Suryaa.co.in

Editorial

‘ఎన్జీఓ రెడ్డి’గారికి‘ ఉద్యోగ’ సెగ!

-చంద్రశేఖర్‌రెడ్డి నియామకంపై మహిళా ఉద్యోగ నేత ఫైర్
– తొలగించకపోతే రాష్ట్ర వ్యాప్త ఆందోళనకు ఏపీ ఉద్యోగ సంఘం సిద్ధం
( మార్తి సుబ్రహ్మణ్యం)
ఏపీ సీఎం జగనన్న బహు దొడ్డ మనసుతో.. ఏపీఎన్జీఓ సంఘ మాజీ నేత చంద్రశేఖరరెడ్డికి ఇచ్చిన ప్రభుత్వ సలహాదారు నియామక వ్యవహారం ఉద్యోగ సంఘాల్లో సెగ రేపుతోంది. రెడ్డిగారి నియామకాన్ని ఆంధ్రప్రదేశ్ ఉద్యోగ సంఘం తప్పుపట్టింది. ఆయనను తక్షణం ఆ పదవి నుంచి తొలగించకపోతే, రాష్ట్ర వ్యాప్త ఆందోళనకు సిద్ధమవుతామని హెచ్చరించడంతో, రెడ్డిగారి నియామకం వివాదంలో పడింది. చంద్రశేఖర్‌రెడ్డి సేవలు వాడుకుంటామని ఇటీవల ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ఒక సమావేశంలో హామీ ఇచ్చారు. దానికి తగినట్లుగానే, ఆయనను ఏపీ ప్రభుత్వ సలహాదారుగా నియమిస్తూ, సీఎంఓ అదనపు కార్యదర్శి కె.ధనుంజయరెడ్డి ఉత్తర్వు జారీ చేశారు. ఉద్యోగుల వ్యవహారాలకు సంబంధించి ఆయనకు ఆ బాధ్యతలు అప్పగించారు. ఇది కూడా చదవండి.. ఉద్యోగనేతకు జగనన్న సర్కారు ‘రెడ్డి’ కార్పెట్
ఇది ఉద్యోగుల్లో తీవ్ర వ్యతిరేకతకు దారితీసింది. గతంలో ఎన్జీఓ నేతగా ఉన్న అశోక్‌బాబుతో కలసి, టీడీపీ విజయం కోసం పనిచేసిన చంద్రశేఖర్‌రెడ్డికి ఇప్పుడు ప్రభుత్వ సలహాదారు పదవి ఎలా ఇస్తారంటూ ఉద్యోగ సంఘాలు విరుచుకుపడ్డాయి. పైగా హైదరాబాద్‌లో ఉద్యోగుల భూములకు సంబంధించిన కేసులో, బెయిల్‌పై తిరుగుతున్న చంద్రశేఖర్‌రెడ్డికి ప్రభుత్వ సలహాదారు పదవి ఇవ్వడమంటే, ప్రభుత్వ ఉద్యోగులకు ద్రోహం చేసినట్లేనని ఏపీఎన్జీఓ మాజీ కార్యదర్శి వరప్రసాద్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.

హైదరాబాద్‌లో ఆంధ్రా ఉద్యోగులకు ఇళ్లు లేకుండా చేయడంతోపాటు, నిబంధనలకు విరుద్ధంగా లాటరీ ద్వారా ఇళ్లు కేటాయించి, లిటిగేషన్ సృష్టించిన చంద్రశేఖర్‌రెడ్డి గతంలో టీడీపీ ప్రభుత్వానికి అనుకూలంగా పనిచేశారంటూ వరప్రసాద్ ఒక ప్రకటన కూడా విడుదల చేశారు. గతంలో జగన్మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రి అయేందుకు పనిచేసిన, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగ సంఘం ఇప్పుడు, చంద్రశేకర్‌రెడ్డి అక్రమాలతోపాటు.. గత ఎన్నికల్లో జగన్ సీఎం కాకుండా చేసిన ప్రయత్నాలను మహిళా నేత రాజేశ్వరి ఇప్పుడు తెరపైకి తీసుకురావడం ఉద్యోగుల్లో చర్చనీయాంశమయింది.
పాపం ఉద్యోగ సంఘాల ‘ఆవేశంతో కూడిన అమాయకత్వం కలిసిన ఆవేదన’ చూస్తే జాలేస్తుంది. ఎన్నికల ముందు జగనన్నను తిట్టినతిట్టు తిట్టకుండా తిట్టిన మాజీ తమ్ముళ్లకు పిలిచి పదవులిచ్చిన జగనన్న.. చంద్రశేఖర్‌రెడ్డికి సలహాదారు పదవి ఇవ్వడంలో పెద్ద ఆశ్చర్యమేముంది? అయినా రెడ్డిగారు చేసిన నేరమేమిటి? చంద్రబాబు సమర్ధుడన్నారు. ఆయనొక్కడే ఏపీకి రక్షకుడని కొనియాడారు. ఆయనతోనే ఏపీ రక్షించబడుతుందని పులకరించి పోయారు. పచ్చపార్టీకే ఓటేయమని ఉద్యోగులను, ఇప్పుడు అదే పచ్చపార్టీ గూటిలో ఉన్న అశోక్‌తో కలసి పురమాయించారు. అందులో తప్పేమిటి? అప్పుడు బాబు రైటనుకున్నారు. ఇప్పుడు జగనన్న రైటనుకున్నారు. ఏం.. పార్టీలు మారడం, విధేయతలు మార్చడం రాజకీయనేతలకే వచ్చా? మాకు రాదా? అని నిరూపించిన ఎన్జీఓ రెడ్డి గారిని మెచ్చుకోవలసింది పోయి, ఈ తిట్లు, శాపనార్ధాలేమిటంట? బెయిల్‌పై ఉన్నంత మాత్రాన పదవి ఇవ్వకూడదంటే ఎలా? ‘ఆ మాటకొస్తే జగనన్న కూడా బెయిలుపైనే ఉన్నారు కదా’ అని, సచివాలయంలో ఇప్పుడు తీరి కూర్చుని వాదులాటకు దిగుతున్న ఉద్యోగుల చర్చల్లో లాజిక్కు ఉంది కదా? అయినా ఎన్జీఓ రెడ్డిగారిపై ఉన్న ఆరోపణలెంత? ఆఫ్టరాల్ 18 కోట్లు. అంతేకదా? మిగిలిన వారితో పోలిస్తే ఆ 18 కోట్లు ఎంత? సముద్రంలో కాకిరెట్టంత! అయినా.. ఏదో ‘మనవాడన్న’ అభిమానంతో ఎన్జీఓ రెడ్డిగారికి ప్రేమగా ఇచ్చిన సలహాదారు పదవిని, మిగిలిన వారు వద్దంటే జగనన్న వింటారా ఏమిటి? అమాయకత్వం కాకపోతే!

చంద్రశేఖర్‌రెడ్డి ఉద్యోగ ద్రోహి: రాజేశ్వరి

ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం శ్రీకాకుళం జిల్లా కార్యదర్శి అలికాన రాజేశ్వరి, తాజాగా చంద్రశేఖర్‌రెడ్డి నియామకాన్ని తూర్పారపట్టారు. ఆ మేరకు ఆమె చంద్రశేఖర్‌రెడ్డి అక్రమాలకు సంబంధించి, ఆధారాలతో సహా మూడు పేజీల లేఖను విడుదల చేశారు. గతంలో టీడీపీ కోసం పనిచేసిన ఆయనకు సలహాదారు పదవి ఎలా ఇస్తారని ప్రశ్నించారు. సొసైటీ వ్యవహారంలో చంద్రశేఖర్‌రెడ్డి 18 కోట్ల రూపాయల అక్రమాలకు పాల్పడ్డారని విజిలెన్స్ అధికారులు నిర్ధారించి, ఆయనపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని 2012లో నివేదిక సమర్పించిన వైనాన్ని ఆమె గుర్తు చేశారు. దానిని సహకారశాఖ కూడా గుర్తించి, రికవరీ చేయాలని సహకార శాఖ ట్రైబ్యునల్ ద్వారా ఆదేశించిందని గుర్తు చేశారు.
ఆ ప్రకారంగా చంద్రశేఖర్‌రెడ్డిపై 2013 జూన్ 1న హైదరాబాద్ సీసీఎస్‌లో ఫిర్యాదు చేశారన్నారు. ఆ కేసులో తాను అరె స్టు కాకుండా, నాంపల్లి కోర్టులో చంద్రశేఖర్‌రెడ్డి వేసిన ముందస్తు బెయిల్ పిటిషన్‌ను కోర్టు కొట్టివేసిందన్నారు. తర్వాత మార్చి 4, 2014న హైకోర్టులో షరతులతో కూడిన బెయిల్ పొందిన చంద్రశేఖర్‌రెడ్డి, టీడీపీ అధినేత చంద్రబాబు పంచన చేరారని వివరించారు. అయితే రాష్ట్ర విభజన తర్వాత రెండు హైకోర్టులు ఏర్పడటంతో, రెండు ప్రభుత్వాలు ఈ కేసుపై సరైన శ్రద్ధ చూపలేదన్నారు. తన పలుకుబడి వినియోగించిన ఫలితంగా ఆ కేసు ఇప్పటికీ హైకోర్టులోనే పెండింగ్‌లో ఉందని రాజేశ్వరి వెల్లడించారు.
సమైక్య ఉద్యమంలో ఉద్యోగులను జగన్ వద్దకు వెళ్లనీయకుండా, టీడీపీ నిర్వహించిన ఉద్యమాల వైపు మళ్లించిన చంద్రశేఖర్‌రెడ్డికి, ఇప్పుడు సలహాదారు పదవి ఇవ్వడంపై ఆమె ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఆ సందర్భంలో చంద్రబాబు ఢిల్లీలో నిర్వహించిన ధర్మ పోరాట దీక్షలో పాల్గొని, చంద్రబాబు మాత్రమే ఏపీ

హక్కులు రక్షించగలరని ఉపన్యాసం చేశారని ఆమె గుర్తు చేశారు. విజయవాడ సిద్దార్ధ కాలేజీ గ్రౌండ్స్‌లో నిర్వహించిన పెన్షనర్ల సమావేశానికి బాబును పిలిపించి, పెన్షనర్లంతా బాబుకు ఓటేసి రుణం తీర్చుకోవాలని పిలుపునిచ్చారని ఆమె గుర్తు చేశారు. 2019 ఎన్నికలకు ముందు ‘ధ్యాంక్యూ సీఎం గారూ.. మళ్లీ మీరే రావాలి’ అని బాబుకు సన్మానం చేయడంతోపాటు.. ఈ ప్రభుత్వం ఉద్యోగుల పక్షమని ప్రకటనలిచ్చారని వెల్లడించారు. ఆ సమయంలో జగన్‌ను సీఎం చేయాలని భావించి, సమావేశాలు నిర్వహించిన ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం ప్రయత్నాలను, ఇదే చంద్రశేఖర్‌రెడ్డి నాటి సీఎంఓ అధికారుల ద్వారా అడ్డుకున్నారని ఆరోపించారు.

బెయిల్ ఉంటే పదవి ఇవ్వకూడదా?

అయితే.. తమ నేత చంద్రశేఖర్‌రెడ్డిపై గత రెండురోజుల నుంచి శరపరంపరగా వస్తున్న విమర్శలపై, ఆయన అనుచరులయిన ఉద్యోగ నేతలు ఎదురుదాడికి దిగుతున్నారు. ఈ వ్యవహారంపై ఏపీ సచివాలయంలో, ఉద్యోగుల మధ్య ఆసక్తిరకమైన చర్చలు, సంవాదాలు జరుగుతుండటం విశేషం.
‘‘ బెయిల్‌పై ఉంటే ప్రభుత్వ పదవి ఇవ్వకూడదా? సీఎం నుంచి మంత్రులు, ఎంపీలు, ఎమ్మల్యేల వరకూ అంతా ఏదో ఒక కేసులో బెయిల్‌పై బయటతిరుగున్నవారే’’నని సచివాలయంలో తమ సహోద్యోగులతో వాదనకు దిగుతున్నారు. అప్పుడు రాష్ట్ర ప్రయోజనాల కోసమే బాబుకు మద్దతునిచ్చారే తప్ప, వ్యక్తిగతంగా కాదని స్పష్టం చేస్తున్నారు. చంద్రశేఖర్‌రెడ్డిపై అక్కసుతోనే దుష్ప్రచారం చేస్తున్నారని, ధైర్యం ఉంటే హైకోర్టులో పెండింగ్‌లో ఆయనపై ఉన్న కేసుల సంగతేమిటని, కోర్టులోనే తేల్చుకోవచ్చని సవాళ్లు విసురుతున్నారు. ఆయన సేవలకు మెచ్చి జగనే సలహాదారు పదవి ఇచ్చారంటే, చంద్రశేఖర్‌రెడ్డి స్థాయి ఏమిటో అర్ధమవుతుందన్నారు.

LEAVE A RESPONSE