-
‘ తిరుమల కొండ’పై బడాబాబుల గెస్ట్‌హౌస్‌లపై కన్నేదీ?
-
దాతలో ఆ వీవీఐపి దాతలు వేరా?
-
మామూలు దాతలకు ఏడాదికి 30 రోజులే రూముల కేటాయింపు
-
కానీ ఆ 15 మంది వీవీఐపీలకు ఏడాది పొడవునా రూములు
-
అసలు వాటిపై అజమాయిషీ లేని టీటీడీ
-
ఫైవ్‌స్టార్ వసతులతో బడాబాబుల పెంట్‌హౌసుల నిర్మాణాలు
-
వాటిని ఎవరికి ఇవ్వాలన్న నిర్ణయం బడాబాబులదే
-
ఆ గెస్ట్‌హౌస్ లోని మిగిలిన గదులపైనా వారిదే అజమాయిషీ
-
వాటికి డబ్బు చెల్లింపులు మాత్రం టీటీడీకే
-
పైన నిర్మించిన పెంట్‌హౌస్‌లపై అజమాయిషీ లేని టీటీడీ
-
వీవీఐల విడిది ఆ గెస్ట్‌హౌస్‌లలోనే
-
వాటి నిర్వహణకు ఓ మేనేజర్ నియామకం
-
బడాబాబులకే పెత్తనం ఇస్తూ బోర్డులో నాటి చైర్మన్ల తీర్మానం
-
కూటమి వచ్చిన తర్వాత కూడా కొనసాగుతున్న వైచిత్రి
-
వాటిని స్వాధీనం చేసుకునే ధైర్యం టీటీడీకి లేదా?
-
ఇంకా ధర్మారెడ్డి పాలిసీలే అమలుచేస్తారా?
( మార్తి సుబ్రహ్మణ్యం)
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత.. జగన్ సర్కారు తీసుకున్న అనేక అడ్డగోలు నిర్ణయాలను రద్దు చేసింది. మరికొన్నింటిని సమీక్షిస్తోంది. వివిధ శాఖల్లో ప్రక్షాళనపై దృష్టి పెట్టింది. కానీ టీటీడీలో కొండపై జరుగుతున్న బడాబాబుల పెత్తనానికి మాత్రం తెరదించలేకపోతోంది. ఈఓ, ఏఈఓ ఇద్దరూ అసలు ఆ గెస్టుహౌసులు మావి కాదు. వాటితో టీటీడీకి సంబంధం లేదన్నట్లు లైట్ తీసుకోవడమే ఆశ్చర్యం. ప్రభుత్వం ‘‘ కూటమి ఇది మంచి ప్రభుత్వం అంటుండగా లేనిది.. మేం మాత్రం ‘మంచి టీటీడీ’ అనిపించుకోలేమా ఏంటి’’ అన్నట్లుంది ఈఓ, ఏఈఓల పనితనం. ఇంతకూ కొండపై ఆ బడాబాబుల గెస్టుహౌసుల కథేమిటో చూద్దాం రండి.
వెంకటేశ్వరుడి స్మరణతో ప్రతిధ్వనించే ఏడుకొండలన్నీ వెంకన్నవే . అక్కడ ఇతరుల నామస్మరణ నిషేధం. ప్రైవేటు వ్యక్తులకు ఎలాంటి పెత్తనం ఉండదు. సర్వం శ్రీవెంకటేశ్వరుడిదే. అలాంటిది ఒక 15 మంది బడాబాబులకు కాటేజీఓల్లోని ఒక ఫ్లోర్‌ను గెస్ట్‌హౌస్‌గా నిర్మించుకునేందుకు నాటి జగన్ సర్కారు అనుమతించిన వైనంపై కూటమి సర్కారు కూడా దిద్దుబాటకు దిగకపోవడం వెంకన్న భక్తుల విమర్శలకు దారితీస్తోంది.
పాత కాటేజీలు కూల్చి, వాటిని సామాన్య భక్తుల కోసం కాకుండా, వాటి స్థానంలో ఖరీదైన గెస్టుహౌస్, మరికొన్ని రూముల నిర్మాణాలకు ధర్మారెడ్డి దొడ్డమనసుతో అంగీకరించారు. సుబ్బారెడ్డి, కరుణాకర్‌రెడ్డి కూడా అంతే దొడ్డమనసుతో, టీటీడీ బోర్డులో ఆమేరకు వెసులుబాటు కల్పించారు. మంచిదే. భక్తుల సౌకర్యార్ధం పెద్ద మనసుతో బడాబాబులు, కాటేజీలు నిర్మించడం మెచ్చదగిందే. కానీ.. ఆ కాటేజీల్లో ఒక ఫ్లోర్ మొత్తం గెస్ట్‌హౌస్‌గా మార్చి, వాటిని సదరు బాబుల ఇష్టానికి ధారాదత్తం చేసి, వాటిపై టీటీడీ తన అజమాయిషీ వదులుకోవడమే వివాదానికి కారణమవుతోంది.
జగన్ సీఎం అయిన తర్వాత తిరుమలపై 15 ప్రైవేట్ గెస్ట్‌హౌస్‌ల నిర్మాణానికి జగన్ సర్కారులోని టీటీడీ పాలకమండలి ప్రత్యేక అనుమతి ఇచ్చింది. అందులో కొన్ని కాటేజీలను సీఎం జగన్, చినజీయర్‌స్వామి ప్రారంభించారు. ఆ కాటేజీలో నిర్మించిన గెస్ట్‌హౌస్ సహా, మిగిలిన ఫ్లోర్లలో గదుల నిర్మాణాలకు బడాబాబుల నుంచి టీటీడీ విరాళాలు తీసుకుంది. ఆ ప్రకారం ఒక గెస్ట్‌హౌస్, కింద గదుల నిర్మాణానికి 40 కోట్లు ఖర్చయాయ్యన్న ప్రచారం, అప్పటి చైర్మన్లకు తాంబూలం కింద కొంత సమర్పించుకున్నారన్న ఆరోపణలు కూడా అప్పట్లో వినిపించిన విషయం తెలిసిందే. ఇప్పటికీ ఆ ఖర్చు ఎంతన్నదానిపై స్పష్టత లేదు. సరే.. ఒక ఫ్లోర్‌లో గెస్ట్‌హౌస్, మిగిలినవి భక్తుల కోసం గదులు నిర్మించారు కాబట్టి, ఇంతవరకూ దానిపై ఎవరికీ అభ్యంతరం ఉండదు.
కానీ 15 గెస్ట్‌హౌస్‌లలో ఒక ఫ్లోర్ మొత్తాన్ని, అది నిర్మించిన బడాబాబులకే అధీనం చేయడమే భక్తుల్లో అభ్యంతరానికి కారణమవుతోంది. ఫైవ్‌స్టార్ హోటల్ వసతులను మరిపించే రీతిలో నిర్మించిన ఆ గెస్ట్‌హౌస్‌ను చూస్తే కళ్లు చెదరక తప్పదు. ఆ మేరకు వాటి నిర్వహణకు ప్రత్యేకంగా మేనేజర్‌ను కూడా నియమించుకున్నారు. అయితే బడాబాబులు గెస్ట్‌హౌస్‌లు నిర్మించుకుంటే మీకేంటి అభ్యంతరం? అన్న ప్రశ్న రావడం సహజం. అక్కడికే వద్దాం.
తిరుమలలో కాటేజీలు నిర్మించిన దాతలకు ప్రతి ఏటా 30 సార్లు రూములు కేటాయిస్తారు. వారు స్వయంగా వచ్చినా, లేక వారు ఎవరినైనా సిఫార్సు చేసినా అందులో ఒక రూము కేటాయిస్తారు. ఈ సంప్రదాయం అనేక దశాబ్దాల నుంచీ కొనసాగుతున్నదే. ఆ ప్రకారంగా దేశంలోని ప్రముఖ పారిశ్రామికవేత్తలు, సినిమా స్టార్లు, రాజకీయ నాయకులు కాటేజీలు నిర్మించారు. ఈ కాటేజీల నిర్మాణాలకు అయ్యే బడ్జెట్‌ను.. టీటీడీ ఇంజనీరింగ్ విభాగం ఎస్టిమేట్ వేసి ఇస్తే, ఆ నిధులను దాతలు టీటీడీకి చెల్లిస్తారన్నమాట.
తిరుమల వెంకన్న చెంత తమ పేరిట ఒక అతిథి గృహం ఉండటాన్ని, పెద్దలు ప్రతిష్ఠగా భావిస్తుంటారు. సరే..అక్కడ కాటేజీ నిర్మాణాలకు పలుకుబడి, సిఫార్సులు మామూలే. ఎవరినంటే వారిని కాటేజీల నిర్మాణాలకు అనుమతించరు. దానికో లెక్కుంటుంది. ఆ వ్యవహారం వేరే. ఇప్పుడు ఆ ధార్మిక భావన స్థానంలో వ్యాపార ధోరణి పెరిగి, అది కాటేజీల్లో ఫైవ్‌స్టార్ హోటల్ సౌకర్యాలను తలదన్నేలా, గెస్ట్‌హౌస్ నిర్మించుకునే దిశగా సాగుతుండటం భక్తులకు ఆందోళన కలిగిస్తోంది.
ఇప్పుడు బడాబాబులు నిర్మించిన 15 కాటేజీల్లోని గెస్ట్‌హౌస్‌లోని ప్రతి ఒక్క ఫ్లోర్‌ను, సదరు బడాబాబులు తమ అభిరుచి మేరకు నిర్మించుకున్నవే. మామూలుగా అయితే వాటి నిర్మాణం పూర్తయిన తర్వాత, అన్ని గదులనూ టీటీడీకి స్వాధీనం చేయడం ఆనవాయితీ. అది వారి విధి కూడా. అసలు సూటిగా చెప్పాలంటే.. వాటి నిర్మాణాలపై దాతలకు ఎలాంటి పెత్తనం ఉండకూడదు. ఆ ప్రకారంగానే గతంలో కాటేజీల నిర్మాణం జరిగింది.
కానీ 15 మంది బడాబాబులు నిర్మించుకున్న కాటేజీల్లోని గెస్ట్‌హౌస్‌లపై, టీడీడీ అజమాయిషీ ఇసుమంతయినా ఉండదు. సాధారణంగా కాటేజీ నిర్మించన దాతలకు, ఏడాదికి 30 సార్లు మాత్రమే రూములు కేటాయిస్తున్నారు. కానీ ఈ 15 మందికి మాత్రం ఆ నిబంధనల సవరించి, ఏడాది పొడవునా వారు తీసుకున్న ఫ్లోర్‌లో తమకు నచ్చినట్లు గెస్ట్‌హౌస్‌లు నిర్మించుకున్న బడాబాబులు.. వాటిని టీటీడీకి స్వాధీనం చేయకపోవడం విమర్శలు-వివాదాలకు కారణమవుతోంది.
అంటే సదరు బడాబాబులు.. టీటీడీతో ఏమాత్రం సంబంధం లేకుండా ఏడాది పొడవునా, తమకు నచ్చిన వారికి ఆ గెస్టుహౌస్ ఇచ్చుకోవచ్చన్నమాట. ఇది టీటీడీ నిబంధనలకు విరుద్ధం. మిగిలిన దాతలకు ఏడాదికి 30 రోజులు మాత్రమే గదులిచ్చే అవకాశం ఇచ్చి, ఈ 15 మంది బడాబాబులకు మాత్రం టీటీడీ నిబంధనలు మినహాయించి, ఏడాది పొడవునా తమకు నచ్చిన వారికి గెస్ట్‌హౌస్‌లు ఇచ్చుకునే వెసులుబాటు కల్పించడం, అటు గతంలో కాటేజీలు నిర్మించిన దాతలకూ ఆగ్రహం కలిగిస్తోంది.
నిజానికి ఈ 15 మంది బడాబాబులు ఏడాది పొడ వునా అక్కడ ఉండరు. అప్పుడప్పుడూ దర్శనానికి వచ్చినప్పుడు మాత్రమే, ఆ గెస్ట్‌హౌస్‌ను వినియోగించుకుంటారు. మిగిలిన రోజుల్లో మాత్రం.. తమ వ్యాపారాభివృద్ధికి పనులు చేసి పెట్టే బ్యూరోక్రాట్లు, రాజకీయ నాయకులు, మంత్రులు, ఇంకా ‘అన్ని వ్యవస్థలకు సంబంధించిన’ వీవీఐపీలకు ఈ గెస్ట్‌హౌస్‌లు కేటాయిస్తుంటారు. ఈ కాటేజీల్లోని గెస్ట్‌హౌస్‌లలో ఫలానా వీఐపీ దిగారంటే.. ‘సదరు కాటేజీ దాతలతో వారికి కచ్చితంగా లింకులున్నట్లే లెక్క. వారికి సదరు వీఐపీలు ఏదో ఒక రూపంలో సాయం చేస్తుంటారనే భావన’ భక్తుల్లో ఏర్పడం మంచిదికాదన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.
ఈ గెస్ట్‌హౌస్‌లో దిగిన సదరు వీఐపీలు టీటీడీకి నయాపైసా చెల్లించాల్సిన పనిలేదు. ఇక ఆ ఫ్లోర్‌లో నిర్మించిన గెస్ట్‌హౌస్‌ల నిర్వహణకు మేనేజర్లను కూడా నియమించుకున్నారు. వచ్చిన వీవీఐపీల మంచి చెడ్డలు చూడటమే వారి పని. ఇక ఆ కాటేజీలోని మిగిలిన రూములపై, పరోక్ష పెత్తనం కూడా బడాబాబులదే. వారు చెప్పిన వారికే ఆ గదులు ఇస్తుంటారని, కాకపోతే వాటి రుసుము మాత్రం టీటీడీకే చెల్లించాల్సి ఉంటుందంటున్నారు. అంటే ఇక్కడ వ్యవహారం పైకి శాస్త్రప్రకారం కనిపిస్తున్నప్పటికీ, తెరవెనుక పెత్తనం చేసేది మాత్రం బడాబాబుల ప్రతినిధి అయిన మేనేజర్ మాత్రమే.
ఒక్కముక్కలో చెప్పాలంటే.. ధర్మారెడ్డి, జవహర్‌రెడ్డి జమానాలో వెలసిన గెస్ట్‌హౌస్‌లు బడాబాబుల పనులు సులభంగా చేసిపెట్టే పైవరీ కేంద్రాలుగా మారాయన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ కాటేజీలను సీఎంలు, పీఠాధిపతులు ప్రారంభించారంటే.. వారికి ఏ స్థాయి పలుకుబడి ఉందో అర్ధమవుతూనే ఉంది. ఫైవ్‌స్టార్ హటల్‌ను తలదన్నే సౌకర్యాలున్న ఈ గెస్ట్‌హౌస్‌లకు ప్రధాని, ముఖ్యమంత్రి, కేంద్రమంత్రులు కూడా విడిది చేస్తున్నారంటే.. బడాబాబుల పలుకుబడి ఎంత ఎత్తు పెరుగుతుంది? దాని వల్ల వారి కంపెనీలకు ఎంత లాభమని చెప్పడానికి మేధావులే కానక్కర్లేదు. ఈ విధానానికి తెరదించకపోతే.. క్విడ్ ప్రో కో ఆరోపణలు కూడా వచ్చేందుకు అవకాశం ఉందని భక్తులు హెచ్చరిస్తున్నారు.
జగన్ సర్కారులో వైవి సుబ్బారెడ్డి, కరుణాకర్‌రెడ్డి ఆధ్వర్యంలో.. టీటీడీ బోర్డు నిబంధనల్లో తీసుకువచ్చిన ఈ వెసులుబాటు, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా కొనసాగించడమే ఆశ్చర్యం. కొత్తగా నిర్మించిన 15 కొత్త కాటేజీలలో.. ఒక్కో ఫ్లోర్‌లో నిర్మించిన ప్రతి ఒక్క గెస్ట్‌హౌస్‌ను టీటీడీ స్వాధీనం చేసుకుని, వాటిని తన అవసరాలకు వాడుకోవాలన్న డిమాండ్ భక్తుల నుంచి వినిపిస్తోంది. అప్పుడు కావాలంటే ఆ గెస్టుహౌసులు పద్మావతి గెస్ట్‌హౌస్‌కు బదులు.. పీఎం, సీఎం, కేంద్రమంత్రులు, రాష్ట్రపతి వంటి వీవీఐపీలకు కేటాయించవచ్చన్నది భక్తుల వాదన. అప్పుడు ప్రైవేట్ వ్యక్తులు, తమ గెస్టుహౌసులిచ్చి, ప్రభుత్వ పెద్దలను ప్రభావితం చేసే అవకాశం ఉండదన్నది వారి అభిప్రాయం.
అంబానీకీ ఏడాదికి 30 రోజులే
తిరుమలలో కొద్దికాలం క్రితం కృష్ణభవనం గెస్ట్‌హౌస్ అంటే వీవీఐపీలకు క్రేజు. ఎందుకంటే అది పారిశ్రామిక దిగ్గజం ముకేష్ అంబానీది కాబట్టి. ఆ గెస్టుహౌస్‌లో సకల సదుపాయాలుంటాయి. ప్రధాని, రాప్ట్రపతి వంటి వీవీఐపీలు వస్తే అక్కడే విడిది. అంతకుముందు వీఐపీలు పద్మావతి గెస్ట్‌హౌస్‌లో బసచేసేవారు. అంబానీ కాటేజీ నిర్మించిన తర్వాత అందరూ ఆయన కృష్ణభవనంలో బసచేసేవారు. అలాంటి ముకేష్ అంబానీ వంటి బడా పారిశ్రామికవేత్తకు సైతం ఏడాదికి 30 రోజులే అవకాశం కల్పించారు. మరి ఈ 15 మంది బడా బాబులకు ఏడాదిపొడవునా అవకాశం కల్పించి, ఆ గెస్టుహౌస్‌లపై టీటీడీ పెత్తనం లేకపోవడమేమిటన్న ప్రశ్నలు తలెత్తడం సహజం.
ఆ గెస్ట్‌హౌస్‌లు స్వాధీనం చేసుకోవాల్సిందే: ఓ.వి.రమణ
‘కూటమి ప్రభుత్వం వచ్చాక ఈ విధానం తొలగించి, ఆ 15 ప్రైవేట్ గెస్ట్‌హౌస్‌లను టీటీడీ స్వాధీనం చేసుకుంటుందని భక్తులు ఆశించారు. అయితే ఇంకా బోర్డు వేయలేదు కాబట్టి, కొత్త బోర్డు వచ్చిన తర్వాత, వాటిని స్వాధీనం చేసుకుంటుందని భావిస్తున్నాం. అసలు పాత కాటేజీలను కూలగొట్టి కొత్తగా నిర్మించిన నిర్మాణాలవి. ఆ ప్రకారంగా 15 గెస్ట్‌హౌసులు నిర్మించారంటే ఒక్కో ఫ్లోర్‌లో నాలుగు గదులు సామాన్య భక్తులు కోల్పోయిట్లే కదా? అంటే 60 గదులు సామాన్య భక్తులు నష్టపోతున్నట్లు లెక్క. నిజానికి అవి సామాన్య భక్తుల కోసం నిర్మించాల్సిన కాటేజీలు. మేం పాలకమండలిలో పనిచేసినప్పుడు, ఒక్కో కాటేజీ నిర్మించిన దాతలకు ఏడాదికి 30 సార్లు మాత్రమే గదులిచ్చేవాళ్లం. కానీ ఇప్పుడు 15 మంది పారిశ్రామికవేత్తలు నిర్మించిన ఆ కొత్త కాటేజీల్లో, వారు ఒక ఫ్లోర్‌లో నిర్మించుకున్న గెస్ట్‌హౌస్‌లపై టీటీడీ అజమాయిషీ లేకుండా చేయడం దారుణం. తిరుమలలో ప్రైవేటు వ్యక్తులకు ఒక గజం భూమి కూడా ఉండటానికి వీల్లేదు. అంతా స్వామిదే. మరి కరుణాకర్‌రెడ్డి, సుబ్బారెడ్డి, ధర్మారెడ్డి ఈ కొత్త విధానాన్ని ఎలా తీసుకువచ్చారో తెలియదు. ఒకవేళ ఆ గెస్ట్‌హౌసులను స్వాధీనం చేసుకోవాలనుకుంటే ఈఓ నిర్ణయం తీసుకోవచ్చ’’ని టీటీడీ మాజీ సభ్యుడు, టీడీపీ సీనియర్ నేత, బలిజనాడు కన్వీనర్ డాక్టర్ ఓ.వి.రమణ వ్యాఖ్యానించారు.