Suryaa.co.in

Andhra Pradesh

దేవుడి గుడిని పడగొట్టి, దోపిడీ!

– విలువైన వస్తువులు కొల్లగొట్టారు
– కొడాలి అనుచరులు స్థలాన్ని కబ్జా చేసి ఇంటిపై దాడి
– సర్వే పేరుతో పక్క భూములెక్కించి అన్యాయం
– ఎమ్మెల్యే అనుచరులు, వైసీపీ నేతలు ఇబ్బంది పెడుతున్నారంటూ టీడీపీ కార్యకర్త మొర
– గ్రీవెన్స్‌కు వెల్లువెత్తిన బాధితుల ఫిర్యాదులు

మంగళగిరి: తెలుగుదేశం పార్టీ(టీడీపీ) స్థానిక కేంద్ర కార్యాలయంలో బుధవారం గ్రీవెన్స్‌ కార్యక్రమం జరిగింది. పలువురు బాధితులు న్యాయం కోసం తరలివచ్చారు. పల్నాడు జిల్లా, బెల్లంకొండ మండలం మన్నె సుల్తాన్ పాలెంకు చెందిన అక్కల సుబ్బారెడ్డి, గ్రామ ప్రజలు వారి అర్జీని అందిస్తూ.. గ్రామంలో ఉన్న శ్రీరామలింగేశ్వరస్వామి దేవస్థానం పునర్నిర్మాణం కోసమని పాత గుడిని తొలగించారని.. ఆ శిథిలాల కింద విలువైన వస్తువులు బయటపడ్డాయని.. కార్యనిర్వహణాధికారి రామకోటిరెడ్డి, డీఈఓ సత్యనారాయణరెడ్డి, గుమస్తా జాలయ్య, అక్కల మధుసూధన్ రెడ్డిలు ఈ విషయాన్ని దాచిపెట్టి గ్రామస్తులను మభ్యపెడుతూ.. దొరికిన వస్తువులను గుట్టుచప్పుడు కాకుండా పంచుకున్నారని ఫిర్యాదు చేశారు.

అధికారులు స్పందించి దీనిపై విచారించి చర్యలు తీసుకునేలా చూడాలని కోరారు. ఏపీఎస్ ఆర్టీసీ ఛైర్మన్ కొనకళ్ల నారాయణ, మాజీ శాసన మండలి ఛైర్మన్ షరీఫ్, కొమ్మలపాటి శ్రీధర్, స్టేట్ మైనార్టి సెల్ రాష్ట్ర అధ్యక్షులు మౌలానా ముస్తాక్ అహ్మద్ లకు వినతి ఇచ్చి అభ్యర్థించారు. దీనిపై స్పందించిన నేతలు విచారించి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. అనంతరం వచ్చిన అర్జీ దారుల నుండి వినతులు స్పీకరించారు.

• కొడాలి నాని, శశిభూషన్ అనుచరులైన అడబాల అప్పారావు కుమారులు తన స్థలానికి దొంగ రిజిస్ట్రేషన్‌ చేయించి అక్రమంగా తన స్థలంలోకి ప్రవేశించి చెట్లను ధ్వంసం చేసి.. ఇటుకరాళ్లను 25 ట్రక్కుల మట్టిని దోచుకెళ్లారని.. అడ్డుకోబోయిన తన భార్య బిడ్డలను హింసించారని.. తనకు ఆ స్థలం ఒక్కటే ఆస్తి అని.. తనకు న్యాయం చేసి ఆదుకోవాలని కృష్ణా జిల్లా గుడివాడకు చెందిన గుర్రాలు సుబ్బారావు నేతలను వేడుకున్నారు
• తమ వద్ద గతంలో ఇంఛార్జ్ ఎమ్మార్వోగా ఉన్న పిల్లి సునీత రూ. 14 లక్షలు డబ్బులు తీసుకుని.. నకిలీ పాసుపుస్తకాలు ఇచ్చి మోసం చేశారని.. ఫారెస్ట్ ల్యాండ్ కు డిపట్టాలు ఇచ్చి 23 కుటుంబాలను అన్యాయం చేసిందని.. తమకు న్యాయం చేయాలని పల్నాడు జిల్లా మన్నెసుల్తాన్ పాలెం బాధితులు గ్రీవెన్స్ లో నేతలకు అర్జీ ఇచ్చి అభ్యర్థించారు.
• గుంటూరు జిల్లా మెడికొండూరు మండలం సిరిపురం గ్రామానికి చెందిన కడియాల సాంబశివరావు విజ్ఞప్తి చేస్తూ.. గత ప్రభుత్వం చేపట్టిన రీ సర్వేలో తన పేరున ఉన్న భూమిని మరొకరి పేరుపైకి మార్చి వారికి అధికారులు పాసు పుస్తకాలు ఇచ్చారని దాన్ని రద్దు చేసి తన భూమిని తనకు ఉండేలా చర్యలు తీసుకోవాలని గ్రీవెన్స్ లో నేతలను కలిసి వేడుకున్నారు.
• గుంటూరుకు చెందిన బూర్లె లలితా, బూర్లె గాయిత్రిలు తాము డిగ్రీలు పూర్తి చేశామని.. ఎటువంటి ఉద్యోగం లేక ఇబ్బంది పడుతున్నామని.. తమకు ఉద్యోగ అవకాశం కల్పించి ఆదుకోవాలని వారు గ్రీవెన్స్ లో అర్జీని ఇచ్చి అభ్యర్థించారు.
• వైసీపీ నేతలు సిద్దారెడ్డి, స్థానిక ఎమ్మెల్యే అనుచరులు, ఎమ్మెల్యే తమపై కక్షగట్టి ఇబ్బంది పెడుతున్నారని.. గత ప్రభుత్వంలో వైసీపీ నేతలు అక్రమ కేసులు పెట్టి ఇబ్బంది పెట్టారని.. నేడు తాము కొనుగోలు చేసి రిజిస్ట్రేషన్‌ చేయించుకున్న పొలంలో రేకుల సెడ్డు వేసుకుంటే ఆ సెడ్ ను ధ్వంసం చేసి ఎమ్మెల్యే అనుచరులు అరక సామాను దోచుకెళ్లారని తమకు తీవ్ర నష్టం కలిగించారని.. న్యాయం చేసి ఆదుకోవాలని కదిరికి చెందిన గూడూరు సౌభాగ్యవతి గ్రీవెన్స్ లో నేతలను కలిసి అర్జీని ఇచ్చి వేడుకున్నారు.
వీరితో పాటు పలువురు ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నామని వైద్యం నిమితం ఆర్థిక సాయం చేసి ఆదుకోవాలని నేతలకు అర్జీలు ఇచ్చి వేడుకున్నారు. అలాగే కింది స్థాయిలో అధికారులు సక్రమంగా పనిచేయడం లేదని.. ప్రజా సమస్యలను పట్టించుకోవడంలేదని.. అటువంటి అధికారుల వల్ల ప్రభుత్వానికి చెడ్డపేరు వస్తదని పలువురు కార్యకర్తలు నేతలకు సమస్యను వివరించారు.

LEAVE A RESPONSE