Suryaa.co.in

Telangana

ట్రిపుల్ ఆర్ అలైన్మెంట్ మార్పులో బిగ్ బ్రదర్స్ దందా

– కుట్రగేట్ అనే ప్రాంతంలో ఆఫీస్ ఏర్పాటు చేసుకొని, మరి ఈ భూములు లాక్కునే కుట్రలు
– కాంగ్రెస్ నేతల భూములు ఉన్న వైపు అలైన్మెంట్ మారుస్తున్నారు
– ఎవరి భూముల కోసం,ఎవరి స్వలాభం కోసం ఈ అలైన్ మెంట్ మార్పు జరుగుతోంది?
– ఇందులో బిగ్ బ్రదర్స్ తో పాటు కాంగ్రెస్ పెద్దల హస్తం ఉన్నది అని స్థానికులు అంటున్నారు
– అలైన్మెంట్ మారి కాంగ్రెస్ ఎమ్మెల్యే గ్రామం మీదుగా ఎలా వెళ్తోంది?
– మాడుగుల గ్రామం సీఎం బంధువులది
చేవెళ్ల మార్గంలో అంగడి చిట్టెంపల్లి నుంచి ఐదు కిలోమీటర్లు జరిగి మన్నెగూడ క్రాస్ రోడ్స్ కు మార్చారు
మన్నెగూడ సమీపంలో కాంగ్రెస్ ఎమ్మెల్యే, మాజీ ఎంపీ, మాజీ మంత్రి, కాంగ్రెస్ నేతల భూములు
– పేదల భూముల్లో గద్దల్లా వాలుతున్నారు
– ఎన్నడూ చూడని విధంగా కొత్తగా రైతుల నుండి కబ్జా రద్దు ఒప్పంద పత్రాలు చేసుకుంటున్నారు?
– కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి,హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ చొరవ తీసుకోవాలి
– త్రిబుల్ ఆర్ అలైన్మెంట్ మార్పు పై సీబీఐ విచారణ జరపాలి
– సీబీఐ విచారణ చేయకుంటే బీజేపీ,కాంగ్రెస్ ఒక్కటేనన్న విషయం తేటతెల్లం అవుతుంది
– మాజీ మంత్రి, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి

హైదరాబాద్: ట్రిపుల్ ఆర్ దక్షిణ భాగం అలైన్మెంట్ మార్పు వెనుకాల కాంగ్రెస్ ప్రభుత్వ పెద్దలు ఉన్నారని, రైతుల నుంచి అక్రమంగా భూములు లాక్కుంటూ అరాచకాలకు పాల్పడుతున్నారని మాజీ మంత్రి ,ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. దీనిపై సీబీఐ విచారణ చేయాలని ఆయన డిమాండ్ చేశారు.

ఆయన శుక్రవారం తెలంగాణ భవన్ లో మీడియా సమావేశం ఏర్పాటు చేసి పలు కీలక విషయాలు వెల్లడించారు. “రీజినల్ రింగ్ రోడ్ దక్షిణభాగం అలైన్ మెంట్ మార్పుతో రేవంత్ రెడ్డి ప్రభుత్వం భూదందాలకు తెరలేపుతోంది. కేంద్ర నిధులతో చేయాలని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీని, కేసీఆర్ ఒప్పించారు. ట్రిపుల్ ఆర్ ఉత్తర భాగం అలైన్ మెంట్ ఆమోదం పొందింది, ఎక్కడా ఎలాంటి ఇబ్బంది లేదు.

దక్షిణ భాగం అలైన్ మెంట్ కూడా గతంలోనే ఖరారు చేశారు, ఆమోదముద్ర పొందాల్సి ఉంది. స్వలాభం ఉందా లేదా అని కాంగ్రెస్ ప్రభుత్వం తొమ్మిది నెలల్లో చూసుకొంది. స్వలాభం కోసం రీజినల్ రింగ్ రోడ్ అలైన్ మెంట్ మారుస్తూ, పేదల భూముల్లో నుంచి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. దక్షిణ భాగం భూసేకరణ, రోడ్డు కోసం రాష్ట్రం 2500 కోట్లు, కేంద్రం 12,500 కోట్లు ఖర్చు పెట్టాలి.

కాంగ్రెస్ నేతల భూములు ఉన్న వైపు అలైన్ మెంట్ మారుస్తున్నారు.సాగర్ రోడ్ లో గొల్లపల్లి గ్రామం నుంచి కర్మపల్లి గ్రామానికి 2కిమి, శ్రీశైలం రోడ్డులో కాటన్ మిల్ నుండి ఆమన్గల్ దాటి దాదాపు నాలుగు కిలోమీటర్లు దూరానికి మార్చారు. ఫోర్త్ సిటీ సౌలభ్యం కోసం అలైన్మెంట్ మారుస్తున్నామని అన్నారు.

ఫోర్త్ సిటీ, పాత అలైన్ మెంట్ మధ్య దూరం 10 కిలో మీటర్లు ఉంటే, కొత్త అలైన్ మెంట్ మధ్య దూరం 12 కిలో మీటర్లు అయింది. అలైన్మెంట్ మార్పుతో ఫోర్ట్ సిటీకి దూరమైంది. అమన్ గల్ వద్ద 400 ఎకరాల కుందారం భూములను పేదలు సాగు చేసుకుంటున్నారు. రాజ వంశీయులతో బేరం చేసుకొని పేదలను వెల్లగొట్టి కాంగ్రెస్ నేతలు భూములు ఆక్రమిస్తున్నారు, అక్కడ బిగ్ బ్రదర్స్ పేర్లు చెబుతున్నారు.

జనవరి నుంచే పేద రైతుల నుంచి కబ్జా రద్దు ఒప్పందాలు చేసుకుంటూ భూములు లాక్కుంటున్నారు. కబ్జా రద్దు ఒప్పందం మొదటిసారి చూస్తున్నాం. అలైన్మెంట్ మారి కాంగ్రెస్ ఎమ్మెల్యే గ్రామం మీదుగా ఎలా వెళ్తోంది? మాడుగుల గ్రామం సీఎం బంధువులది, అక్కడ ఏం జరుగుతోంది? చేవెళ్ల మార్గంలో అంగడి చిట్టెంపల్లి నుంచి ఐదు కిలోమీటర్లు జరిగి మన్నెగూడ క్రాస్ రోడ్స్ కు మార్చారు.

మన్నెగూడ సమీపంలో కాంగ్రెస్ ఎమ్మెల్యే, మాజీ ఎంపీ, మాజీ మంత్రి, కాంగ్రెస్ నేతల భూములు ఉన్నాయని ప్రజలు చెప్తున్నారు… బిగ్ బ్రదర్స్ భూములు సేకరించి పెట్టుకున్నారని అంటున్నారు. ట్రిపుల్ ఆర్ దక్షిణ భాగంలో నాలుగు చోట్ల అలైన్ మెంట్ మార్చడం వెనకాల మతలబు ఏమిటి?

కాంగ్రెస్ నేతల భూములు ఉన్న వైపు అలైన్ మెంట్ మారుస్తున్నారు. ఇందులో బిగ్ బ్రదర్స్ హస్తం ఉంది. మాడుగుల గ్రామం లో సీఎం బంధువుల భూములు ఉన్నాయి. ఎందుకోసం అలైన్ మెంట్ మారుస్తున్నారో స్పష్టంగా అర్థం అవుతోంది. అలైన్మెంట్ మార్పు పై శ్వేత పత్రం విడుదల చేయాలి.

మొదటి అలైన్మెంట్ తో ఎలాంటి గొడవ లేదు, ఇప్పుడు అందరూ ఇబ్బంది పడుతున్నారు.అలైన్మెంట్ మారుస్తూ పోతే కేంద్రం ప్రాజెక్టు టేకప్ చేయకపోవచ్చు కూడా. కేంద్రం చేయకపోయినా సరే, రోడ్డు మా భూముల గుండా పోవాల్సిందే అని కాంగ్రెస్ నేతలు అంటున్నారు. తెలంగాణ పై 12500 కోట్ల అప్పుల భారం వేసి, ప్రజల్ని అప్పుల ఊబిలోకి నెట్టైనా సరే ప్రపంచబ్యాంకు నిధులతో చేపట్టాలని భావిస్తున్నారు.

కుట్ర గేట్ అనే ప్రాంతంలో ఆఫీస్ ఏర్పాటు చేసుకొని, మరి ఈ భూములు లాక్కునే కుట్రలు చేస్తున్నారు. పాత అలైన్ మెంట్ కొనసాగించాలి. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కూడా జోక్యం చేసుకొని పేదలు, గిరిజనుల బాధలు అర్థం చేసుకోవాలి. ప్రభుత్వం మార్చాలని అనుకుంటే పూర్తి పారదర్శకంగా, పేదలకు మంచి పరిహారం ఇచ్చి చేయాలి.

అలైన్మెంట్ మార్పు వెనకాల దందాలు, అరాచకాలు ఉన్నాయి.ఎవరి భూముల కోసం అలైన్ మెంట్ మార్పు జరుగుతోంది? అన్ని అంశాలు బయటకు రావాలంటే, సీబీఐ విచారణ చేపట్టాలని కేంద్ర మంత్రి బండి సంజయ్ ను కోరుతున్నాను. ఎవరి ప్రమేయంతో అలైన్ మెంట్ మారుస్తున్నారు?ఎవరికి మేలు జరుగుతోంది? ప్రజలకు తెలియాలి.

ప్రజలకు ఉన్న అనుమానాలను సీఎం, ప్రభుత్వం నివృత్తి చేయాల్సిన అవసరం ఉంది. అలైన్మెంట్ మార్పు వ్యవహారంపై సీబీఐ విచారణ కోరాలి. సీబీఐ విచారణ చేయకపోతే కాంగ్రెస్, భాజపా ఒక్కటే అని భావించాల్సి వస్తుంది.

LEAVE A RESPONSE