చెన్నై: భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్)కి చెందిన వెనుకబడిన కులాల ప్రముఖులు 40మంది బీసీల సంక్షేమం,సమున్నతికి తమిళనాడులో చేపట్టిన చర్యలు, అమలవుతున్న పథకాలు, కార్యక్రమాల గురించి అధ్యయనానికి చెన్నైలో పర్యటిస్తున్నారు.
బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ డిప్యూటీ లీడర్ వద్దిరాజు రవిచంద్ర, శాసనమండలి డిప్యూటీ ఛైర్మన్ డాక్టర్ బండా ప్రకాష్ ముదిరాజ్, మాజీ ఛైర్మన్ స్వామిగౌడ్,మండలిలో బీఆర్ఎస్ పక్ష నాయకులు సిరికొండ మధుసూదనాచారి, మాజీ మంత్రులు గంగుల కమలాకర్,జోగు రామన్న,వీ.శ్రీనివాస్ గౌడ్ తదితర ప్రముఖులతో కూడిన ఈ ప్రతినిధి బృందం సంబంధిత అధికారులతో సమావేశమై చర్చించారు.
తమిళనాడులో డీఎంకే ప్రభుత్వం వెనుకబడిన కులాల సంక్షేమం, సముద్ధరణకు ప్రవేశపెట్టి విజయవంతంగా అమలు చేస్తున్న పథకాలు,కార్యక్రమాల గురించి ఆ రాష్ట్ర బీసీ, ఏంబీసీ సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి విజయ్ రాజా కుమార్,కమిషనర్ వెంకటేష్ తదితర ఉన్నతాధికారులు బీఆర్ఎస్ ప్రతినిధి బృందానికి సోదాహరణంగా వివరించారు.ఈ సందర్భంగా బీఆర్ఎస్ నాయకులు ఆ అధికారులను శాలువాలతో సత్కరించి జ్ఞాపికలు అందజేశారు.
ఈ సమావేశంలో బీఆర్ఎస్ నాయకులు డాక్టర్ దాసోజు శ్రవణ్ కుమార్, డాక్టర్ చెరుకు సుధాకర్,మాజీ ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్, ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్, మాజీ ఎమ్మెల్యేలు దాస్యం వినయ్ భాస్కర్, కోరుకంటి చందర్, పుట్టా మధుకర్, జల వనరుల అభివృద్ధి సంస్థ మాజీ ఛైర్మన్ వీ.ప్రకాష్, సాహిత్య అకాడమీ మాజీ ఛైర్మన్ జూలూరు గౌరీశంకర్,గడ్డి అన్నారం వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ ఛైర్మన్ సర్థార్ పుటం పురుషోత్తమ రావు, బీసీ కమిషన్ మాజీ సభ్యులు ఆంజనేయులు గౌడ్, శుభప్రద పటేల్, కిశోర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.