Suryaa.co.in

Andhra Pradesh

రఘురామ కస్టోడియల్ హింస కేసు

– సీఐడీ మాజీ ఏఎస్పీ విజయ్‌పాల్కు రిమాండ్
– సీఐడీ మాజీ అదనపు ఎస్పీ విజయ్‌పాల్కు పూర్తైన వైద్య పరీక్షలు
– ఒంగోలు ఎస్పీ కార్యాలయం నుంచి గుంటూరుకు తరలింపు

గుంటూరు : మాజీ ఎంపీ, ప్రస్తుత డిప్యూటీ స్పీకర్‌ రఘురామ కృష్ణరాజును కస్టడీలో చిత్రహింసలు పెట్టిన కేసులో అప్పటి సీఐడీ డీఎస్పీ విజయ్ పాల్కు కోర్టు 14 రోజులు రిమాండ్ విధించింది. పోలీసులు ఆయనను గుంటూరు జిల్లా జైలుకు తరలించారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడారని రఘురామకృష్ణరాజుపై రాజద్రోహం కేసు పెట్టి అరెస్టు చేశారు. ఆయన్ను గుంటూరులోని సీఐడీ ప్రాంతీయ కార్యాలయంలో విచారణకు తీసుకువచ్చి రాత్రి సమయంలో వేధించారు. ఈ వ్యవహారంలో రఘురామ ఫిర్యాదు చేసినా అప్పట్లో పట్టించుకోలేదు.

కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత గుంటూరులోని నగరపాలెం పోలీసులు జులై 11న కేసు నమోదు చేశారు. ఇందులో ఏ4గా అప్పటి విచారణ అధికారి విజయ్ పాల్ పేరు చేర్చారు. విజయ్ పాల్ను ఒంగోలులో అరెస్టు చేసి గుంటూరులోని ప్రొహిబిషన్ అండ్ ఎక్స్జైజ్ న్యాయస్థానంలో ప్రవేశపెట్టారు. విజయ్ పాల్కు డిసెంబర్ 10వ తేది వరకూ న్యాయస్థానం రిమాండ్ విధించింది. విజయ్ పాల్ను కోర్టులో ప్రవేశపెట్టిన సందర్భంగా 11 పేజిల రిమాండ్ రిపోర్టును పోలీసులు న్యాయమూర్తి ముందుంచారు.

గుండెలపై కూర్చుని చావబాదారు: రాష్ట్ర ప్రభుత్వం తరపున ప్రాసిక్యూషన్ జాయింట్ డైరెక్టర్ వి. రాజేంద్రప్రసాద్ వాదనలు వినిపించారు. రఘురామకృష్ణరాజును వేధించిన వ్యవహారంలో కుట్ర దాగి ఉందని, కుట్రదారులు ఎవరో తేలాలంటే పోలీసు కస్టడీకి ఇవ్వాలని కోరారు. అందుకు సంబంధించి కస్టడి పిటిషన్ దాఖలు చేయాలని న్యాయస్థానం పోలీసుల్ని ఆదేశించింది. రఘురామకృష్ణరాజును కస్టడీలో తీవ్రంగా వేధించారని, నవ్వుతూ సీఐడీ కార్యాలయానికి వెళ్లిన వ్యక్తి కనీసం నడవలేని స్థితిలో బయటకు వచ్చారని కోర్టుకు విన్నవించారు.

రఘురామ కాళ్లను తాళ్లతో కట్టేసి కొట్టారని తెలిపారు. అంతే కాకుండా గుండెలపై కూర్చుని చావబాది చంపడానికి ప్రయత్నించారని ప్రాసిక్యూషన్‌ జాయింట్‌ డైరెక్టర్‌ కోర్టుకు తెలిపారు. రఘురామను వేధించిన విషయం వీడియో అప్పటి పెద్దలకు పంపారని తెలిపారు. మిలిటరీ ఆసుపత్రి వైద్యులు ఇచ్చిన నివేదిక ప్రకారం రఘురామకృష్ణరాజు శరీరంపై గాయాలు ఉన్నాయని ఈ కేసులో 27 మందిని విచారించిన తర్వాత విజయ్ పాల్ను అరెస్టు చేశామని తెలిపారు.

LEAVE A RESPONSE