Home » సీఎం గారూ .. వ్యవ‘సాయ’మేదీ?

సీఎం గారూ .. వ్యవ‘సాయ’మేదీ?

– జగన్‌కు ధూళిపాళ్ల నరేంద్ర లేఖ
ఏపీలో వ్యవసాయ రంగానికి చేయూత ఏదని టీడీపీ నేత ధూళిపాళ్ల నరేంద్ర ప్రశ్నించారు. వ్యవసాయంపై వైసీపీ ప్రభుత్వం చెబుతున్న లెక్కలకు, క్షేత్రస్థాయిలోని వాస్తవాలకు సంబంధమే లేదని సీఎం జగన్‌కు రాసిన లేఖలో స్పష్టం చేశారు. ఆ మేరకు జగన్‌కు కొన్ని ప్రశ్నాస్త్రాలు సంధించారు. నరేంద్ర లేఖ సారాంశం ఇదీ..
తేదీః01-10-2021
బహిరంగ లేఖ
గౌరవ ముఖ్యమంత్రి
వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి,
అమరావతి,
ఆంధ్రప్రదేశ్.
విషయం– సంక్షోభంలో ఉన్న వ్యవసాయ రంగాన్ని ఆదుకోవడం, పంటలకు గిట్టుబాటు ధర కల్పన గురించి
అయ్యా,
రాష్ట్ర విభజనతో ఏర్పడిన 13 జిల్లాల చిన్న నవ్యాంధ్రప్రదేశ్ వ్యవసాయక రాష్ట్రంగా ఉందనే విషయం మనందరికి తెలుసు. అందుచేత ఈ రాష్ట్రంలో వ్యవసాయాన్ని రక్షించుకోవాలి, రైతులను కాపాడుకోవాలి. కానీ వ్యవసాయానికి సాయంపై చెప్పేలెక్కలకు, వాస్తవాలకు పొంతన లేదు. వాస్తవానికి ప్రకటనల ఖర్చు కంటే రైతుకు అందే సాయం తక్కువగా ఉంది. నేడు కోస్తాలో క్రాప్ హాలిడేను రైతులు ప్రకటించారు. రాయలసీమలో ఉల్లి, టమోటతో పాటు ఉద్యాన పంటలకు గిట్టాబాటు ధరలు దారణంగా పడిపోయాయి. ఒక్క అనంతపురం జిల్లాలోనే 10 లక్షల ఎకరాల్లో పంట దెబ్బతినిపోయింది. రైతు ఆత్మహత్యలు పెరిగాయి. ఇచి చాలదన్నట్లు మోటార్లకు మీటర్లు పెడుతున్నారు. ఇలా వ్యవసాయాన్ని సంక్షోభంలోకి నెట్టారు. ఇది రైతు ప్రభుత్వమా? రైతు దగా ప్రభుత్వమా? తెలియాలి అంటే ఈ క్రింది 15 ప్రశ్నలకు సమాధానాలు చెప్పవలసిందిగా కోరుచున్నాను.
1. గత రెండున్నర సంవత్సరాలలో ఏడు తుఫాన్లు, అకాల వర్షాలతో నష్టపోయిన రైతులకు ఇచ్చే ఇన్ పుట్ సబ్సీడీ గత ప్రభుత్వంలోనే తిత్లి తుఫాన్ సమయంలో హెక్టారుకు రూ.20వేలు చొప్పున సాయం అందిస్తే, ఈ రెండు సంవత్సరాలలో ఇన్ పుట్ సబ్సీడీ రూ.25 వేలకో, రూ.30 వేలకో పెంచి ఇస్తారనుకుంటే రూ.16 వేలకు తగ్గించి అరకొర ఇవ్వడం అంటే ఇది రైతు ప్రభుత్వమా? రైతు దగా ప్రభుత్వమా?
2. పంటకు ఇన్సూరెన్స్ రైతు కట్టనవసరం లేదు ప్రభుత్వం కడుతుంది అని చెప్పి, ఇటు రైతుని కట్టనివ్వకుండా, అటు ప్రభుత్వం కట్టకుండా ఇన్సూరెన్స్ రైతు నష్టపోతుంటే, శాసనసభలో చంద్రబాబునాయుడు గారు శాసనసభ ఫ్లోర్ మీద కూర్చుంటే అప్పటికప్పుడు రాత్రి జీవో విడుదల చేయడం అంటే, ఇన్సూరెన్స్ కట్టడం మర్చిపోవడం అంటే రైతులను మరిచిపోవడమే. మరి రైతులను మర్చిపోయిన ప్రభుత్వం రైతు ప్రభుత్వమా? రైతు దగా ప్రభుత్వమా?
3. రైతు భరోసా పీఎం కిసాన్ తో సంబంధం లేకుండా 2017 ప్లీనరీలోనే మీరు ప్రకటించి రూ.13,500/- ఇస్తానని చెప్పి, ఇప్పుడు రూ.7,500 మాత్రమే ఇవ్వడంతో ఒక్కో రైతు సంవత్సరానికి రూ.6 వేలు చొప్పున 5 సం.లలో 5*6= రూ.30 వేలు నష్టపోతున్న దశలో ఇది రైతు ప్రభుత్వమా? రైతు దగా ప్రభుత్వమా?
4. 64 లక్షల మందికి రైతు భరోసా ఇస్తానని చెప్పి, నేడు కేవలం 45 లక్షల మందికి మాత్రమే రైతు భరోసా కుదించడం ఇది రైతు ప్రభుత్వమా? రైతు దగా ప్రభుత్వమా?
5. 15 లక్షల మంది కౌలు రైతులకు రైతు భరోసా ఇస్తానని చెప్పి, కేవలం 49 వేల మందికి మాత్రమే రైతు భరోసా అందించడం రైతు ప్రభుత్వమా? రైతు దగా ప్రభుత్వమా?
6. కులం లేని రైతుకు, ఎస్సీకి ఉంటే బీసీకి లేదు, బీసీకి ఉంటే ఓసీకి లేదు అంటూ మొదటిసారిగా రైతు భరోసాలో కులం పేరు చెప్పి రైతు భరోసా ఎగ్గొట్టడం రైతు ప్రభుత్వమా? రైతు దగా ప్రభుత్వమా?
7. ఆరుగాలం కష్టపడి పండించిన ధాన్యం సొమ్ము 24 గంటల్లో రైతులకు అందవలసి ఉండగా.. నెలల తరబడి ధాన్యం బకాయిలు చెల్లించకపోవడం, కౌలు రైతులు ధాన్యం అమ్ముకోలేని పరిస్థితి ఉండటం రైతు ప్రభుత్వమా? రైతు దగా ప్రభుత్వమా?
8. చంద్రబాబు హయాంలో 50 నుంచి 75 శాతంతో సబ్సీడీ వ్యవసాయ యాంత్రీకరణ చేస్తే.. నేడు మీ రెండున్నర సంవత్సరాలలో సబ్సీడీపై ఒక్క వరినాటు యంత్రం, ఒక్క వరికోత యంత్రం, ఒక్క ట్రాక్టర్ గానీ, ఒక్క క్రిషి ట్రాక్టర్ గానీ, ఒక్క ఆయిల్ ఇంజిన్ గానీ, ఆఖరికి ఒక్క బరకం ముక్క కూడా ఇవ్వని ప్రభుత్వం రైతు ప్రభుత్వమా? రైతు దగా ప్రభుత్వమా?
9. చంద్రబాబు హయాంలో 90% సబ్సీడీతో మెట్ట ప్రాంత రైతులకు డ్రిప్ ఇరిగేషన్ ఇస్తే నేడు ఈ రెండున్నర సంవత్సరాలలో ఒక్క శాతం కూడా డ్రిప్ ఇరిగేషన్ ఇవ్వని ప్రభుత్వం రైతు ప్రభుత్వమా? రైతు దగా ప్రభుత్వమా?
10. చంద్రబాబు హయాంలో 90% సబ్సీడీతో జింక్ వంటి మైక్రో న్యూట్రియాంట్స్ అందిస్తే, నేడు ఈ రెండు సంవత్సరాలలో ఒక్క శాతం సబ్సీడీతో కూడా మైక్రో న్యూట్రియాంట్స్ అందించని ప్రభుత్వం రైతు ప్రభుత్వమా? రైతు దగా ప్రభుత్వమా?
11. విదేశీ మారక ద్రవ్యం అందించే ఆక్వాకు గత ప్రభుత్వంలో ఏరియేటర్స్, మోటర్స్, బోర్స్ 50% సబ్సీడీతో అందించి, వారికి గ్రావెల్ రోడ్డుతో రవాణ ఏర్పాట్లు చేస్తే, నేడు వీటన్నింటిని గాలికి వదిలేసిన ప్రభుత్వం, ఎగుమతులు లేని దశలో చేపల రైతులు ఆత్మహత్యలు చేసుకుంటుంటే చోద్యం చూస్తున్న ప్రభుత్వం రైతు ప్రభుత్వమా? రైతు దగా ప్రభుత్వమా?
12. రైతుల్ని దొంగల్లా చూస్తూ, మోటార్లకు మీటర్లు బిగిస్తూ రైతులకు ఉరితాడు బిగించి ఉచిత విద్యుత్ కు మంగళం పాడే ప్రభుత్వం రైతు ప్రభుత్వమా? రైతు దగా ప్రభుత్వమా?
13. రాష్ట్రంలోని అన్ని వాణిజ్య పంటలు మరియు వ్యవసాయ పంటలకు గిట్టుబాటు ధర అందించలేని ప్రభుత్వం రైతు ప్రభుత్వమా? రైతు దగా ప్రభుత్వమా?
14. గుజరాత్ రాష్ట్ర అమూల్ డైయిరీకి పాలు పోస్తేనే సంక్షేమ పథకాలు ఇస్తామంటూ రైతులను బెదిరిస్తూ, రాష్ట్రంలోని రైతుల సహకార సంఘ పాల డైయిరీలను నిర్వీర్యం చేసే ప్రభుత్వం రైతు ప్రభుత్వమా? రైతు దగా ప్రభుత్వమా?
15. రాష్ట్రానికి జీవనాడి అయిన పోలవరం ప్రాజెక్టు రూ.55 వేల కోట్లు అంచనాలను కేంద్రంతో ఆమోదించుకోలేక, కేసీఆర్ గారు తెలంగాణ శాసనసభలో ప్రకటించిన విధంగా ముంపు ప్రాంతాన్ని తగ్గించి, పునరావాస ప్యాకేజీ తగ్గించుకోవడానికి పోలవరం నీటి సామర్థ్యం ఎత్తు 150 అడుగుల నుంచి 135 అడుగులకు తగ్గించే ప్రణాళిక వేసుకుని పోలవరం అర్థం, పరమార్థం మార్చడం రైతు ప్రభుత్వమా? రైతు దగా ప్రభుత్వమా?
16. అన్ని జిల్లాల్లోని సాగునీటి ప్రాజెక్టులకు తెలుగుదేశం ప్రభుత్వం ఇచ్చిన నిధులతో పోలిస్తే సగానికి సగం బడ్జెట్ ఖర్చు కోతకోయడం రైతు దగా కాదా?
17. కృష్ణా, గోదావరి జిల్లాల్లో బచావత్ కమిషన్ ఏపీకి కల్పించిన హక్కుల్ని కేంద్రానికి ధారాదత్తం చేయడం దగా కాదా?
18. పొరుగు రాష్ట్రాలు నిర్మిస్తున్న అక్రమ ప్రాజెక్టుల్ని అరికట్టలేకపోవడం రైతు దగా కాదా? కృష్ణా నదిలో మిగులు జలాలపై హక్కులు కోరబోమని మీ తండ్రి బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ కు లేఖ ఇవ్వడం రైతు దగా కాదా?
దయ ఉంచి ఈ ప్రశ్నలకు సమాధానాలు రాష్ట్ర రైతాంగానికి తెలియజేయగలరు.

ధన్యవాదములతో
ధూళిపాళ్ల నరేంద్ర కుమార్
(మాజీ ఎమ్మెల్యే)

Leave a Reply