– 50 వేల జరిమానా
– ఖరీదైన ఫోన్లు వాడేవారి కోసం పిల్ వేస్తారా?
– కిరాయి మూకలుగా పని చేస్తూ సోషల్ మీడియాను దుర్వినియోగం చేసే వారిని శిక్షించాల్సిందే
– హక్కులు తెలియకుండా సోషల్ మీడియాలో పోస్టులు ఎలా పెడతారు?
అమరావతి: వైసీపీ మద్దతుదారు, విశ్రాంత పాత్రికేయుడు విజయ్ బాబుపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిన వారిని అరెస్ట్ చేస్తున్నారంటూ ఆయన దాఖలు చేసిన పిటిషన్పై హైకోర్టు సీరియస్ అయింది. ఆయనకు రూ.50 వేల జరిమానాను విధించింది. రాజకీయ దురుద్దేశంతోనే ఈ పిటిషన్ వేశారని ఆయన పై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ పిటిషన్ను డిస్మిస్ చేస్తూ రూ.50 వేల జరిమానాను విధించింది. నెల రోజుల్లో లీగల్ సర్వీసెస్ అథారిటీలో రూ.50 వేలు చెల్లించాలని హైకోర్టు ఆదేశించింది.
ఈ పిటిషన్ ద్వారా ప్రజాప్రయోజన వ్యాజ్యం ఉద్దేశాలను విస్మరించారని, అసలు తమ హక్కులు తెలియకుండా సోషల్ మీడియాలో పోస్టులు ఎలా పెడతారు? సోషల్ మీడియా పోస్టులు పెట్టేవారు ఖరీదైన ఫోన్లు, ఎలక్ట్రానిక్ డివైజ్లు వాడుతున్నా రు. ఇలాంటి వారి తరఫున పిల్ వేయాల్సిన అవసరమేమిటని ప్రశ్నించింది. సమాజంలో తమ బాధను చెప్పుకోలేని వారి కోసం వేయాల్సిన ప్రజాప్రయోజన వ్యాజ్యాన్ని రాజకీయ దురుద్దేశంతో వేశారని ఆగ్రహం వ్యక్తం చేసింది.
సోషల్ మీడియాలో కుటుంబ సభ్యులను కించపరిచే విధంగా వల్గర్ లాంగ్వేజ్ వాడుతున్నారని, సోషల్ మీడియాను ఇష్టానుసారం వినియోగించుకుంటే న్యాయపరంగా అది నేరమేనని హైకోర్టు స్పష్టం చేసింది. కిరాయి మూకలుగా పని చేస్తూ సోషల్ మీడియాను దుర్వినియోగం చేసే వారిని శిక్షించాల్సిందేనని చెప్పింది. వైసీపీ హయాంలో విజయ్ బాబు అధికార భాషా సంఘం అధ్యక్షుడిగా పని చేశారు.