Suryaa.co.in

Telangana

సభ్యత్వ సేకరణ కార్యక్రమం వాయిదా

– కేంద్రమంత్రి, బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్ రెడ్డి

భారతీయ జనతా పార్టీ రాష్ట్ర స్థాయి సభ్యత్వ సేకరణ కార్యక్రమం ఈరోజు సెప్టెంబరు 3 ప్రారంభించాలని ముందుగా నిర్ణయించినా, భారీ వర్షాల దృష్ట్యా కార్యక్రమాన్ని వాయిదా వేయడం జరిగింది.
వరద ప్రభావిత ప్రాంతాల్లో బిజెపి కార్యకర్తలందరూ బాధితులకు సహాయ కార్యక్రమాల్లో నిమగ్నమయ్యారు.వరద ముంపు ప్రాంతాల ప్రజలు తేరుకున్నాక త్వరలోనే కొత్త తేదీని ప్రకటించి, తెలంగాణలో బిజెపి సభ్యత్వ నమోదు కార్యక్రమాన్నిప్రారంభిస్తాం.

తెలంగాణ రాష్ట్రంలో గత 4 రోజుల నుంచి భారీ వర్షాల కారణంగా ఖమ్మం, మహబూబాబాద్ జిల్లాలతో పాటు దాదాపు 11 జిల్లాల్లో వరదలతో ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వరదల కారణంగా పలు ప్రాంతాల్లో ప్రాణనష్టం జరగడం దురదృష్టకరం.

చాలా ప్రాంతాల్లో ప్రజలు ఇండ్లు, ఆస్తులు కోల్పోయారు. మరికొన్ని చోట్ల రోడ్లు, రైల్వే లైన్లు దెబ్బతిన్నాయి.తెలంగాణలో భారీ వర్షాలు, వరద పరిస్థితిపై మేం ఎప్పటికప్పుడు సమీక్షించి, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, ప్రధాని నరేంద్ర మోదీ దృష్టికి తీసుకెళ్లాం.
స్వయంగా ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా ,రాష్ట్ర ముఖ్యమంత్రితో మాట్లాడి వివరాలు తెలుసుకుని, అవసరమైన విధంగా రాష్ట్రానికి ఎన్డీఆర్ఎఫ్ బృందాలను పంపించారు.సహాయ సహకారాలు అందించారు.

వరంగల్, మహూబూబాద్ తో పాటు ఇతర ప్రాంతాల్లో దెబ్బతిన్న రోడ్లు, రైల్వే ట్రాక్ లను వెంటనే మరమ్మతులు చేసి, ప్రయాణికులు రాకపోకలు కొనసాగించేలా కేంద్ర ప్రభుత్వం సంబంధిత అధికారులను ఆదేశించింది.

అదేవిధంగా బిజెపి శ్రేణులు ఎక్కడ కూడా రాజకీయాలకు తావులేకుండా సేవాభావంతో వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యల్లో భాగస్వామ్యమయ్యారు. ముంపు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఇప్పటికీ చాలా గ్రామాల్లో వరదతో నిండి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రకృతి విపత్తుల సమయంలో సహాయం విషయంలో కేంద్రప్రభుత్వం కృషిచేస్తోంది.

ప్రకృతి విపత్తులు సంభవించినప్పుడు డిజాస్టర్ రెస్పాన్స్ ఫండ్ కింద కేంద్ర ప్రభుత్వం నిధులు కేటాయిస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం దగ్గర ఇప్పటికే స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫండ్స్ ఉన్నాయి. ఆ నిధులతో బాధితులకు సహాయ కార్యక్రమాలు చేపట్టాలి.

గత బీఆర్ఎస్ ప్రభుత్వంతో పాటు నేటి కాంగ్రెస్ ప్రభుత్వం గతంలో కేంద్రం విడుదల చేసిన స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫండ్స్ కు సంబంధించి యుటిలైజేషన్ సర్టిఫికెట్స్ ను కేంద్రానికి సమర్పించలేదు.గతంలో కేంద్ర ప్రభుత్వం స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫండ్స్ నిధులు విడుదల చేసినా, రాష్ట్ర ప్రభుత్వ వైఖరితో రాష్ట్రంలో బాధితులకు అందలేదు.

అయితే, మొన్నటి వర్షాలతో బాధితులు ఇబ్బందులు పడుతున్న కారణంగా రాష్ట్ర ప్రభుత్వం యుటిలైజేషన్ సర్టిఫికెట్స్ ఇవ్వకున్నా తాత్కాలికంగా వరద బాధిత ప్రాంతాలకు తక్షణమే సాయం అందించాలని కేంద్ర హోం సెక్రటరీని కోరాం.

ఇప్పటికే జూన్ 1వ తేదీన కేంద్రం రూ. 208 కోట్లు విడుదల చేసింది.
రాష్ట్ర అకౌంటెంట్ జనరల్ (AG) ఇచ్చిన వివరాల ప్రకారం తెలంగాణ SDRF అకౌంట్ లో రూ.1,345.15 కోట్లు ఉన్నాయి. వరదల కారణంగా మరణించిన మృతుల కుటుంబాలకు రూ. 3 లక్షల చొప్పున ఎక్స్ గ్రేషియా ప్రకటించింది.

క్షతగాత్రులకు 60% పైబడిన వైకల్యా నికి రూ.2.5లక్షలు, ఆసుపత్రిలో చికిత్స పొందిన వారికి, వారానికన్నా ఎక్కు వ రోజు ఆసుపత్రిలో ఉంటే రూ. 16వేలు, వారం కన్నా తక్కువ రోజులుంటే రూ.5,400 చొప్పున అందిస్తుంది.

వరదల కారణంగా వస్తువులు నష్టపోయిన వారికి. దుస్తులు నష్టపోయిన వారికి రూ.2,500, వంటపాత్రలు నష్టపోయిన వారికి రూ.2,500, పాడి పశువులను కోల్పో యిన రైతులకు గేదె, ఆవులకు అయితే ఒక్కో దానికి రూ. 37,500, గొర్రె, మేకలకు అయితే.. ఒక్కోదానికి రూ.4వేలు, ఒక్కో ఎద్దుకు రూ. 32వేల చొప్పున కేంద్ర ప్రభుత్వం ఆర్థిక సాయం అందించనుంది.

వరదల కారణంగా జీవనోపాధి కోల్పోయిన వారికి, ఉపాధిహామీ పథకం ప్రకారం రోజుకు ఇవ్వాల్సిన కూలీ అందిస్తుంది. బాధితులను లెక్కించాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిదే.

వరదల కారణంగా జీవనోపాధి కోల్పోయిన వారికి 2 హెక్టార్ల (5 ఎకరాలు) వరకు భూమి ఉన్న చిన్న , సన్నకారు రైతులకు సహాయం అందించడం జరుగుతంది. పంటపొలాల్లో కూరుకుపోయిన మట్టిని తొలగించేందుకు హెక్టారుకు (2.5 ఎకరాలు) రూ.18వేలు, ఒక రైతుకు కనీసం రూ.2,200 చొప్పున సహాయం అందిస్తుంది.

పంటలకు వర్షాధార ప్రాంతాల్లో హెక్టారుకు రూ.8,500, నీటిపారుదల అందుబాటులో ఉన్నపంటలకు హెక్టారుకు రూ.17వేలు, పామాయిల్, కొబ్బరి వంటి శాశ్వత పంటలకు,హెక్టారుకు రూ.22,500 అందిస్తుంది.
రాష్ట్ర ప్రభుత్వం కూడా వరదల వల్ల జరిగిన నష్టాన్ని అంచనా వేసి కేంద్ర ప్రభుత్వం నుంచి అందించే ఆర్థిక సాయాన్ని బాధితులకు అందజేయాలని కోరుతున్నాం.గతంలోనూ విడుదల చేసిన నిధులకు యుటిలైజేషన్ సర్టిఫికెట్ సమర్పించి, అదనంగా ఎస్డీఆర్ఎఫ్ నిధులను పొందాలని కోరుతున్నాను.

రాష్ట్ర ప్రభుత్వం వరద ప్రభావిత ప్రాంతాల్లో అంటు వ్యాధులు సోకకుండా చర్యలు తీసుకోవాలి.అందుకు అవసరమైన మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేసి, డాక్టర్లను కేటాయించాలి.అదేవిధంగా ప్రజలకు జరిగిన నష్టాన్ని పూడ్చేలా సహాయసహకారాలు అందించాలి.రాష్ట్ర ప్రభుత్వం వరదలతో జరిగిన నష్టాన్ని అంచనా వేసి నిధులు సమకూర్చాలి.

ఇంతవరకు అధికార పార్టీకి చెందిన నాయకులు చాలావరకు తమ వద్దకు రాలేదంటూ వరద బాధితుల నుంచి ఆరోపణలు వస్తున్నాయి. సెప్టెంబరు 17 న తెలంగాణ గడ్డపై నిరంకుశ నిజాం సైన్యాన్ని ఓడించి, భారత త్రివర్ణ పతాకం ఎగిరిన రోజు.

గత రెండేళ్లుగా కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో అధికారికంగా హైదరాబాద్ ముక్త్ దివస్ ను జరుపుకుంటున్నాం.అదేవిధంగా ఈ ఏడాది కూడా సెప్టెంబరు 17న కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో వేడుకలు నిర్వహించాలని ఆదేశించింది.ఇప్పటికే కర్నాటక, మహారాష్ట్ర ప్రభుత్వాలు హైదరాబాద్ ముక్తి దివస్ పేరుతో అధికారిక కార్యక్రమాలు కొనసాగిస్తున్నాయి.

దురదృష్టవశాత్తు తెలంగాణ రాష్ట్రంలో మజ్లిస్ పార్టీకి భయపడి గతంలోని బీఆర్ఎస్ ప్రభుత్వం ఉత్సవాలు నిర్వహించలేదు. అందుకే, కేంద్ర ప్రభుత్వం చొరవ తీసుకుని సెప్టెంబరు 17న అధికారికంగా తెలంగాణ విమోచన దినోత్సవ వేడులకను జరుపుతోంది.సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ లో ఉ.9 గం.లకు హైదరాబాద్ ముక్త్ దివస్ ఉత్సవాలను నిర్వహిస్తాం.

రాష్ట్రంలో బిజెపి అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలోని ప్రతి గ్రామ పంచాయతీ భవనంపై, ప్రభుత్వ పాఠశాలలపై త్రివర్ణ పతాకం ఎగురవేసి వేడుకలను ఘనంగా జరుపుతాం.

LEAVE A RESPONSE