Suryaa.co.in

Andhra Pradesh

జత్వానీ కేసులో అన్ని వేళ్ళూ సజ్జల రామకృష్ణారెడ్డి వైపే

– అమరావతి బహుజన ఐకాస అధ్యక్షుడు పోతుల బాలకోటయ్య

అమరావతి: క్రైమ్ థ్రిల్లర్ కథను మించిన ముంబై నటి కాదంబరి జత్వాని కేసులో ప్రభుత్వ దర్యాప్తు కోణం, సిఎంవో ఆఫీసులో వ్యూహ రచన, విజయవాడ డిసిసి విశాల్ గున్నీ లిఖిత పూర్వక వాంగ్మూలం అన్నీ అప్పటి ప్రభుత్వ ప్రధాన సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి వైపే చూపుతున్నాయని అమరావతి బహుజన ఐకాస అధ్యక్షులు పోతుల బాలకోటయ్య వ్యాఖ్యానించారు.

. వెంటనే సజ్జలపై కూడా కేసు నమోదు చేసి దర్యాప్తు చేయాలని డిమాండ్ చేశారు. జత్వానీ కేసులో కేవలం ఫిర్యాదు దారుడు కుక్కల విద్యా సాగర్ను పావుగా వాడుకున్నారని, కేసులో వాడుకున్న సివిల్ వివాదం బూటకం అని చెప్పారు. దీని వెనుక లెక్కకు మించిన డబ్బు ముడుపులుగా చేతులు మారాయని, అప్పటి ‘పేద’ ముఖ్యమంత్రి బంధుప్రీతి కూడా, ‘గొడ్డలి వేటు కేసు’లో సాయం చేసినట్లు చేసి ఉండవచ్చని అనుమానం వ్యక్తం చేశారు.

ఐదేళ్ళ వైకాపా పాలనలో జరిగిన దాష్టీకాలకు కాదంబరీ కేసు పరాకాష్ట అని, ఇది ఐపిఎస్ చరిత్రకే మాయని మచ్చ అని అభివర్ణించారు. ఆనాటి పాలనలో జరిగిన అరాచకాలను తవ్వుకుంటూ పోతే, చాలా మంది జత్వానిలు వెలుగు చూడొచ్చునేమో అని అభిప్రాయపడ్డారు.

కూటమి ప్రభుత్వానికి ముంబై నటి కేసు ఒక టాస్క్ అని, ఇప్పటికే ప్రభుత్వం ముగ్గురు ఐపిఎస్ అధికారులపై సస్పెన్షన్ వేటు వేసి ముందడుగు వేసిందని, నిష్పక్షపాతంగా విచారణ చేసి, సినీ నటి కేసులో ‘లాండ్ మార్క్’ న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని బాలకోటయ్య విజ్ఞప్తి చేశారు.

LEAVE A RESPONSE