Suryaa.co.in

Telangana

రేపు ప్రవాసీ ప్రజావాణి ప్రారంభం

– ఏర్పాట్లను పర్యవేక్షించిన ఎన్.ఆర్.ఐ. ప్రతినిధులు
– ‘ప్రవాసీ ప్రజావాణి’ తో గల్ఫ్ వలస జీవులకు రాష్ట్ర ప్రభుత్వం ఓదార్పు, మనో ధైర్యం
– గల్ఫ్ కార్మికులకు కష్టమొస్తే… ఇక్కడ హైదరాబాద్ లో రాష్ట్ర ప్రభుత్వానికి చెప్పుకోవచ్చు
– భారత విదేశాంగ శాఖతో తెలంగాణ ప్రభుత్వం సమన్వయం

హైదరాబాద్: విదేశాల్లో పనిచేసే కార్మికుల బాధలను, వారి కుటుంబ సభ్యుల ద్వారా హైదరాబాద్ బేగంపేటలోని ప్రజాభవన్ లో ‘ప్రవాసీ ప్రజావాణి’ లో విన్నవించుకునే అవకాశాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కల్పించనుంది.

ఈనెల 27 వ తేదీ శుక్రవారం రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ డాక్టర్ జీ చిన్నారెడ్డి, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, ఎమ్మెల్సీ, పీసీసీ అధ్యక్షుడు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్, పలువురు ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు కలిసి మహాత్మా జ్యోతిబా ఫూలే ప్రజా భవన్ లో ” ప్రవాసీ ప్రజావాణి ” ప్రత్యేక కౌంటర్ ను ప్రారంభించనున్నారు. రాష్ట్ర ప్రభుత్వం కల్పించనున్న ప్రవాసీ ప్రజావాణి కార్యక్రమం చరిత్రలో నిలిచిపోనుంది.

శుక్రవారం లాంఛనంగా ప్రారంభం కానున్న ” ప్రవాసీ ప్రజావాణి ‘ ఏర్పాట్లను ఎన్.ఆర్.ఐ. ప్రతినిధులు డాక్టర్ వినోద్ కుమార్, మంద భీం రెడ్డి, నంగి దేవేందర్ రెడ్డి ( దుబాయ్ ), బొజ్జ అమరేందర్ రెడ్డి ( అమెరికా ), గంగసాని నవీన్ రెడ్డి ( లండన్ ), చెన్నమనేని శ్రీనివాస్ రావు గురువారం ప్రజా భవన్ లో పరిశీలించారు.

గల్ఫ్ తో పాటు ఇతర దేశాలలో ఉన్న భారతీయులు రకరకాల సమస్యలను ఎదుర్కొంటున్నారు. ఇండియాలో ఉన్న వారి కుటుంబ సభ్యులు ఢిల్లీలోని భారత ప్రభుత్వ దేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖను, విదేశాలలోని భారత రాయబార కార్యాలయాలను సంప్రదించదానికి సరైన మార్గదర్శనం లేక దిక్కు తోచని పరిస్థితిలో ఉన్నారు.

ఇలాంటి ప్రవాసి కార్మికులకు, కేంద్ర ప్రభుత్వానికి, భారత రాయబార కార్యాలయాలకు మధ్యన ఒక వారధిలాగా పనిచేయడానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వచ్చింది.

విదేశాలలోని భారత రాయబార కార్యాలయాలు అందించే దౌత్య సంబంధమైన సేవలను వేగవంతం చేయడానికి ‘ప్రవాసీ ప్రజావాణి’ ఉపయోగపడుతుంది.

వేతన బకాయిలు (సాలరీ డ్యూస్), యజమానితో సమస్యలు (స్పాన్సర్ ప్రాబ్లం), ఉద్యోగ ఒప్పంద సమస్య (కాంట్రాక్టు ప్రాబ్లం), పరిహారం (కాంపెన్సేషన్), కార్మికులను ఇబ్బంది పెట్టడం (వర్కర్ అబ్యూస్), విదేశంలో జైలు పాలయినప్పుడు (ఇంప్రిజండ్ అబ్రాడ్), మృతదేహాలను స్వదేశానికి రవాణా చేయడం (మోర్టల్ రిమేన్స్), స్వదేశానికి వాపస్ పంపడం (రిపాట్రియేషన్), తప్పిపోయిన / జాడ తెలియని వారి ఆచూకి తెలుసుకోవడం (వేర్ అబౌట్స్ అన్నోన్), వివాహ సంబంధ వివాదాలు (మారిటల్ డిస్పూట్) లాంటి ఫిర్యాదులు, విజ్ఞప్తులు ” ప్రవాసీ ప్రజావాణి ” లో నమోదు చేసుకోవచ్చు.
రిక్రూటింగ్ ఏజెంట్ల మోసాల గురించి పోలీస్ శాఖ, ప్రొటెక్టర్ ఆఫ్ ఎమిగ్రంట్స్ (పిఓఈ) ల సహాయం తీసు కోవచ్చు.

LEAVE A RESPONSE