Suryaa.co.in

Editorial

నాటి ముద్ద ‘రగడ’… ఏదీ నాయకా?

-నారాయణ అరెస్టుపై ముద్రగడ మాట్లాడలేదెందుకు?
– ముద్రగడ అరెస్టయితే అంతా రోడ్డెక్కాలా?
– కాపు నేతల మౌనంపై బలిజ సంఘాల భగభగ
– కాపునాడుతో సంబంధం లేదంటున్న బలిజనాడు కన్వీనర్ రమణ
– బలిజ-తెలగ-ఒంటరి కులాలను చూపుతున్న కాపుల తెలివిపై బలిజల ఫైర్
– తిరుపతి వేదికగా త్వరలో బలిజ నేతల భేటీ
(మార్తి సుబ్రహ్మణ్యం)

ఆయన కాపు-బలిజ-తెలగ ఒంటరి సామాజికవర్గాల ఇలవేల్పు ‘లాంటివాడు’. అడక్కుండానే వారి కోసం ఆలోచించే ఆపద్బాంధవుడు. తెల్లబట్టలు వేసుకునే ఎర్రసూరీడాయన. శాంతంగా కనిపించే చేగువేరా వారసుడాయన. వారికి కష్టం రాకముందే ఆయా వర్గాల గేటు ముందు వాలిపోయి, అందరి గొంతుకవుతారు. వారందరి పక్షాన ఆయనే ఆలోచిస్తారు. పదిమందితో ఆలోచించి నిర్ణయం తీసుకుంటే ఉపయోగం లేదని, ఆయనే వారందరి తరఫున నిర్ణయాలు తీసేసుకునే సామాజిక విప్లవకారుడు. అనుకున్న వెంటనే ఆమరణ నిరాహారదీక్ష చేస్తారు. దీక్షలు చేయడం ఆయనకు చిటికెలో పని. ఆయన కిర్లంపూడిలో కూర్చుని కంచం మీద గరిటతో శబ్దం చేశారంటే, అది కరకట్ట వరకూ వినిపించాల్సిందే. కాకపోతే ఇప్పుడు ఆ సౌండు
mudragada-sound తాడేపల్లి వరకూ వినిపించేలా మోగించాలా వద్దా అన్న మొహమాటంతో కూడిన సంశయంలో ఉన్నారంతే. అసలు ఒక్కమాటలో చెప్పాలంటే ‘అత్తారింటికి దారేది’ సినిమాలో పవన్ కల్యాణ్ చెప్పినట్లు… కష్టం వారి కాంపౌండు గేటు వరకూ రాకుండా చూసుకుంటారు. రాష్ట్రంలో కాపులకు ఏ కష్టం వచ్చినా అది తనకే వచ్చినంతగా ఫీలవుతుంటారు.దానిని వ్యక్తీకరించడానికి సీఎంలకు లేఖాస్త్రాలు సంధిస్తుంటారు. ఇదంతా మూడేళ్ల క్రితం ముద్రగడ పద్మనాభం అనే కాపు నేతకు సంబంధించిన ముచ్చట.

మరిప్పుడు ఆయనలో అప్పటి పోరాటపటిమ ఏమయింది? ఆయన కంచం సౌండు కరకట్ట నుంచి తాడేపల్లికి మూడేళ్లయినా ఎందుకు షిఫ్టవడం లేదు? పాత సర్కారు లెక్క ఇప్పుడు ఒంటికాలితో జగనన్న సర్కారుపై జంగ్ ఎందుకు ప్రకటించడం లేదు? కొంపతీసి కాపు-బలిజ-తెలగ-ఒంటరి కులాల
mudra-meet సమస్యలన్నీ జండూబామ్ రాసినట్లు మాయమయ్యాయా ఏంటీ? జగనన్న సర్కారు 5శాతం రిజర్వేషన్లు, ఎవరికీ తెలియకుండా కాపులకు రహస్యంగా అమలుచేస్తుందా ఏంటీ? మరి ఆమొహమాటంతో అన్ని మేళ్లు చేసిన జగన్ సర్కారుపై పోరాడటం ధర్మం కాదన్న పాపభీతితో, ముద్దరగడమౌనంగా ఉన్నారా? అనే పనికిమాలిన, చచ్చుపుచ్చు ప్రశ్నలు, వాటిపై చర్చలు మాకు అనవసరం. మా బలిజ నాయకుడయిన మాజీ మంత్రి నారాయణను అరెస్టు చేస్తే, ముద్రగడ ఎందుకు ఖండించలేదు? ఎందుకు కంచాలు, పళ్లేలు మోగించలేదు? ఆమరణ నిరాహారదీక్షలు ఎందుకు చేయలేదు? ముఖ్యమంత్రికి ఎందుకు లేఖ రాయలేదు? ప్రధానికి కూడా తెలుగులో ఎందుకు లేఖ రాయలేదు? ఐహర్ట్. ఐవాంట్ టాక్ టు కిర్లంపూడి పద్మనాభం రెట్‌ నౌ! ఇదేదో వర్మ సినిమాలో బ్రహ్మానందం పోలీసులను ప్రశ్నించిన కామెడీ డైలాగు కాదు. ఇవన్నీ .. బలిజ నేతల సీరియస్ ప్రశ్నలు!!

బలిజ నేత, మాజీ మంత్రి నారాయణను పోలీసులు అరెస్టు చేసినప్పుడు.. ముద్రగడ సహా కాపు మంత్రులు, ఎమ్మెల్యేలు, కాపు నాయకులు ఎందుకు ఖండించలేదన్న బలిజ నేతల ప్రశ్నలు ఆసక్తికరంగా మారాయి. కాపులు తమ రాజకీయ అధిపత్యం కోసమేతమను పక్కన పెట్టుకుని, తమ సంఖ్యా బలాన్ని చూపించి వారి రాజకీయ ప్రయోజనాలు సాధించుకుంటున్నారన్నది మొదటి నుంచీ బలిజ నేతల వాదన. కాపు కార్పొరేషన్ చైర్మన్ పదవి నుంచి మంత్రులు, కార్పొరేషన్ చైర్మన్లు, చివరకు ఆలయ కమిటీ చైర్మన్లు
kapu-corporation-office కూడా కాపులే కొట్టుకుపోతుంటే తాము ఇంకా కాపులతో కలసి ఎలా పోరాడాలన్నది బలిజనేతల ప్రశ్న.రాయలసీమలో బలిజలు, తెలంగాణలో మున్నూరు కాపు, ఆంధ్రాలో తెలగ, ఉత్తరాంధ్రలో తూర్పు కాపుల సంఖ్య చూపించి రాజకీయ ప్రయోజనం పొందుతున్న కాపులపై బలిజలు తిరుగుబాటు చేసి, సొంతబాట పట్టడం ఏపీ కులరాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది.

బలిజలు పిచ్చోళ్లా: రమణ
‘మేం దాదాపు 14 శాతం ఉన్నాం.రాయలసీమలోని ఐదు జిల్లాల్లో కాపులెక్కడా ఉండరు. బలిజలే కనిపిస్తారు. 72 నియోజకవర్గాల్లో బలిజలది నిర్ణయాత్మక శక్తి. గతంలో తిరుపతి, చిత్తూరు, మదనపల్లి, శ్రీకాళహస్తి, కడప, రాయచోటి, రాజంపేట, కదిరి, హిందూపురం, మైదుకూరు,డోన్, గుంతకల్, కోవూరు, నెల్లూరు, కనిగిరి, దర్శిలో బలిజ ఎమ్మెల్యేలు కొన్ని దశాబ్దాలుగా కొనసాగారు. ఎన్టీఆర్ బలిజలకు పెద్ద పీట వేశారు. చంద్రబాబు ఆ ప్రాధాన్యం కొద్దిగా తగ్గించారు. ఇప్పుడు జగన్ అసలు ప్రాధాన్యమే లేకుండా చేశారు. సీమలో ఒక్క బలిజకు కార్పొరేషన్ చైర్మన్ లేదు. కనీసం ఆలయ కమిటీ చైర్మన్ కూడా ఇవ్వలేదు. అదే కాపులకు ఎన్ని పార్టీలు ఎన్ని ఎమ్మెల్యే, ఎన్ని ఎంపీ సీట్లు ఇచ్చారు? ఎన్ని కార్పొరేషన్ చైర్మన్లు ఇచ్చారు? అంటే బలిజ జాతి అంత పనికిరానిదయిపోయిందా? మేమేమన్నా పిచ్చోళ్లమా? కాపులకు తోకలమా? కాపుల పల్లకీ మోసే బోయీలమా? తిరుపతిలో అన్ని కులాలకు భవనాలు కట్టించారు.కానీ చంద్రబాబు మాకు స్థలం ఇస్తే, చివరకు ఇప్పుడు దానినీ కట్టా చేసే దుస్థితి వచ్చింది. అయినా ముద్రగడ లాంటి వాళ్లు ఈ అన్యాయం గురించి మాట్లాడరు. ఆందోళన చేయరు. కాపు-బలిజ ఒంటరి-తెలగ అంటే ఒక ముద్రగడేనా? ఒక్క కాపులేనా? వారికి అన్యాయం జరిగితే అందరికీ అన్యాయం జరిగినట్లేనా? అందుకే మాకు ఇకపై కాపులతో సంబంధం లేదు. కాపులను పక్కనపెట్టి మమ్మల్ని బీసీల జాబితాలో చేర్చండ’ని బలిజనాడు కన్వీనర్, టీటీడీ మాజీ సభ్యుడు ఓ.వి.రమణ డిమాండ్ చేశారు.

నారాయణను అరెస్టు చేసినప్పుడు కమ్మ, బీసీ, ఎస్సీ నేతలు ఖండించారే తప్ప, ముద్రగడ సహా ఏ ఒక్కకాపు మంత్రి, కాపు నాయకుడు ఖండించలేదని గుర్తు చేశారు. మంత్రివర్గంలో ఉన్న కాపులు, ముద్రగడ, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేషన్లు చైర్మన్లుగా ఉన్న కాపులు ఎందుకు నోరు మూసుకున్నారు. ముద్రగడ తన రాజకీయ ఉనికి పోతుందన్నప్పుడు మాత్రమే తెరపైకి వచ్చి, బలిజ-తెలగలను బలిపశువులుగా మారుస్తుంటారని ధ్వజమెత్తారు. ముద్రగడను అరెస్టు చేసినప్పుడు రాష్ట్రంలోని కాపు-బలిజ-తెలగ-ఒంటరి కులాలన్నీ రోడ్డుపైకి రావాలా? బలిజ నేత నారాయణను అరెస్టు చేస్తే మాత్రం కాపులెవరూ రారా? కనీసం ఖండించరా? ఏమిటీ మీ అహంకారం అని రమణ నిలదీశారు.

“ఈ బలిపీఠం రాజకీయాలు ఇకమానుకోండి. మీరు చెప్పే రైలింజను డైవరు హోదా మీదగ్గరే పెట్టుకోండి. మా దారి మేం చూసుకుంటాం. దశాబ్దాల నుంచి కాపులు సీమలోనిమా బలిజల సంఖ్య చూపించి పాలకుల దగ్గర ప్రయోజనం పొందుతున్నారు. ఇకపై ఈ ముసుగు రాజకీయం చెల్లదు. కాపులు-బలిజలు వేర్వేరు. వారితో బలిజలకు ఎలాంటి సంబంధం లేదు. కాపుల సంఖ్యా బలం కేవలం ఉభయగోదావరిలోనే. కృష్ణా,

గుంటూరు జిల్లాల్లో కొంతమేరకే వారి సంఖ్యాబలం ఉంది. ఆంధ్రాలో తెలగ ఒంటరి కులాలను కూడా కాపులు తమ సంఖ్యగానే చూపించుకుని, అధికారంలో ఉన్నవారి వద్ద ప్రయోజనం పొందుతున్నార’ని వ్యాఖ్యానించారు. బలిజల సంక్షేమం, రాజకీయ భవితవ్యంపై అన్ని పార్టీల వారితో కలసి భవిష్యత్తు కార్యాచరణ ప్రకటిస్తామని వెల్లడించారు.ఇది కూడా చదవండి… నారాయణ..నారాయణ

LEAVE A RESPONSE