Suryaa.co.in

Andhra Pradesh

కూటమి ప్రతిష్ఠపై జెసి-ఆది ‘బూడిద’

– కూటమి పెద్దల వార్నింగ్ బేఖాతర్
– ఆది- జేసీ రగడ
– రాయలసీమ థర్మల్ పవర్ స్టేషన్ లో బూడిద దందాగిరి
(ఘంటా వీరభద్రరావు)

ఇద్దరూ అగ్రనాయకులే. పైగా ఇద్దరూ ఒకే సామాజికవర్గ నాయకులే. ఒకరు జమ్మలమడుగులో తిరుగులేని నాయకుడయితే, మరొకరు తాడిపత్రిలో ఎదురులేని నేత. ఆ ఇద్దరూ కూటమి నేతలే. ఒకరు బీజేపీ అయితే మరొకరు టీడీపీ. ఇప్పుడు ఇద్దరూ ‘బూడిద’పై యుద్ధం చేస్తున్నారు. ఇది కూటమి ప్రతిష్ఠపై, బూడిద చల్లుతోందన్న ఆందోళన పార్టీ శ్రేణుల్లో మొదలయింది. చివరాఖరకు టీడీపీ నాయకత్వ హెచ్చరికలను కూడా ఖాతరు చేయకుండా, ఎవరి పట్టు వారు నిలబెట్టుకునేందుకు కత్తులు నూరుతున్నారు.

రాయలసీమ థర్మల్ పవర్ స్టేషన్ లో బూడిద దందాగిరి సెమీ సంక్రాంతిని తలపిస్తోంది. ఈ బూడిద కోసం ఇటు తాడిపత్రి డేగ.. అటు జమ్ముల మడుగు కాకి రెక్కలు టపటపలాడించి.. గొంతు చించుకొంటున్నాయి. ఈ రెండు కోళ్ల సవాళ్ల కూతలతో ఆర్టీపీపీ దద్దరిల్లిపోతోంది. ఏ క్షణంలో ఈ కోళ్లు కత్తులతో ఏ బరిలో దిగుతాయో అర్థం కాక పోలీసులు తలపట్టుకుని.. సరిహద్దులను అష్టదిగ్భంధనం చేశారు. మరో వైపు అధికార కూటమి పెద్దలు తగ్గండి ..తగ్గండి లేదో తాట తీస్తాం అని హూంకరించినా.. ఆది జేసీ కోళ్లు ఎక్కడా తగ్గటం లేదు. ఎనీ హౌ ఈ రెండు వర్గాల బూడిద జగడం మూడో రోజుకు చేరింది. రెండు పిట్టల పోరు పిల్లి తీర్చ కూడదదంటూ ఇరు వర్గల మధ్య ఎడతెరపిలేని రాజీ చర్చలు యథాస్థితిలోనే ఉన్నాయి.

ఎక్కడా ఏ ఒక్కరూ తగ్గటం లేదు. రాజీతంత్రం తెగటం లేదు. మిగిలింది ఒక్కటే.. హక్కు భుక్తం షరతు. ఎవరు ఎవరికి హక్కు రాసివ్వాలో తేలటం లేదు. తాడిపత్రికి బూడిద తరలించటానికి జమ్మలమడుగు యువరాజుకు తాడిపత్రి మహారాజు అనుమతి ఇవ్వాలి. ఇది జేసీ బ్రదర్స్ నిబంధన. అది కాదు.. ఈ బూడిద హక్కు మాదే . మేమే తరలిస్తాం. కాంట్రాక్టులో సగం ఇస్తాం. ఇదీ జమ్మలమడుగు రాజన్న ఆది వర్గం షరతు. బూడిద తమ ఇలాఖాలో ఉంది కాబట్టి తమ వాహనాలతో తరలిస్తామని ఆదినారాయణరెడ్డి వర్గీయులు పేచీకి దిగారు. ఆ బూడిద వచ్చేది తాడిపత్రికి కాబట్టి తమ వాహనాల్లోనే తీసుకువెళ్తామని జేసీ వర్గం గొడవ పడుతోంది. ఇలా ఈ రెండు వర్గాల మధ్య పంచాయతీ రాజుకుంది. జేసీ ట్రిప్పర్లు వస్తే అడ్డుకుంటామని ఆదినారాయణ రెడ్డి వర్గం… భయపడేది లేదు.. వచ్చి తీరుతామని జేసీ వర్గం రంకెలేస్తోంది. ఈ స్థితిలో పోలీసులు అలెర్ట్ అయ్యారు. ముందు జాగ్రత్తగా మొహరించారు. అనంత పురం, కడప జిల్లా సరిహద్దు కొండాపురం మండలంలో చెక్ ఫోస్ట్ ఏర్పాటు చేశారు.

జేసీ ప్రభాకర రెడ్డి, ఆదినారాయ‌ణ‌రెడ్డి.. ఇద్దరూ కూట‌మి నేతలే కావ‌డం విశేషం. జేసీ తాడిప‌త్రిటీడీపీ నాయ‌కుడు, ఆదినారాయ‌ణ‌రెడ్డి బీజేపీ ఎమ్మెల్యే. వీళ్లిద్దరి మ‌ధ్య ప్లైయాష్ ఒప్పందంపై విభేదాలు తలెత్తాయి. జ‌మ్మల‌మ‌డుగులో ఆర్టీపీపీ నడుస్తోంది. త‌మ పరిధిలో ఏం జ‌రిగినా త‌మ క‌నుస‌న్నల్లోనే జరగాలని ఆదినారాయ‌ణ‌రెడ్డి భీష్మించారు. తాడిప‌త్రి ఏరియాలోని సిమెంట్ ఫ్యాక్టరీలకు ప్లైయాష్ ను త‌ర‌లిస్తున్నాయి. ఈ అంశంలోనే ఒప్పందం కుద‌ర‌లేదు. ఈ స్థితిలో .. తాడిపత్రి ..జమ్మలమడుగు బూడిద జగడం ఏ స్థితికి దారి తీస్తుందో.. అంతా సస్పెన్స్.. టెన్షన్ ..టెన్షన్.

LEAVE A RESPONSE