సారధి గారూ..మీరు ప్రజల వైపు నిలబడతారా?లేక ప్రభుత్వం వైపు ఉంటారా?

-నిర్ణయించుకోండి: అఖిలపక్ష కమిటీ
-మీ తోటి ఎమ్మెల్యేలు అయినటువంటి రోజా , ఆనం రామనారాయణ రెడ్డి అఖిల పక్షాలతో కలిసి వారి నియోజకవర్గం తరఫున పోరాడుతుంటే మీకు మాత్రం ఎందుకు ఉలుకు, పలుకు లేదు – బాబు రాజేంద్ర ప్రసాద్

కానూరు లోని చెర్రీస్ ఫంక్షన్ హాల్లో అఖిలపక్ష కమిటీ తీసుకున్న భవిష్యత్ కార్యచరణ నిర్ణయాలు

పెనమలూరు నియోజకవర్గాన్ని విజయవాడ జిల్లాలోనే కలపాలని, పెనమలూరు, కంకిపాడు, ఉయ్యూరు, మండలాలను గుడివాడ డివిజన్ లో కాకుండా విజయవాడ డివిజన్ లోనే చేర్చాలని జిల్లా కలెక్టర్కి మెమోరాండం ఇవ్వాలని నిర్ణయించిన అఖిలపక్ష కమిటీ.గ్రామస్థాయి నుంచి నియోజకవర్గ స్థాయి వరకు అన్ని పార్టీల వారు ప్రజలతో కలిసి ఉద్యమాలు పోరాటాలు చేయాలని నిర్ణయించిన అఖిలపక్ష కమిటీ .

ఈ సందర్భంగా అఖిలపక్ష కమిటీ కి అధ్యక్షత వహించిన రాజేంద్ర ప్రసాద్ ప్రసంగిస్తూ సారధి కి పెనమలూరు నియోజకవర్గ ప్రజల పై చిత్తశుద్ధి ఉంటే ముఖ్యమంత్రి ని కలిసి, అఖిలపక్ష డిమాండ్లపై మెమోరాండం ఇవ్వాలి. చిన్న జిల్లాలు, పెద్ద జిల్లాలు అంటూ కుంటిసాకులు చెబుతూ, ఉన్న తక్కువ సమయాన్ని వృధా చేయవద్దు. మీ వైఖరి ఏమిటో స్పష్టం చేయండి. ఇప్పుడు కనుక మీరు నోరు మెదపక పోతే, మిమ్మల్ని రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిపించిన పెనమలూరు నియోజకవర్గ ప్రజలకు, ద్రోహం చేసిన వారు అవుతారు. వారి దృష్టిలో చరిత్రహీనులుగా మిగిలిపోతారు.జిల్లాల విభజన పరిపాలన సౌలభ్యం కోసమే అని మీ ముఖ్యమంత్రి అన్నారు కాబట్టి, పెనమలూరు నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉండే విజయవాడ జిల్లాలోనే నియోజకవర్గాన్ని కలపాలి.

అఖిలపక్ష కమిటీ సిపిఐ నాయకులు ఆజాద్ ,జనసేన నాయకులు లోకేష్, సురేష్ గార్లు, తెదేపా నాయకులు గౌతమ్ , బిజెపి నాయకులు దుర్గా ప్రసాద్ , మాజీ జెడ్పిటిసి శ్రీనివాస రావు మాట్లాడుతూ.. సారధి కేవలం తన మంత్రి పదవి కోసమే పెనమలూరు నియోజకవర్గ ప్రజలకు అన్యాయం చేస్తున్నారు. మీకు నిజంగా పెనమలూరు నియోజకవర్గ ప్రజలపై ప్రేమాభిమానాలు ఉంటే మా అఖిలపక్ష కమిటీ తో కలిసి పోరాడండి.

అసలు మీకు పెనమలూరు నియోజకవర్గాన్ని విజయవాడ జిల్లా లో కలపడం ఇష్టమో లేదో స్పష్టం చేయండి. పెనమలూరు నియోజకవర్గ ప్రజల అభీష్టానికి వ్యతిరేకంగా మీరు పని చేస్తే, సమయం వచ్చినప్పుడు ప్రజలే మీకు తగిన బుద్ధి చెబుతారని అఖిలపక్ష కమిటీ నాయకులు సారధి ని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో అఖిలపక్ష కమిటీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Leave a Reply