– సర్పంచులు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలకు సైతం 8 నెలల గౌరవ వేతనాలు చెల్లించని పరిస్థితి
– 15వ ఆర్థిక సంఘం కేటాయించిన పంచాయతీ రాజ్ నిధుల విడుదలలో జాప్యం..జాతీయ ఉపాధి హామీ పథకం మెటీరియల్ కాంపోనెంట్ నిధులు విడుదల చేయడంలో ఆలస్యం కారణంగా ఎదురవుతున్న సమస్యలు
– తక్షణ పరిష్కారం కోరుతూ ఉపముఖ్యమంత్రి భట్టికి మాజీ మంత్రి హరీష్ రావు బహిరంగ లేఖ
గౌరవ ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క గారికి,
పంచాయతీరాజ్ చట్టాన్ని తెచ్చేందుకు కృషి చేశామని, రాజీవ్ గాంధీ వారసులమని గొప్పలు చెప్పుకునే మీరు సచివాలయం ముందున్న రాజీవ్ గాంధీ విగ్రహం సాక్షిగా పంచాయతీ రాజ్ చట్టాలను తుంగలో తొక్కడం దారుణం. 15వ ఆర్థిక సంఘం కేటాయించిన నిధులను గ్రామ పంచాయతీలకు విడుదల చేయకపోవడం వల్ల రాష్ట్రంలో గ్రామాభివృద్ధి నిలిచిపోయింది.
గత 8 నెలలుగా నిధులు లేక గ్రామాల్లో పారిశుద్ధ్యం కుంటుపడింది. నయా పైస కూడా విడుదల చేయకుండా నిర్వహణను గాలికి వదిలి వేయడంతో గ్రామాలు కునారిల్లుతున్నయి. మురికి కూపాలుగా మారాయి. చివరకు ట్రాక్టర్లకు డీజిల్ డబ్బులు కూడా ఇవ్వలేని పరిస్థితి. కొన్ని చోట్ల అధికారులు అప్పులు చేసి డీజిల్ పోయిస్తున్నారంటే పరిస్థితి ఎంత అధ్వాన్నంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. దీంతో గ్రామ పాలన ఆగిపోయింది.
చెత్త సేకరణ నిలిపోయింది. ట్రాక్టర్ మూలన పడింది. స్ట్రీట్ లైట్ల నిర్వహణ లేదు. తాగునీటి సరఫరా నిర్వహణ మూలనపడింది. ఫాగింగ్ లేదు, చివరకు బ్లీచింగ్ పౌడర్ అందించని దుస్థితి. దీంతో గ్రామాల్లో విషజ్వరాలు ప్రబలుతున్నాయి. మలేరియా, డెంగీ వంటి వ్యాధుల బారిన పడి ఇబ్బందులు పడుతున్నరు. సొంత జేబు నుంచి డబ్బులు ఖర్చు చేయలేక, ఆ ఆర్థిక భారాన్ని మోయలేక పంచాయతీ కార్యదర్శులు మూకుమ్మడిగా సెలవులు పెట్టే దుస్థితి దాపురించింది.
ఒక్క ఉద్యోగులు, పారిశుద్ద్య కార్మికులకే కాదు.. పదవీ కాలం గడిచి నాలుగు నెలలైనా సర్పంచులు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలకు సైతం 8 నెలల గౌరవ వేతనాలు చెల్లించని పరిస్థితి ఏర్పడింది. ప్రతి నెలా 1వ తేదీనే జీతాలు చెల్లిస్తామని గొప్పలు చెప్పుకున్న కాంగ్రెస్ ప్రభుత్వం ఆచరణలో మాత్రం అందుకు పూర్తి భిన్నంగా వ్యవహరిస్తున్నది. మాజీ సర్పంచులు గవర్నర్ ను కలిసి తమ పెండింగ్ బిల్లులు విడుదల చేయాలని మొర పెట్టుకునే పరిస్థితి కాంగ్రెస్ పాలనలో వచ్చింది.
ఇప్పటికైనా కళ్లు తెరిచి 15వ ఆర్థిక సంఘం కేటాయించిన నిధులను వెంటనే పంచాయతీలకు విడుదల చేయాలని, పాడై పోతున్న గ్రామ పంచాయతీ వ్యవస్థను తిరిగి గాడిన పెట్టేందుకు కృషి చేయాలని బీఆర్ఎస్ పార్టీ పక్షాన కోరుతున్నాం. అక్టోబర్ లో రాష్ట్రానికి హక్కుగా రావాల్సిన 15వ ఆర్థిక సంఘానికి సంబంధించిన రెండో విడత నిధులను సాధించేందుకు తగిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాం.
జాతీయ ఉపాధి హామీ పథకం తామే తెచ్చామని గొప్పలు చెప్పుకునే కాంగ్రెస్ పార్టీ, తెలంగాణ రాష్ట్రంలో పథకం అమలు చేయడంలో తీవ్ర అలసత్వాన్ని ప్రదర్శిస్తుండటం శోచనీయం. ఈ ఆర్థిక సంవత్సరానికి గాను రూ. 1200 కోట్లను కేంద్ర ప్రభుత్వం విడుదల చేసినప్పటికీ, రాష్ట్ర ప్రభుత్వం మెటిరీయల్ కాంపోనెంట్ కు సంబంధించిన 25శాతం నిధులను విడుదల చేయకుండా చోద్యం చూస్తుండటం రాష్ట్రానికి శాపంగా మారింది.
ప్రభుత్వ పట్టింపులేని తనం వల్ల ఎంతో మంది ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ పథకానికి సంబంధించి సెప్టెంబర్ 30లోపు యుటిలైజేషన్ సర్టిఫికేట్ ను కేంద్రానికి అందించని నేపథ్యంలో రెండో విడుదల నిధులు కూడా విడుదల కాని పరిస్థితి నెలకొంటుంది. ఇది తెలంగాణ ప్రయోజనాలను మరింత దెబ్బతీస్తుంది.
దసరా, దీపావళి పండుగలు సమీపిస్తున్నా నిధులు విడుదల చేయక అనేక మంది వెతలు పడుతున్నారు. వారి వెతలు అర్థం చేసుకొని తక్షణం నిధులు విడుదల చేయాలని బిఆర్ఎస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తున్నాం.
ఇట్లు
టి హరీశ్ రావు
సిద్దిపేట శాసనసభ్యులు