– ఎక్కువ ధరకు పీపీఏ చేసుకుంటే అవినీతా?
– తక్కువ ధరకు పీపీఏ చేసుకుంటే అవినీతా?
– రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం కేంద్ర ప్రభుత్వ ‘సెకీ’తో
– యూనిట్ రూ.2.49 కే కొనేలా సెకీతో ఒప్పందం
– అదే సెకీతో యూనిట్ రూ.4.50కి కొనేలా చంద్రబాబు ఒప్పందం
– అది కూడా 2016లో చేసుకున్న ఒప్పందం
– చంద్రబాబు పీపీఏల్లో గరిష్ట ధర రూ.6.99
– మరి ఎవరి వల్ల రాష్ట్రానికి, ప్రజలకు మేలు జరిగింది?
– అదే చంద్రబాబు హయాంలో అయితే గొప్పంటారా
– ఏమిటీ ద్వంద్వనీతి? అవేనా విలువలు. నైతికత?
– వైయస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన పార్టీ కృష్ణా జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి పేర్ని వెంకట్రామయ్య (నాని)
తాడేపల్లి: జగన్‌ని రాజకీయంగా పతనం చేయాలన్న కుట్రతో చీకట్లో కాంగ్రెస్‌తో చేతులు కలిపిన చంద్రబాబు, రోజూ ఆయన వ్యక్తిత్వ హననానికి కుతంత్రాలు చేస్తున్నారని వైయస్సార్సీపీ కృష్ణా జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి పేర్ని వెంకట్రామయ్య (నాని) ఆక్షేపించారు.
వైయస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన పేర్ని నాని, ఇంకా ఏమన్నారంటే..
ప్యారడైజ్ పేపర్లని, అర్థరాత్రి అమెరికా పోలీసులు వచ్చి పట్టుకెళ్లి పోతారని తప్పడు ప్రచారం చేసినా.. ప్రజలు ఆయన్ను ముఖ్యమంత్రిని చేశారు. ఇప్పుడు 11 సీట్లకు పరిమితం చేసినా, 40 శాతం మంది ఓటేశారని, వారు కూడా లేకుండా చేయాలనే కుట్రతో చంద్రబాబు, ఆయన భజన మీడియా చేయని కుట్ర లేదు. రోజూ అలుపు లేకుండా ఆ రాక్షసులంతా దాడి చేస్తున్నారు. రామోజీ పోయాక, తప్పుడు వార్తలు రాసి చంద్రబాబును కాసే పాత్ర ఆయన కొడుకు తీసుకున్నాడు.
ఇదే అదానీ గ్రూప్‌పై సీఎం చంద్రబాబు, గతనెల 24న చేసిన ట్వీట్ ఇది. ‘రాష్ట్రంలో అదానీ భారీ పెట్టుబడులు. ఐటీ, పర్యాటకం, పోర్టుల రంగంలో పెట్టుబడులు పెడతారు’ అని ఈనాడులో గొప్పగా రాశారు. ఇదే అదానీ గ్రూప్ పెద్దలు జగన్ హయాంలో వచ్చి కలిస్తే ఏం రాశారు?. ‘అడ్డగోలుగా అదానీకి. బొగ్గు టెండర్లు కూడా అదానీకే’ అని రాశారు. ఇంకా ఇదే అదానీ గ్రూప్ గత మా ప్రభుత్వ హయాంలో డేటా సెంటర్ పెడుతుంటే, ఇదే ఈనాడులో ఏం రాశారు?. డేటా సెంటర్‌ను పెద్దగా ప్రస్తావించకుండా.. అదానీకి జగన్ 60 ఎకరాలు అని రాశారు.
రాష్ట్రంలో జగన్ ప్రభుత్వం ఉన్నప్పుడు, 2021, జనవరి 15న కేంద్ర విద్యుత్ శాఖ ఒక జీఓ జారీ చేసింది. సౌర, పవన (సోలార్ విండ్) విద్యుత్‌కు సంబంధించి రాష్ట్రాల మధ్య బదలాయింపు జరిగితే ట్రాన్స్మిషన్ ఛార్జీలు ఎత్తివేస్తామని అందులో పేర్కొన్నారు. ఆ తర్వాత అదే ఏడాది సెప్టెంబరులో రాష్ట్ర ప్రభుత్వానికి ‘సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్’ (ఎస్ఈసీఐ–సెకీ) ప్రతిపాదనలు పంపించింది. గ్రీన్ ఎనర్జీ కార్పొరేషన్ ద్వారా తాము యూనిట్ విద్యుత్ రూ.2.49కే సరఫరా చేస్తామని వెల్లడించింది. ఆ మేరకు ఆ తర్వాత రాష్ట్ర ప్రభుత్వం ‘సెకీ’లో ఒప్పందం చేసుకుంది.
వ్యవసాయానికి పగలే నాణ్యమైన విద్యుత్ దీర్ఘకాలం ఇచ్చేందుకు, ఏటేటా ఆ వినియోగం పెరుగుతున్న నేపథ్యంలో.. తక్కువ వ్యయంతో గ్రీన్ ఎనర్జీ ద్వారా ఆ విద్యుత్‌ను సరఫరా చేయాలని టెండర్లు పిలిస్తే, అప్పుడు టీడీపీ వారే కోర్టుకు వెళ్లి అడ్డుకున్నారు. అప్పుడు కూడా సెకీ ద్వారా యూనిట్ విద్యుత్ రూ.2.49కే కొనుగోలను తప్పుబడుతూ కథనాలు రాశారు.
మరి అదే సెకీతో చంద్రబాబు ప్రభుత్వం 2016లో విద్యుత్ కొనుగోలు ఒప్పందం చేసుకుంది. యూనిట్ విద్యుత్ రూ.4.50 చొప్పున, అది కూడా ఏకంగా 25 ఏళ్లపాటు కొనుగోలు చేసే విధంగా ఒప్పందం చేసుకుంది. అంత దీర్ఘకాలానికి ఏ ప్రభుత్వం కూడా ఒప్పందం చేసుకోదు. పైగా వాటితో పాటు, ఖర్చులు అదనం. అయినా అది తప్పనిపించలేదు.
యూనిట్ పవర్ రూ.4.50 చొప్పున, అదనపు ఖర్చులు కూడా భరిస్తూ, 25 ఏళ్లు కొనేలా చంద్రబాబు ఒప్పందం చేసుకుంటే, అది రాష్ట్ర శ్రేయస్సు కోసం. అదే విద్యుత్‌ను కేవలం రూ.2.49 చొప్పున కొనుగోలు చేసేలా, అది కూడా అదనపు ఖర్చులు భరించకుండా, జగన్ ప్రభుత్వం ఒప్పందం చేసుకుంటే.. అది దోపిడి అంటారా? అవినీతి జరిగిందంటారా?
2014–19 మధ్య చంద్రబాబు ప్రభుత్వంలో విద్యుత్ ఒప్పందాలు చూస్తే.. నాన్ రెన్యువబుల్ ఎనర్జీ. 133 ఒప్పందాలు. యూనిట్ రూ.4.84 చొప్పున. 3494 మెగావాట్లు. 25 ఏళ్లకు. సోలార్ పవర్. 36 ఒప్పందాలు. యూనిట్ రూ.6.99 చొప్పున. 1500 మెగావాట్లు. 25 ఏళ్లకు. ఇంకా అదే ఏడాది తెలంగాణ ప్రభుత్వం యూనిట్ పవర్ రూ.4.66కే ఇచ్చేలా ఒప్పందం చేసుకుంది.
విండ్ పవర్. యూనిట్ రూ.4.83కి. 3 వేల మెగావాట్లు. 25 ఏళ్లకు. దీనికి సంబంధించి కూడా అదే సమయంలో తమిళనాడు, గుజరాత్‌తో పాటు, కొన్ని రాష్ట్రాల్లో యూనిట్ పవర్ రూ.3.46కే ఇచ్చేలా, 25 ఏళ్లకు ఒప్పందాలు జరిగాయి.
మరి చంద్రబాబు ప్రభుత్వం.. ఎందుకు అధిక ధరలకు వెళ్లింది? ఆ మార్జిన్ మొత్తం ఎవరి జేబుల్లోకి వెళ్లినట్లు? దీంతో పాటు, ఏపీ 2018–19 ఈఆర్సీ టారిఫ్ ఆర్డర్.. చంద్రబాబు ప్రభుత్వం హయాంలో విండ్ పవర్ యూనిట్‌కు రూ.4.63. మొత్తం 4 వేల మెగావాట్లు. సోలార్ పవర్ యూనిట్‌కు రూ.5.90. మొత్తం 3 వేల మెగావాట్లు. ఇదంతా రాష్ట్ర ప్రభుత్వం మీద వేసిన భారం కాదా?.
జగన్ ప్రభుత్వం తక్కువ ధర యూనిట్ పవర్‌ను రూ.2.49కే కొనుగోలు చేసేలా ఒప్పందం చేసుకుంటే.. దాన్ని అభినందిస్తూ.. అంతకు ముందు చంద్రబాబు ప్రభుత్వం, ఎక్కువ ధరలకు కొనుగోలు చేస్తూ ఒప్పందం చేసుకుంటే ప్రశ్నించాలి కదా?
నిజానికి విద్యుత్ రంగాన్ని నాశనం చేసింది చంద్రబాబు. కానీ, ఈరోజు కూడా నిస్సిగ్గుగా సంపద సృష్టిస్తానని చెబుతున్నాడు. ఇప్పటికి మూడుసార్లు సీఎం అయి, ఇప్పుడు నాలుగోసారి పదవిలో ఉన్న చంద్రబాబు ఇన్నేళ్లలో సృష్టించిన సంపద ఏది? రాష్ట్ర మొత్తం అప్పు రూ.6.46 లక్షల కోట్లుంటే, జగన్ ఒక్కడే రూ.14 లక్షల కోట్లు అప్పు చేశాడని పచ్చి అబద్ధాలు చెప్పుకొచ్చారు. ఐదేళ్లలో కరెంట్ ఛార్జీలు పెంచనని ఓట్లు అడుక్కుని, ఈరోజు జగన్‌పై నింద వేస్తూ, ఆయనను సాకుగాచూపుతూ రూ.17 వేల కోట్లకు పైగా భారం మోపుతున్నారు. ఇప్పటికే రూ.6వేల కోట్ల మోత మోపారు.
పీ4 అంటే ఏమిటి? జనం మీద భారం మోపడమే సంపద సృష్టించడమా? డబ్బున్నోళ్లకి రాష్ట్రాన్ని అమ్మి పెట్టడమా?. కొత్త మెడికల్ కాలేజీలు, పోర్టులు, తమ వారికి దారాదత్తం చేయడం, ఐదు నెలల్లో రూ.50 వేల కోట్ల అప్పులు చేయడమా సంపద సృష్టి?. సంవత్సరానికి మూడు సిలిండర్లు అన్నాడు.. ఒక్క దానికి సరిగా నిధులు కేటాయించలేదు. జమిలి ఎన్నికలొస్తే ఇంకో ఏడాది కూడా ఉండవు. చంద్రబాబు పాలనలో కరెంట్ కంపెనీల నష్టాలు రూ.22,089 వేల కోట్లు. ఆ నష్టాలు రాష్ట్ర విభజన నాటికి కేవలం రూ.6 వేల కోట్లు మాత్రమే. ఇంకా చంద్రబాబు దిగిపోయే నాటికే కరెంట్ కంపెనీల అప్పులు రూ.56 వేల కోట్లు. అదే జగన్ పాలనలో ఐదేళ్లలో వాటికి సంబంధించి, రూ.395 కోట్ల నష్టాలు. రూ.36 వేల కోట్లు అప్పులు.
ఇన్ని పాపాలు మూట కట్టుకుని కూడా ఏ మాత్రం సిగ్గు పడకుండా, కళ్లార్పకుండా పచ్చి అబద్దాలు చెబుతున్నాడు. మరి ఎవరు బాగా పాలించినట్లు?. ఎవరు ఆర్థిక క్రమశిక్షణ పాటించినట్లు?.
కేంద్ర ప్రభుత్వ సంస్థ సెకీతో జగన్ ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. ఆదానీతో మాకేంటి సంబంధం?. కేంద్రం ఎవరి దగ్గర కొంటే మాకేంటి సంబంధం?. ఇదే సెకీతో చంద్రబాబు యూనిట్ పవర్ రూ.4.50కి కొంటూ ఒప్పందం చేసుకుంటే, మేము కేవలం రూ.2.49కే కొంటూ ఒప్పందం చేసుకున్నాం. మరి ఎవరు గొప్ప? వీటన్నింటికీ మీ వద్ద సమాధానం ఉందా? జగన్‌పై చేసిన ఆరోపణలు, విమర్శలు నిరూపించగలరా?. ఆ దమ్ము మీకుందా?.
జగన్ అరెస్టయిపోతాడు. అమెరికా పోలీసులు తీసుకెళ్లిపోతారని రాస్తున్నారు. అలా అరెస్ట్ చేయాల్సి వస్తే సెకీని, కేంద్రం నుంచి ఎవరు కొన్నారో వారిని తీసుకెళ్తారు. మాకేం సంబంధం?. మీకెందుకు బాధ? మేం మోదీ ప్రభుత్వం దగ్గర కొంటున్నాం. ఆయన ఎవరి నుంచి దాన్ని కొంటే మాకేంటి?. మాకు తక్కువ రేటుకు కరెంట్ కావాలి. అది మేం రైతులకు ఇవ్వాలి.
ఆర్టీసీ కూడా ఆయిల్‌ను ఐఓసీ, బీపీసీఎల్ దగ్గర కొంటుంది. ఆ కంపెనీలు ఎక్కణ్నుంచి ఆయిల్ తెస్తే.. ఆర్టీసీకి ఏంటి?. ఆ కంపెనీలు రష్యా దగ్గర కొన్నా, ఉక్రెయిన్ దగ్గర కొన్నా ఆర్టీసీకి ఏం సంబంధం? జగన్ ఉన్నప్పుడు ఇక్కడకు అదానీ వచ్చి వ్యాపారాలు పెడితే తప్పు. నేరం. అవినీతి. అదే చంద్రబాబు ఉన్నప్పుడు వచ్చి లోకేశ్‌ని కలిస్తే ఆహా ఓహో అని రాస్తారు.
చంద్రబాబు ప్రభుత్వానికి సవాల్ చేస్తున్నా. జగన్ చేసిన ఒప్పందాలు దమ్ముంటే రద్దు చేసుకోవచ్చు. మేం నిజాయితీగా పాలన చేశాం. ప్రజల సంక్షేమం, శ్రేయస్సును దృష్టిలో ఉంచుకునే ఒప్పందాలు చేసుకున్నాం. దమ్ముంటే అది నిజం కాదని నిరూపించండి.
మొన్న లక్ష కోట్లన్నారు. చివరికి ఏమైంది?. రూ.1500 కోట్లు కూడా తేల్చలేకపోయారు. ఆ ఫైల్స్ మీద సంతకాలు పెట్టిన అధికారులే నిర్దోషులని కోర్టులు తీర్పులు చెబుతుంటే, ఇంకా జగన్‌కేం సంబంధం?.