– నెహ్రూ నిర్ణయాలతోనే ప్రపంచ స్థాయికి భారతదేశం
– సంక్షేమ పథకాలు పెంచేందుకే సమగ్ర కుటుంబ సర్వే
– ప్రభుత్వాన్ని కూల్చడం పైనే బీఆర్ఎస్ దృష్టి
– ప్రజలకు మంచి చేయడమే ప్రభుత్వ వైఫల్యమా?
– నెహ్రూ జయంతి వేడుకల్లో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు
హైదరాబాద్ : తొలి ప్రధాని నెహ్రూ నిర్ణయాలతోనే భారతదేశ ప్రపంచ స్థాయిలో నిలిచిందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు అన్నారు. గురువారం ఆయన గాంధీభవన్లో చాచా నెహ్రూ జయంతి వేడుకల్లో పాల్గొన్న సందర్భంగా మీడియాతో మాట్లాడారు. నెహ్రూ గురించి తెలియని కుహనా మేధావులు కొందరు అక్కడక్కడ తప్పుడు ప్రచారం చేస్తున్నారని అన్నారు.
భారతదేశ చరిత్ర, స్వాతంత్ర సంగ్రామం గురించి తెలుసుకుంటే నెహ్రూ గారి పాత్ర ఏంటో అర్థం అవుతుంది అన్నారు. ఉన్నత కుటుంబంలో పుట్టిన నెహ్రూ దశాబ్ద కాలం పైబడి ఈ దేశం కోసం జైల్లో మగ్గిన మహానుభావుడని కీర్తించారు. నెహ్రూ ఈ దేశపు తొలి ప్రధాని కావడం మన అందరి అదృష్టం అన్నారు. ఈ దేశంలో అనేక సైన్స్ అండ్ టెక్నాలజీ సెంటర్లు పెద్ద ఎత్తున నెలకొల్పుడంతోనే ఈ దేశం అభివృద్ధి జరుగుతుంది అన్నారు. చంద్రమండలం, మార్స్ పైకి రకరకాల సాటిలైట్స్ పంపి సమాచార వ్యవస్థలో పోటీకి కారణం నాటి నెహ్రూ నిర్ణయాలే అని అన్నారు.
విద్యా విధానం, వ్యవసాయం, పారిశ్రామిక రంగాలు ప్రభుత్వ రంగంలోనే ఉండాలన్న ఆయన నిర్ణయం, ఆలోచనల ఫలితంగానే మన దేశం నేడు బతుకుతుంది అన్నారు. సైంటిఫిక్ అవగాహన లేని మూఢవిశ్వాసాలతో బతికే మోడీ వంటి వారు మొదట ప్రధానిగా ఉంటే ఈ దేశం మూఢవిశ్వాసాలతో ఎక్కడో వెనుకబడి ఉండేది అన్నారు. నెహ్రూ వేసిన పునాదుల ఫలాలు నేడు మనమందరం అనుభవిస్తున్నాం అన్నారు.
కేటీఆర్ గురించి మాట్లాడాలంటే చాలా మాట్లాడవచ్చు. ప్రభుత్వ వైఫల్యం ఏంటో కేటీఆర్ చెప్పాలి అన్నారు. నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వడమే ప్రభుత్వ వైఫల్యమా? ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ పెట్టడం ప్రభుత్వ వైఫల్యమా? రైతు రుణమాఫీ చేయడం ప్రభుత్వ వైఫల్యమా?
ప్రజలకు మంచి చేయడం ప్రభుత్వ వైఫల్యమా? అని ప్రశ్నించారు. మీరు అధికారం కోల్పోయి నప్పుడల్లా అమాయక ప్రజలను రెచ్చగొడుతున్నారు,
ఫార్మా క్లస్టర్స్ విస్తరించే పనిని వ్యతిరేకించడం బుద్ధి తక్కువ పని అన్నారు. మేం కక్షపూరిత రాజకీయాలకు వ్యతిరేకం అన్నారు.
బీఆర్ఎస్ ప్రతిపక్షంగా తన పాత్ర పోషించిందా? ఉన్న ప్రభుత్వాన్ని కూల్చడంపైనే బీఆర్ఎస్ దృష్టి పెట్టింది అన్నారు. స్కీములు పెరగాడానికే సమగ్ర కుటుంబ సర్వే చేస్తున్నాం, కుల గణన చేస్తామని మాట ఇచ్చాం, ఇచ్చిన మాటను ఆచరించి చూపిస్తున్నాం అన్నారు. రాష్ట్ర అభివృద్ధికి కుల గణన ఎంతగానో ఉపయోగపడుతుంది, దేశానికి తెలంగాణ రోల్ మోడల్ కాబోతుంది, అన్ని అంశాలను దృష్టిలో పెట్టుకొనే ప్రశ్నలు తయారు చేశాం, కుల గణన ఒక విప్లవాత్మక నిర్ణయం అన్నారు.