Suryaa.co.in

Andhra Pradesh

టిడ్కో ఇళ్లపై ప్రశ్నించినందుకు దోపిడీ చేయించిన భీమవరం మాజీ ఎమ్మెల్యే

• లోకేష్ తో ఫోటో దిగినందుకు డబ్బులు ఎగ్గొట్టి తప్పుడు కేసులు బనాయింపు
• ఎన్టీఆర్ విగ్రహం వద్ద కేక్ కట్ చేసినందుకు.. విడదల రజినీకి ఈర్ష్య
• విద్యార్థులపై తప్పుడు కేసులు పెట్టించి కక్షతీర్చుకున్న వైనం
• ఎన్నికల్లో టీడీపీకి అనుకూలంగా పనిచేసినందుకు నర్సరీలో కలుపుమందు కొట్టిన వైసీపీ నేతలు
• పెళ్లికి ఒప్పుకోలేదని చంపేశారు.. విచారణ చేయని పోలీసులు.. బాధితులు గ్రీవెన్స్ లో ఫిర్యాదు

మంగళగిరి: టిడ్కో ఇళ్లపై గతంలో అప్పటి ఎమ్మెల్యే గ్రంధిశ్రీనివాస్ ను ప్రశ్నించినందుకు తన ఆఫీసు, ఇంటిపైకి దొంగలను పంపి లూఠీచేయించారని.. దీనిపై విచారణ జరిపి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని భీమవరంకు చెందిన విలేకరి షేక్ ఆలీ ఉషేన్ మంగళవారం మంగళగిరి తెలుగుదేశం పార్టీ(టీడీపీ) కేంద్ర కార్యాలయంలో జరిగిన గ్రీవెన్స్ లో నేతలకు విజ్ఞప్తి చేశారు. అర్జీ స్వీకరించిన మంత్రి సవిత, ఎన్టీఆర్ టీడీపీ జిల్లా అధ్యక్షులు నెట్టెం రఘురామ్, జెడ్.శివప్రసాద్ లు అర్జీని స్వీకరించి విచారణకు ఆదేశించారు. అలాగే వచ్చిన అర్జీదారుల నుండి వినతులు స్వీకరించి పరిష్కారానికి కృషి చేశారు.

ధర్మవరానికి చెందిన రంగం ఆంజనేయులు విజ్ఞప్త చేస్తూ.. తాను లోకేష్ తో ఫోటో దిగినాని చెప్పి పట్టు చీరలు ఇచ్చినందుకు తనకు రావాల్సిన డబ్బులు ఇవ్వకుండా అప్పటి ఎమ్మెల్యే, ప్రస్తుత మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి ప్రోద్భలంతో వారి అనుచరులు తనను కొట్టి ఇబ్బంది పెట్టారని.. అక్రమ కేసులతో వేధించారని.. వారి నుండి డబ్బులు ఇప్పించి తనపై అక్రమ కేసులు తొలగించి న్యాయం చేయాలని వేడుకున్నారు. అలాగే తన వద్ద పట్టు చీరలు కొనుగోలు చేసిన కందికుంట గాయత్రీ డబ్బులు అడుగుతుంటే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి మనుషులతో బెదిరిస్తున్నారని దాదాపు ఆమె నుండి రూ. 78 లక్షలు రావాలని తన డబ్బులు ఇప్పించి ఆదుకోవాలని కోరారు.

కొత్త సంవత్సరం వేడుకల్లో ఎన్టీఆర్ విగ్రహం వద్ద కేక్ కట్ చేస్తుండగా ప్రస్తుత మాజీ మంత్రి విడదల రజని అప్పుడు ఈర్ష్యతో తమపై అక్రమకేసులు పెట్టిందని.. 60 మందిని పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్లి 30 మందిపై తప్పుడు కేసులు బనాయించారని.. తామంతా విద్యార్థులమని తమపై ఉన్న కేసు వలన చదువులకు ఇబ్బందిగా మారిందని దయచేసి తప్పడు కేసులు తొలగించాలని గుంటూరుకు చెందిన బాధిత విద్యార్థులు వాపోయారు.

నంద్యాల జిల్లా నందికొట్కూరు మండలం సదురు గ్రామానికి చెందిన ఎన్. అబ్దుల్ ఖాదర్ విజ్ఞప్తి చేస్తూ.. తమ భూమిని కొందరు ఆక్రమించుకుని నకిలీ పత్రాలు సృష్టించి రిజిస్ట్రర్ చేయించుకున్నారని.. కబ్జాకోరుల దొంగ రిజిస్ట్రర్ ను రద్దు చేసి న్యాయం చేయాలని ఖాదర్ విజ్ఞప్తి చేశారు.

తన కుమారుడు పెళ్లికి ఒప్పుకోలేదని.. అయ్యంకి గ్రామానికి చెందిన పత్తిపాటి పద్మ పగబట్టిందని.. తన కొడుకును ఉరివేసి చంపారని.. పోస్టుమార్టం చేసి 84 రోజులు అయినా ఎటువంటి రిపోర్టు ఇవ్వకపోగా.. ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని.. తన కొడుకు మృతిపై విచారించి తనకు తగు న్యాయం చేయాలని కృష్ణా జిల్లా మొవ్వ మండలం అయ్యంకి గ్రామానికి చెందిన రాజులపాటి సుందరమ్మ విజ్ఞప్తి చేశారు.

కోనసీమ జిల్లా రావులపాలెం మండలం ఊబలంక, రావులపాలెం గ్రామాల ప్రజలు అర్జీ ఇస్తూ.. ఉబలంక గ్రామ ఇసుక ర్యాంప్ నుండి ఊబలంక – రావులపాలెం మెయిన్ రోడ్డు గుండా ఇసుకను తరలించడంతో వాడపల్లి ఆలయానికి వచ్చే భక్తులకు అలాగే ర్యాలిలోని జగన్మోహిని కేశవ స్వామి దర్శనానికి వచ్చే భక్తులకు ఇబ్బందిగా ఉందని.. రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని.. అలాగే గ్రామ ప్రజలు కూడా ఇబ్బంది పడుతున్నారని.. లారీల తరలింపునకు ఇతర మార్గం చూడాలని ఆ గ్రామాల ప్రజలు వేడుకున్నారు.

కాపు కార్పొరేషన్ విదేశీ విద్యా దీవెన బాధితులు తమ ఆవేదనను వ్యక్తం చేస్తూ.. గత టీడీపీ ప్రభుత్వం చివర్లో జరిగిన వెరిఫికేషన్ కు సంబంధించి ఇప్పటివరకు డబ్బులు జమకాలేదని.. 1100 మంది బాధితులు ఉన్నారని.. కోర్టుకు వెళితే 10 మందికి అమౌంట్ ఇచ్చారని పెండింగ్ లో ఉన్న రూ. 93 కోట్లు రిలీజ్ చేసి మిగిలిన వారిని ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు.

పల్నాడు జిల్లా ఎడ్లపాడు మండలం కొండవీడు గ్రామానికి చెందిన పలువురు దళిత రైతులు విజ్ఞప్తి చేస్తూ.. తమ పూర్వికుల నుండి సాగుచేసుకుంటున్న భూమికి పాసుపుస్తకాలు ఇవ్వాలని గత ప్రభుత్వంలో ఎన్నోసార్లు అర్జీలు పెట్టుకున్నా పట్టించుకోకపోగా.. వైసీపీ నేతలు తమ భూములను కొట్టేసేందుకు యత్నించారని.. వైసీపీ నేతల వలన అనేక ఇబ్బందులు పడ్డామని.. బాధితులు గ్రీవెన్స్ లో విజ్ఞప్తి చేశారు.

2019 ఎన్నికల్లో వైసీపీకి వ్యతిరేకంగా పనిచేశానన్న కక్షతో తన నర్సరీలో కలుపు మంది చల్లి 20 లక్షల వరకు నష్టం వాటిల్లేలా చేశారని.. దానికి కారకులైన వారిని శిక్షించి వైసీపీ నేతల వలన నష్టపోయిన తనకు న్యాయం చేయాలని ఏలూరు జిల్లా కుక్కునూరు మండలం దామరచర్ల గ్రామానికి చెందిన వెల్లంకి సురేష్ గ్రీవెన్స్ లో విజ్ఞప్తి చేశారు.

గత ప్రభుత్వం చేపట్టిన రీ సర్వేవలన సంబంధం లేని వ్యక్తులకు తమ భూములు ఎక్కించారని.. దాన్ని సరిచేయాలని పలువురు అభ్యర్థించగా.. పండ్ల వ్యాపారం చేసుకుంటూ.. చంద్రబాబు పుంగనూరుకు వస్తున్నప్పుడు ఆయనకోసం ఎదురుచూస్తున్న తనపై అక్రమ కేసులు పెట్టి జైలుకు పంపడంతో తాను పూర్తిగా ఆర్థికంగా నష్టపోయానని తనకు ఆర్థిక సాయం అందించి ఆదుకోవాలని సదుం గ్రామానికి చెందిన ఎస్‌. మస్తాన్‌ విజ్ఞప్తి చేశారు. ఆదికవి నన్నయ్య యూనివర్శిటీలో 2006 నుండి అవుట్ సోర్సింగ్ లో పనిచేస్తున్న బోధనేతర సిబ్బందని యూనివర్సిటీ ఉద్యోగులగా లేదా.. కాంట్రాక్టు ఉద్యోగాలు మార్చాలని పలువురు సిబ్బంది విజ్ఞప్తి చేశారు.

LEAVE A RESPONSE