Suryaa.co.in

Andhra Pradesh

తుపానుగా మారనున్న తీవ్ర వాయుగుండం

– ఆ జిల్లాలో భారీ వర్షాలు
– రాయలసీమ, దక్షిణకోస్తా, ఉత్తరాంధ్రలో మోస్తరు నుంచి భారీ వర్షాలు
– రాష్ట్రంలోని అన్ని పోర్టులలో ఒకటో నెంబర్ ప్రమాద హెచ్చరికలు జారీ

అమరావతి: బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం మరో 6 గంటల్లో తుపాన్‌గా మారే అవకాశం ఉందని విశాఖ వాతావరణ కేంద్రం అధికారి జగన్నాథ్‌ కుమార్‌ వెల్లడించారు. గంటకు 8 కిలోమీటర్ల వేగంతో కదులుతున్న తీవ్ర వాయుగుండం ఉత్తర వాయవ్య దిశగా పయనించి మరింత బలపడి తుపాను మారనుందని పేర్కొన్నారు.

రెండు రోజుల్లో శ్రీలంకను తాకుతూ తమిళనాడు తీరం వైపు ప్రయాణించే అవకాశం ఉందన్నారు. 4 రోజుల్లో రాయలసీమ, దక్షిణకోస్తా, ఉత్తరాంధ్రలో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది.

హెచ్చరికలు జారీ: రానున్న 24 గంటల్లో నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో భారీ వర్షాలు కురిస్తాయన్నారు. 48 గంటలలో అన్నమయ్య, ప్రకాశం, చిత్తూరు, నెల్లూరు జిల్లాల్లో ఒకటి రెండు చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. గురువారం నుంచి ఈనెల 30వరకు ఉత్తరాంద్రలో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ అధికారులు తెలిపారు.

దీని ప్రభావం దక్షిణ కోస్తా తీరం వెంబడి గంటకు 35 నుంచి 55 కిలోమీటర్లు వేగంతో గాలులు వీస్తాయన్నారు. మత్య్సకారులను చేపల వేటకు వెళ్లవద్దని అధికారులు కోరారు. రాష్ట్రంలోని అన్ని పోర్టుల్లో ఒకటో నెంబర్ ప్రమాద హెచ్చరికలు జారీ చేశారు.

LEAVE A RESPONSE