– ప్రజల దృష్టి మళ్లించేందుకే ‘అమృత్’పై కాంగ్రెస్, బీఆర్ఎస్ డ్రామాలు
– అవినీతి బయటకు రావాలంటే సీవీసీ విచారణ కోరాలి
– రేవంత్‌రెడ్డి సర్కారుకు కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ సవాల్
హైదరాబాద్ : దేశంలో పట్టణాల్లో మౌలిక వసతులు మెరుగుపర్చే ఒక సదుద్దేశ్యంతో కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం అమృత్ పథకాన్ని ప్రవేశపెడితే.. గత బీఆర్ఎస్, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వాలు పెద్దఎత్తున అవినీతికి పాల్పడుతూ, ఈ పథకం ప్రయోజనాలు ప్రజలకు అందకుండా చేస్తున్నాయి.
ఈ పథకంలో అవినీతి జరిగిందని ఈ రెండూ పార్టీలు ఒకదానిపై మరొకటి ఆరోపణలు గుప్పించుకుంటూ డ్రామాలాడుతున్నాయి. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం ఈ పథకంలో పెద్దఎత్తున అవినీతికి పాల్పడి, తమకు కావాల్సిన వాళ్లకే కాంట్రాక్టులు కట్టబెట్టిందని బీఆర్ఎస్ ఆరోపిస్తుంటే… గత బీఆర్ఎస్ ప్రభుత్వమే అవినీతికి పాల్పడిందని కాంగ్రెస్ ప్రత్యారోపణలు చేయడం, దొందుదొందే అన్న చందంగా ఉంది.
కాంగ్రెస్ 6 గ్యారంటీల అమలులో వైఫల్యాలపై ప్రజల దృష్టి మళ్లించేందుకు వీరిరువురూ సవాళ్లు, ప్రతిసవాళ్లు చేసుకుంటూ డ్రామాను రక్తి కట్టించే ప్రయత్నం చేస్తున్నారు. దొంగలు దొంగలు ఊళ్లు పంచుకున్న చందంగా వీరిద్దరూ ఈ పథకంలో పెద్దఎత్తున అవినీతికి పాల్పడి, తమకు కావాల్సిన వాళ్లకు కాంట్రాక్టులు ఇప్పించుకొని, పెద్దఎత్తున కమీషన్లు కొట్టేశారన్నది వాస్తవం.
ఈ స్కీంలో చోటుచేసుకున్న అవినీతిని వెలికితీయాలన్నా… బీఆర్ఎస్, కాంగ్రెస్ ఆరోపణల్లో నిజానిజాలు బయటకు రావాలన్నా సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ ఆధ్వర్యంలో తెలంగాణలో ఈ కేంద్ర పథకం అమలుపై విచారణ జరిపించాలి. ఇందుకు అమృత్ పథకంలో జరిగిన అవినీతిపై విచారణ కోరుతూ ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వం సెంట్రల్ విజిలెన్స్ కమీషన్ (సీవీసీ)కు లేఖ రాయాలి.
రాష్ట్ర ప్రభుత్వం లేఖ రాస్తే దీనిపై విచారణ జరిపేందుకు సీవీసీని ఒప్పించేలా కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి హోదాలో నేను వ్యక్తిగతంగా చొరవ చూపుతాను. తెలంగాణలో అమృత్ పథకం సక్రమంగా అమలవుతుందని, ఇందులో ఎలాంటి అవినీతి జరగలేదని, కాంట్రాక్టు కట్టబెట్టడంలో పక్షపాతం చూపలేదని కాంగ్రెస్ ప్రభుత్వం భావిస్తే తక్షణమే సీవీసీకి లేఖ రాయాలి.
లేకుంటే కాంగ్రెస్ ప్రభుత్వం అవినీతికి పాల్పడినట్టు భావించాల్సి వస్తుంది. 6 గ్యారంటీల అమలులో వైఫల్యం, హైడ్రా కూల్చివేతల నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకే ‘అమృత్’ విషయంలో బీఆర్ఎస్, కాంగ్రెస్ డ్రామాలాడుతున్నాయని స్పష్టమవుతోంది.