– కొనుగోలు కేంద్రాలులేక గోస పడుతుంటే విజయోత్సవాలు చేసుకుంటారా?
– రేవంత్ ప్రభుత్వానికి కొంచమైనా సిగ్గుండాలి
– 2 లక్షల రైతు రుణమాఫీ ఏకకాలంలో సంపూర్ణంగా చేస్తామన్నరు.. ఏమైంది?
– రేవంత్ రెడ్డి సొంతూర్లో కూడా రైతు రుణమాఫీ చేయలేకపోయారు
– పంటల బీమా పథకం సోనియా గాంధీకి, రాహుల్ గాంధీకి, ప్రియాంక గాంధీకి ఎవరికి గిఫ్ట్ గా ఇచ్చిన్రు?
– బిజెపి తెలంగాణ రాష్ట్ర అధికార ప్రతినిధి రాణి రుద్రమ రెడ్డి
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏడాది పాలనలో రైతులను దగా చేసి, రైతు పండుగ పేరిట మూడు రోజుల పాటు విజయోత్సవాలు జరపాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించడం పట్ల బిజెపి తెలంగాణ రాష్ట్ర అధికార ప్రతినిధి రాణి రుద్రమ రెడ్డి ఆగ్రహం వ్యక్తంచేశారు. వరంగల్ డిక్లరేషన్ లో ఇచ్చిన 9 హామీల్లో ఏ ఒక్కటీ అమలు చేయకుండా మోసం చేసిన కాంగ్రెస్ సర్కారుకు విజయోత్సవాలు నిర్వహించుకునే అర్హత లేదని మండిపడ్డారు.
కాంగ్రెస్ రైతు విజయోత్సవాలకు బదులు.. రైతు మోసాల ఉత్సవాలు జరుపుకోవాలని ఎద్దేవా చేశారు. బిజెపి తెలంగాణ రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో రాణి రుద్రమ రెడ్డి గారు మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏడాది పాలనలో రైతులకు చేసిన మోసాలను ఎండగట్టారు.
కాంగ్రెస్ ప్రభుత్వం ఏడాది పాలన పూర్తవుతున్న సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వం మహబూబ్‌నగర్‌లో 3 రోజుల పాటు రైతు విజయోత్సవ సభ పేరుతో కొత్త తరహా ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. రైతులకు ఏం ఒరగబెట్టకుండానే సంబరాలు చేసుకునేందుకు సిద్ధమయ్యారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేసుకునేవి రైతు విజయోత్సవాలు కాదు.. రైతు మోసాల ఉత్సవాలు. ఎన్నికలకు ముందు వరంగల్ రైతు డిక్లరేషన్ పేరిట 9 హామీలిచ్చి, రైతుల ఓట్లతో అధికారంలోకి వచ్చారు.
ఏడాది కాలంలో ఒక్క హామీ కూడా నెరవేర్చకుండా.. ఇప్పుడు ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. ఎద్దు ఏడ్చిన ఎవుసం.. రైతు ఏడ్చిన రాజ్యం బాగుపడదు. ఆరుగాలం కష్టపడి పంట పండించిన రైతులకు పంటను అమ్ముకుంటే సరైన మద్దతు ధర రాక, బోనస్ అందక, కొనుగోలు కేంద్రాలులేక గోస పడుతుంటే.. విజయోత్సవాలు చేసుకుంటారా..? రేవంత్ ప్రభుత్వానికి కొంచమైనా సిగ్గుండాలి. రైతులకు ఇచ్చిన 9 హామీలను నెరవేర్చనందుకు కాంగ్రెస్ పార్టీది మోసాల డిక్లరేషన్ గా ఒప్పుకొని తెలంగాణ రైతులను క్షమాపణ అడగాలి.
ఎన్నికల ముందు రాహుల్ గాంధీ సమక్షంలో ఎలాగైతే రైతు డిక్లరేషన్ ప్రకటించిన్రో.. ఇప్పుడు అదే రాహుల్ గాంధీని తీసుకొచ్చి రైతులకు క్షమాపణ చెప్పి విజయోత్సవాలు చేసుకోవాలి. లేదంటే రద్దు చేసుకుంటే వాళ్లిష్టం. సోనియమ్మ రాజ్యంలో ఇందిరమ్మ రైతు భరోసా పేరుతో ఎకరానికి రూ. 15 వేల చొప్పున ప్రకటించి ఎగ్గొట్టింది. వ్యవసాయ కూలీలకు రూ. 15 వేలు, కౌలు రైతులకు రూ. 12 వేలు ఇస్తమన్నరు. ఈనాటికి ఏ ఒక్కరికీ రైతు భరోసా అందివ్వలేదు.
రైతులకు ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా, ఏం వెలగబెట్టారని రైతు విజయోత్సవాలు చేసుకుంటున్నారు? అధికారంలోకి రాగానే రూ. 2 లక్షల రైతు రుణమాఫీ ఏకకాలంలో సంపూర్ణంగా చేస్తామన్నరు. ఏమైంది?
ఆనాడు సోనియమ్మ సాక్షిగా.. పీవీ నర్సింహారావు, కాళోజీ, సమ్మక్క-సారలమ్మ, కాకతీయుల చరిత్ర పేరెత్తి వరంగల్ లో రైతు డిక్లరేషన్ ప్రకటించిన్రు. కనీసం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సొంతూర్లో కూడా రైతు రుణమాఫీ చేయలేకపోయారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు నకిలీ లేని, నాణ్యమైన విత్తనాలు అందించలేకపోతోంది. విత్తనాలు, ఎరువులు, పురుగుమందులన్నీ కల్తీ అవుతుండటంతో రైతులు నష్టపోతున్నరు.
అకాల వర్షాలు, ప్రకృతి విపత్తులతో పంట నష్టపోయిన రైతులను ఆదుకునేలా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ఫసల్ బీమా యోజన పథకం ప్రవేశపెడితే గత బీఆర్ఎస్ ప్రభుత్వం దాన్నీ అమలు చేయలేదు. పంట నష్టపరిహారం ఇచ్చేలా సరికొత్త పంట బీమా పథకం తీసుకొస్తామని ఎన్నికల వేళ రేవంత్ రెడ్డి హామీ ఇచ్చిన్రు. మరి పంటల బీమా పథకం సోనియా గాంధీకి, రాహుల్ గాంధీకి, ప్రియాంక గాంధీకి ఎవరికి గిఫ్ట్ గా ఇచ్చిన్రు..? పంటల బీమా పథకం అమలు చేయకపోవడంతో తెలంగాణ రైతులు అరిగోస పడుతున్నరు.
ధరణి పోర్టల్ పెద్ద స్కాం. గత బీఆర్ఎస్ ప్రభుత్వం రైతుల భూములు కబ్జా పెట్టి, కొన్ని సామాజిక వర్గాలకు, వారి అనుయాయులకు కట్టబెట్టేందుకు,… ప్రభుత్వ భూములను ప్రైవేటు వ్యక్తుల పరం చేసేందుకు దరణి పోర్టల్ తీసుకొచ్చింది. నకిలీ విత్తనాల సరఫరా చేసేవారిపై పీడీయాక్ట్ నమోదు చేసి జైలుకు పంపుతమని రేవంత్ రెడ్డి మాటలు చెప్పిన్రు. ఇప్పటివరకు ఏ ఒక్కరిపైనా అయినా చర్యలు తీసుకుని నియంత్రించిన్రా..? కాంగ్రెస్ ప్రభుత్వానికి నూతన వ్యవసాయ విధానం-పంటల ప్రణాళికపై ఎటువంటి అవగాహన లేదు.
గత బీఆర్ఎస్ ప్రభుత్వం, నేటి కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు సంబంధించి నిర్దిష్ట ప్రణాళిక రూపొందించలేకపోవడం తెలంగాణ ప్రజల దురదృష్టం. కేవలం మూసీ ప్రక్షాళన, హైడ్రా పేరుతో కాలం వెల్లదీస్తూ 6 గ్యారంటీలను అమలు చేయకుండా తెలంగాణ రైతులను నిండా ముంచుతున్నరు. రైతులకు భూసార పరీక్షలు చేసి అనువైన పంటలు వేసుకునేలా గతంలో తెలంగాణకు రూ. 90 కోట్ల నిధులు సాయిల్ టెస్ట్ కోసం నరేంద్ర మోదీ ప్రభుత్వం విడుదల చేసింది.
బీఆర్ఎస్ ప్రభుత్వంలో సాయిల్ టెస్ట్ నిధులు అటకెక్కినయ్. పంట నష్టపరిహారం అందించే ఫసల్ బీమా పథకాన్ని అటకెక్కించింది. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వానికి చేతకావడంలేదు. నకిలీ విత్తనాల మాఫియాను అరికట్టే పరిస్థితి లేదు. ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి ద్వారా ప్రతి రైతుకు చేయూతనందించేలా నరేంద్ర మోదీ ప్రభుత్వం సంవత్సరానికి రూ. 6 వేల చొప్పున ఆర్థిక సాయం అందిస్తున్నది.
ఇవాళ తెలంగాణలో ఒక్క పంటకు బోనస్ ఇచ్చి మిగతా రెండు పంటలకు ఎగ్గొట్టిన చరిత్ర కాంగ్రెస్ పార్టీది. వడ్లతో సహా 7 పంటలకు మద్దతు ధరను రాష్ట్ర ప్రభుత్వం భరించి రైతులను ఆదుకుంటమని చెప్పి.. అధికారంలోకి వచ్చాక కేవలం సన్నవడ్లకే రూ. 500 బోనస్ ఇస్తమని మాట తప్పారు. అది కూడా పూర్తిస్థాయిలో ఇవ్వకుండా మోసం చేసింది. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ధాన్యం కొనుగోలు కేంద్రాలు కూడా ఏర్పాటు చేయలేదు. వడ్లు ఆరబోసుకునే మార్కెట్ యార్డుల్లేవు.
రైతులు పండించిన పంటను జాతీయంగా, అంతర్జాతీయంగా ఎక్కడైనా అమ్ముకునేలా ఈ-నామ్ ఆన్ లైన్ మార్కెటింగ్ వ్యవస్థను ఏర్పాటు చేసి రైతు ఉత్పత్తులకు మార్కెటింగ్ సౌకర్యాలు కల్పించిన ప్రభుత్వం నరేంద్ర మోదీ ప్రభుత్వం. తెలంగాణ రాష్ట్రంలో రైతు ఉత్పత్తులను అమ్ముకునేలా ఒక్కటంటే ఒక్క స్కీమునైనా గత బీఆర్ఎస్ ప్రభుత్వం, నేటి కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిందా..? సమాధానం చెప్పాలి.
కేంద్ర ప్రభుత్వం కోళ్ల పెంపకం, గొర్ల పెంపకం, చేపల పెంపకం కోసం లక్ష రూపాయల నుంచి రూ. 4 కోట్ల వరకు సబ్సిడీ లోన్లు ఇస్తోంది. కాని, రాష్ట్ర ప్రభుత్వం మాత్రం నడ్డివిరుస్తున్నది. విత్తనాల నుంచి పంట చేతికొచ్చే వరకు నరేంద్ర మోదీ ప్రభుత్వం రైతులకు వెన్నుదన్నుగా నిలుస్తుంటే.. రాష్ట్ర ప్రభుత్వం మాత్రం పంటధాన్యాన్ని దళారుల పాల్జేస్తూ రైతులను మోసం చేస్తున్నది.
కాంగ్రెస్ సర్కారు ఏ మొహం పెట్టుకుని రైతు విజయోత్సవాలు చేసుకుంటున్నట్లు..? కాంగ్రెస్ పాలనలో రైతులు, ప్రజలకు న్యాయం చేయకపోగా వారి భూములు గుంజుకుంటూ దుర్మార్గ పాలన చేస్తున్నది. రైతు విజయోత్సవాలు చేసుకునే అర్హత కాంగ్రెస్ ప్రభుత్వానికి లేదు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు చేసిన మోసాలకు గాను క్షమాపణ చెప్పి, రైతు విజయోత్సవాలు జరుపుకోవాలి.