Suryaa.co.in

Andhra Pradesh

స్కిల్ సర్వే మొక్కుబడిగా ఉండకూడదు!

  • అనవసరమైన ప్రశ్నలతో అపోహలకు గురిచేయొద్దు!
  • అంతిమంగా సర్వే లక్ష్యం యువతకు ఉద్యోగాల కల్పనే
  • నైపుణ్య గణనపై అధికారులతో మంత్రి లోకేష్ సమీక్ష

అమరావతి: రాష్ట్రంలో ప్రతిష్ఠాత్మకంగా చేపట్టనున్న నైపుణ్య గణన సర్వే మొక్కుబడిగా కాకుండా అర్థవంతంగా చేపట్టాలని రాష్ట్ర విద్య, ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. స్కిల్ సెన్సస్ సర్వే నిర్వహణపై స్కిల్ డెవలప్ మెంట్ అధికారులతో ఉండవల్లి నివాసంలో శుక్రవారం మంత్రి లోకేష్ సమీక్షించారు.

ఈ సందర్భంగా లోకేష్ మాట్లాడుతూ… స్కిల్ సెన్సస్ లో భాగంగా యువతకు చెందిన ఎడ్యుకేషన్, ఎంప్లాయ్ మెంట్, స్కిల్ ప్రొఫెల్స్ ను క్రోడీకరించి ప్రభుత్వమే ఒక ప్రత్యేక రెస్యూమ్ తయారు చేస్తుందని అన్నారు. ఈ ప్రొఫెల్స్ ను ప్రముఖ కంపెనీలకు నేరుగా యాక్సెస్ ఇస్తామని చెప్పారు. తద్వారా ఆయా కంపెనీలకు అవసరమైన నైపుణ్యం ఉన్న యువతను నేరుగా ఎంపిక చేసుకునే విధానం అందుబాటులోకి తీసుకస్తామని అన్నారు.ఎడ్యుకేషన్, స్కిల్ అప్ డేట్స్ ఎప్పటికప్పుడు అప్ గ్రేడ్ చేయాలని సూచించారు. ఇదే సమయంలో యువత, ప్రజలను అపోహలకు గురిచేసే అనవసరమైన ప్రశ్నలు అడగవద్దని స్పష్టం చేశారు.

స్కిల్ సెన్సస్ సర్వే అంతిమ లక్ష్యం యువతకు ఉద్యోగాల కల్పన మాత్రమేనని, ఆ దిశగా నైపుణ్య గణన జరగాలని అన్నారు. రాష్ట్రంలో ఉన్న పరిశ్రమల పెద్దలు, జాబ్ పోర్టల్స్ నిర్వాహకులతో మాట్లాడి మెరుగైన నైపుణ్య గణన కు సలహాలు తీసుకోవాలని చెప్పారు. నైపుణ్య గణన తరువాత యువతలో స్కిల్ డెవలప్ మెంట్ కు చర్యలు చేపడతామని తెలిపారు. యువత తమకు ఉద్యోగాలు దొరకడం లేదని యువత అంటున్నారు.

ప్రఖ్యాత కంపెనీలు నైపుణ్యం ఉన్న యువత దొరకడం లేదు అని కంపెనీలు అంటున్నాయి, ఈ రెండు సమస్యలకు సమాధానం గా నైపుణ్య గణన జరగాలన్నారు. పరిశ్రమలు అవసరమైన నైపుణ్య శిక్షణ, యువతకు ఉద్యోగాల కల్పన..ఈ రెండు అంశాలే నైపుణ్య గణన అంతిమ లక్ష్యమని చెప్పారు. పరిశ్రమలకు కావాల్సిన నైపుణ్య శిక్షణ ఇచ్చేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని అన్నారు. పూర్తి స్థాయి ప్రణాళిక సిద్ధమైన తర్వాత మంగళగిరిలో పైలెట్ ప్రాజెక్టుగా స్కిల్ సెన్సస్ సర్వే చేపట్టాలని మంత్రి లోకేష్ అధికారులను ఆదేశించారు.

స్కిల్ సెన్సస్ కోసం రూపొందించిన యాప్ లో పొందుపర్చిన అంశాలను అధికారులు వివరించారు. యాప్ లో పలు మార్పులు చెయ్యాలని లోకేష్ అధికారులకు సూచించారు. ఈ సమీక్షలో ఐటి శాఖ ముఖ్య కార్యదర్శి సౌరబ్ గౌర్, ఉన్నత విద్యశాఖ ఇన్చార్జి చైర్మన్ రామ్మోహన్ రావు, స్కిల్ డెవలప్ మెంట్ ఎండి గుమ్మాల గణేష్ కుమార్, నాక్ ఎడిజి కె.దినేష్ కుమార్, ఎపిసిఎఫ్ఎస్ఎస్ అధికారి వినయ్ తదితరులు పాల్గొన్నారు.

న్యాయ వివాదాల్లేకుండా వర్సిటీల్లో పోస్టుల భర్తీకి చర్యలు
న్యాయపరమైన చిక్కులు తొలగించి రాష్ట్రంలో వివిధ విశ్వవిద్యాలయాల పరిధిలో ఖాళీగా ఉన్న అధ్యాపక పోస్టులను భర్తీకి చర్యలు తీసుకోవాలని మంత్రి లోకేష్ ఉన్నత విద్య శాఖ అధికారులను ఆదేశించారు. యూనివర్సిటీల ర్యాంకింగ్స్ మెరుగుదలకు ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగాలని మంత్రి లోకేష్ సూచించారు.

LEAVE A RESPONSE