Suryaa.co.in

Andhra Pradesh

టీడీపీ వస్తేనే రాష్ట్రం సస్యశ్యామలం

-పెన్షన్ల వ్యవహారంలో రాజకీయం
-వృద్ధుల ప్రాణాలు బలి తీసుకుంటున్నారు…

-కుట్రపూరితంగా చంద్రబాబుకు అపాదించడం సిగ్గుచేటు
-మాఫియాలో దేశంలోనే ముందు వరుసలో నిలబెట్టారు
-ఐదేళ్ల రాక్షస పాలనకు చరమగీతం పాడుదాం
-నిజం గెలవాలి యాత్రలో నారా భువనేశ్వరి

వృద్ధుల ప్రాణాలతో వైసీపీ ప్రభుత్వం చెలగాటమాడుతూ వారి ప్రాణాలు తీస్తుందని నారా భువనేశ్వరి దుయ్యబట్టారు. నిజం గెలవాలి యాత్రలో భాగంగా ఆమె గురువారం కడప 44వ వార్డులో చంద్రబాబు అరెస్టును తట్టుకోలేక మృతిచెందిన కార్యకర్త కుటుంబాన్ని పరామర్శించారు. అనంతరం కార్యకర్తలను ఉద్దేశించి సభలో మాట్లాడారు. మండుటెండలను లెక్కచేయకుండా వచ్చిన మీ అభిమానానికి నమస్కారాలు. చంద్రబాబు రాష్ట్రం కోసం రాత్రింబవళ్లు ఎలా కష్టపడ్డారో మీకు బాగా తెలుసు…మరో ఐదేళ్లు చంద్రబాబు సీఎంగా ఉంటే రాష్ట్రం ఎలా అభివృద్ధి చెందేదో మీకు ఇప్పటికే అర్థమై ఉంటుంది…ఈ ఐదేళ్లలో యువత ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కోల్పోయారు.

వైసీపీ ప్రభుత్వం అధికా రంలోకి వచ్చాక ఏపీకి ఒక్క పరిశ్రమ కూడా రాలేదు…పైగా రాష్ట్రంలో ఉన్న పరిశ్రమలు పక్క రాష్ట్రాలకు తరలిపోయాయి…వైసీపీ రాక్షస పాలనలో టీడీపీ కార్యకర్తలను చంపడం, హింసించడం, ఇబ్బందులు పెట్టడం అలవాటుగా మారిందని విమర్శించారు. రాక్షస పాలనలో నేను ధైర్యంగా ఇలా మీ వద్దకు వచ్చానంటే మీరున్నారనే నమ్మకమేనన్నారు. గంజాయి, ఇసుక మాఫియా, భూకబ్జాలు, కల్తీ మద్యంతో వైసీపీ ప్రభుత్వం ఏపీని దేశంలో ముందు వరుసలో నిలబెట్టిందని, వైసీపీ చేసే ప్రతి తప్పును చంద్రబాబుపై నెట్టేసి చేతులు దులుపుకుంటున్నారని వ్యాఖ్యానించారు. నేడు కొత్తగా పెన్షన్ల విషయాన్ని కుట్రపూరితంగా చంద్రబాబుకు ఆపాదించడం సిగ్గుచేటన్నారు.

వృద్ధులను మంచాలపై ఎండలో తీసుకెళ్లి వాళ్ల ప్రాణాలను వైసీపీ నాయకులు, కార్యకర్తలు నిన్న బలి తీసుకున్నారని, రాష్ట్ర ప్రజల సంక్షేమం, అభివృద్ధి కోసం తపించిన చంద్రబాబు పేదవాళ్లకు పెన్షన్లను ఎలా అడ్డుకుం టారో రాష్ట్ర ప్రజలు అర్థం చేసుకోవాలని సూచించారు. టీడీపీ అధికారంలోకి వస్తేనే రాష్ట్ర సస్యశ్యామలంగా ఉంటుందని, రానున్న ఎన్నికల కురుక్షేత్రంలో టీడీపీ కార్యకర్తలు సై అంటే సై అనేలా ముందుకొచ్చి నిజాన్ని గెలిపించాలని, టీడీపీ జెండాను ఎగరేయడానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కడప జిల్లాకు చెందిన నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

LEAVE A RESPONSE