవరికి న్యాయం చేస్తారు?’’ ‘‘రాజుకు అన్యాయం జరిగితే ప్రజలు కూటమికి ఓట్లు ఎలా వేస్తారు?’’ , ‘‘బీజేపీకి ఇచ్చిన సీట్లన్నీ వైసీపీని గెలిపించడానికే కదా? ముక్కు మొహం తెలియనివాళ్లకు ఎంపీ-ఎమ్మెల్యే సీట్లు ఇచ్చారంటే అవి వైసీపీ ఖాతాలో కలపడానికే కదా?’’, ‘‘అసలు బీజేపీతో మనకు పొత్తు ఎందుకు? జగన్‌తో ఇంకా లోపాయికారీ ఒప్పందం ఉన్న బీజేపీని వదిలించుకోవడం మంచిది’’ అంటూ శరపరంపరంగా ఇప్పటికీ పోస్టులు పెడుతూనే ఉన్నారు.

దీనితో ప్రజల పల్సు గ్రహించిన టీడీపీ రంగంలోకి దిగింది. జరగబోయే నష్టాన్ని ముందే గ్రహించింది. ఈ వ్యవహారం తన పార్టీకే నష్టమని భావించింది. దానితో టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు తన ముందున్న ప్రత్యామ్నాయాలను బీజేపీ ముందుంచారు. నర్సాపురం ఎంపీ సీటు తాము తీసుకుని, ఉండి ఎమ్మెల్యే సీటు మీకిస్తామని ప్రతిపాదించారు. దానికి బీజేపీ అంగీకరించలేదు.

ఇక ఏలూరు బీజేపీకి ఇచ్చి, నర్సాపురం సీటు తీసుకుంటామన్న ఆఫర్‌నూ బీజేపీ ఒప్పుకోలేదు. దానితో ఇక చివరి మార్గంగా, ఉండి ఎమ్మెల్యే సీటు రఘురామరాజుకు ఇవ్వాలని నిర్ణయించింది. ఆరకంగా రాజుకు నర్సాపురం ఎంపీ సీటు కోసం, చంద్రబాబునాయుడు చివరివర కూ పోరాడినా పెద్దగా ఫలితం దక్కలేదు.

అయితే చివరి వరకూ ఏం జరుగుతుందో తెలియదు కాబట్టి, ఏదైనా అద్భుతం జరిగి రఘురామరాజుకు నర్సాపురం ఎంపీ సీటు దక్కుతుందని ఆయన అభిమానులు ఆశతో ఉన్నారు. కాగా శుక్రవారం నర్సాపురం పార్లమెంటులో ఎన్నికల ప్రచారానికి టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు రానున్నారు. ఆ సందర్భంలో రఘురామరాజు టీడీపీలో అధికారికంగా చేరతారని తెలుస్తోంది.

LEAVE A RESPONSE