Suryaa.co.in

Telangana

నక్సలైట్ల ఎజెండా ఏమైంది?

– కేసీఆర్ కుటుంబ పాలనకు చరమగీతం పాడదాం
– నిప్పులు చెరిగిన రేవంత్ రెడ్డి
త్యాగాల తెలంగాణ రాష్ట్రంలో కల్వకుంట్ల ఫ్యామిలీ తిష్టవేసి రాష్ట్రాన్ని దోచుకుతింటున్నారని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి తీవ్రంగా విమర్శించారు. ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు కుటుంబ పాలనకు చరమగీతం పడాల్సిన అవసరం ఉందని ఆయన తెలంగాణ ప్రజలకు పిలుపునిచ్చారు. గురువారం జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలో నిర్వహించిన బహిరంగ సభలో పాల్గొన్నారు,ఈ సందర్భంగా ప్రముఖ నాయకులు గండ్ర సత్యనారాయణ రావుకు కాంగ్రేస్ పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
అనంతరం జరిగిన భహిరంగ సభలో ప్రసంగించారు. కెసిఆర్ ప్రభుత్వం నిరుద్యోగులకు, సింగరేణి కార్మికులకు తీవ్ర అన్యాయం చేసిందని ఆయన గుర్తు చేశారు. ఎంతోమంది ప్రాణత్యాగం చేసిన తెలంగాణ రాష్ట్రంలో కెసిఆర్ కుటుంబం తప్ప మిగతా వారు ఎవరికీ ఉద్యోగ అవకాశాలు దక్కడం లేదని దీనిపై తెలంగాణ యువత ఆలోచించాలని కోరారు. ఉద్యోగ అవకాశాల కోసం నిరుద్యోగులు ఎంత తాపత్రయం పడిన కేసీఆర్ ప్రభుత్వం వారిని పరిగణనలోకి తీసుకోవడం లేదని ఆయన మండిపడ్డారు.
ఆత్మబలిదానాలతో సాధించుకున్న తెలంగాణలో కేసీఆర్ కుటుంబం తప్ప మరొకరు బాగు పడలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ బలిదానాలను అర్థం చేసుకున్న సోనియాగాంధీ తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేస్తే కేసీఆర్ ప్రభుత్వం దాన్ని విచ్చలవిడిగా దుర్వినియోగం చేస్తూ పబ్బం గడుపు కుంటుందని మండిపడ్డారు.
భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణ రెడ్డిని కాంగ్రెస్ కార్యకర్తలు కష్టపడి గెలిపిస్తే స్వార్థ ప్రయోజనాల కోసం ఆయన టిఆర్ఎస్ పార్టీలో చేరి కార్యకర్తలకు, కాంగ్రెస్ పార్టీకి ద్రోహం చేశారని అన్నారు. పెట్రోల్ దొంగ, భూకబ్జాలకు కేరాఫ్ అడ్రస్ గా మారిన గండ్ర వెంకటరమణారెడ్డిని రానున్న ఎన్నికల్లో ఓడించాలని రేవంత్ రెడ్డి భూపాలపల్లి నియోజకవర్గ ప్రజలకు ఈ సందర్భంగా పిలుపునిచ్చారు.భూపాలపల్లి ఎమ్మెల్యే అధికార పార్టీ అండతో వరికోలు గ్రామంలో 100 సంవత్సరాలుగా సాగు చేసుకుంటున్న రైతుల భూములను భలవంతంగా కబ్జా చేశారని ఆరోపించారు. రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీ నేతలు ప్రజలను నిండా ముంచుతూ వేలాది కోట్ల రూపాయలు, భూములను అక్రమంగా సంపాదిస్తున్నారని ఆరోపించారు.
వచ్చే శాసనసభ ఎన్నికల్లో టిఆర్ఎస్ ప్రభుత్వానికి తెలంగాణ ప్రజలు బుద్ధి చెబుతారని రాబోయే ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వామేనని ఆయన ధీమా వ్యక్తం చేశారు. పోలీసులు మితిమీరిన ఉత్సాహంతో కేసీఆర్ ప్రభుత్వానికి వంత పడుతున్నారని వారి పేర్లు అన్నింటిని డైరీలో వ్రాసుకుని వారికి సరైన సమయంలో తగిన గుణపాఠం చెబుతామని ఆయన ఈ సందర్భంగా హెచ్చరించారు. తెలంగాణ రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలను మోసం చేసిన కేసీఆర్ ప్రభుత్వం నైతికంగా కొనసాగే హక్కు లేదని ఆయన స్పష్టం చేశారు. సింగరేణి కార్మికులకు తీవ్ర అన్యాయం చేసిన కేసీఆర్ ప్రభుత్వాన్ని గద్దె దించాలని రేవంత్ రెడ్డి ఈ సందర్భంగా సింగరేణి కార్మికుల అభ్యర్థించారు.
అర్ధరాత్రి అయినా మొక్కవోని దీక్షతో ఇంత మంది ప్రజలు కేసీఆర్ ప్రభుత్వానికి చరమగీతం పాడాల్సిన అవసరం ఉందని గుర్తించిన ప్రజలు సభను విజయవంతం చేసినందుకు కృతజ్ఞతలు తెలిపారు.పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పర్యటన సందర్భంగా జిల్లా ప్రజలు ఆయనకు బ్రహ్మరథం పట్టారు. అడుగడుగునా పూలవర్షం కురిపిస్తూ డ్యాన్సులు, డప్పుచప్పుల్లతో ఘనంగా స్వాగతం పలికారు. సభ ప్రాంగణం అంతా కిక్కిరిసి పోయింది. రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నంత సేపూ కార్యకర్తలు కేరింతలు కొడుతూ కాంగ్రేస్ పార్టీ కి అనుకూలంగా నినాదాలు చేశారు. ఈకార్యక్రమంలో ఇంకా మాజీమంత్రులు, ఎమ్మెల్యే దుద్దిళ్ళ శ్రీధర్ బాబు,ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, మధుయాష్కీ గౌడ్,ఎమ్మెల్యే సీతక్క,పొడెం వీరయ్య లతో పాటు మాజీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.

LEAVE A RESPONSE