– పాఠశాలల్లో 51 మంది విద్యార్థులు చనిపోయిన్రు
– రాష్ట్ర వ్యాప్తంగా 886 మంది విద్యార్థులు అస్వస్థతకు లోనయిన్రు
– 38 గురుకులాల్లో ఫుడ్ పాయిజన్ కేసులు
– ప్రభుత్వ ఇంటెలిజెన్స్ ఎక్కడికి పోయింది?
– రైతులకు బేడీలేసిన చరిత్ర బీఆర్ఎస్ ప్రభుత్వానిది
– బిజెపి తెలంగాణ రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కాసం వెంకటేశ్వర్లు
హైదరాబాద్: కాంగ్రెస్ ఏలుబడిలో సంక్షేమ హాస్టళ్లన్నీ సంక్షోభ హాస్టళ్లుగా మారిపోయాయి. హోం, సోషల్ వెల్ఫేర్, ఎడ్యుకేషన్, మున్సిపల్ .. ఇలా ముఖ్యమైన మంత్రిత్వ శాఖలన్నీ సీఎం రేవంత్ రెడ్డి దగ్గరే ఉంచుకున్నరు. పరిపాలన గాలికొదిలేసి మహారాష్ట్ర, ఢిల్లీ పర్యటనలతో టైం వెల్లదీస్తున్నరు. ఫుడ్ పాయిజన్ ఘటనలపై హైకోర్టు మొట్టికాయలు వేస్తే తప్ప కాంగ్రెస్ ప్రభుత్వం స్పందించలేదు.
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత వివిధ గురుకుల పాఠశాలల్లో 51 మంది విద్యార్థులు చనిపోయిన్రు. 23 మంది అభశుభం తెలియని విద్యార్థులు బలవన్మరణానికి పాల్పడ్డరు. 10 మంది అనుమానాస్పద స్థితిలో మరణించారు. నలుగురు విద్యార్థులు ఫుడ్ పాయిజన్ తో, 14 మంది అనారోగ్యంతో చనిపోయిన్రు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక రాష్ట్ర వ్యాప్తంగా 886 మంది విద్యార్థులు అస్వస్థతకు లోనయిన్రు. రాష్ట్రంలో 38 గురుకులాల్లో ఫుడ్ పాయిజన్ కేసులు నమోదయ్యాయి.
సీఎం రేవంత్ రెడ్డికి సోనియా కుటుంబానికి ఊడిగం చేసుకోవడమే తప్పితే పేద ప్రజల గురించి ఆలోచించే సోయిలేదు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏడాది పాలన పూర్తయింది. ఇప్పటివరకు ముఖ్యమైన మంత్రిత్వ శాఖలన్నీ రేవంత్ రెడ్డి దగ్గరే ఉంచుకున్నరు. సంక్షేమ హాస్టళ్లలో ప్రతిపక్షాలు కుట్రచేసి పిల్లల్ని చంపేస్తున్నరంటూ మంత్రి సీతక్క మాట్లాడుతున్నరు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిపక్షాల మీద నెపం నెట్టి రాజకీయ లబ్ధిపొందాలనుకోవడం సిగ్గుచేటు. పిల్లలు చనిపోయేంతవరకు వస్తుంటే ప్రభుత్వ ఇంటెలిజెన్స్ ఎక్కడికి పోయింది?
తెలంగాణ చరిత్రలో ఎన్నడు లేనంతగా సీఎం రేవంత్ సొంత జిల్లా నారాయణపేటలోని ఒక్క ప్రభుత్వ ఉన్నత పాఠశాలలోనే మూడుసార్లు ఫుడ్ పాయిజన్ ఘటనలు జరిగాయి. ఫుడ్‌పాయిజన్ ఘటనలో సస్పెండైన నారాయణపేట డీఈవో మహ్మద్ అబ్దుల్ ఘనీకి ప్రభుత్వం వనపర్తి జిల్లా డీఈవోగా అదనపు పోస్టింగ్ ఇచ్చింది. తిరిగి ఒక్కరోజులోనే మళ్లీ నారాయణపేట డీఈవోగా బాధ్యతలు అప్పజెప్పింది. అవినీతి అధికారులకు వత్తాసు పలకడం వెనుక మతలబు ఏంటి..?
ఫుడ్ పాయిజన్ ఘటనలతో విద్యార్థులు అవస్థలు పడుతుంటే ఆకునూరి మురళి, కోదండరాం వంటి విద్యావేత్తలు ఎందుకు స్పందించడం లేదు..? కనీసం హాస్టళ్లను కూడా సందర్శించడం లేదు. సీఎం కేసీఆర్ మనవడు.. హిమాన్షుతో గచ్చిబౌలి కేశవనగర్‌లో ప్రాథమిక పాఠశాలలో టాయిలెట్లు కూడా లేవని, సౌకర్యాలు లేవని దత్తత తీసుకుని కోటి రూపాయల నిధులిచ్చి, మొసలికన్నీరు కార్చిన్రు. ఆ ఒక్క స్కూల్ తప్పితే మిగతా స్కూళ్లలో సౌకర్యాలు కల్పించలేదు.
ఇప్పుడు కేసీఆర్ దారిలోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నడుస్తున్నడు. వాంకిడి ఆశ్రమ పాఠశాల విద్యార్థిని శైలజ మృతిపై తామెందుకు కారణమంటూ రాష్ట్ర మంత్రులు ఇష్టానుసారంగా మాట్లాడిన్రు. రేవంత్ రెడ్డి విద్యావ్యవస్థను గాలికొదిలేసి పాలనను ఆగం చేస్తున్నరు. మరోవైపు ట్విట్టర్ టిల్లు, డ్రామారావు, సైకోరావుగా పేరుతెచ్చుకున్న కేటీఆర్.. ఎప్పుడు ట్విట్టర్ లోనే స్పందిస్తున్నరు.
కేవలం మీడియాలో హెడ్ లైన్ల కోసం బిజెపి-కాంగ్రెస్ కలిసి పనిచేస్తున్నయని అపరిపక్వతతో మాట్లాడుతున్నడు. కేటీఆర్ మాటలు చూస్తుంటే ఆయనకు మతిభ్రమించినట్లు కనపడుతోంది. పార్లమెంటు ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ డిపాజిట్లు కూడా కోల్పోవడంతో షాక్ నుంచి తేరుకోలేకపోయిండు. కాంగ్రెస్ -బీఆర్ఎస్ పార్టీల నాయకులు బయట డూప్ ఫైట్ చేస్తూ.. లోపల కలిసి వ్యాపారులు చేసుకుంటారు.
గతంలో కేసీఆర్.. ఆయన కుటుంబసభ్యులతో కలిసి జనపథ్ కు వెళ్లి సోనియా గాంధీ కాళ్లు పట్టుకున్నారు. కాంగ్రెస్, టీడీపీ ఎమ్మెల్యేలను పార్టీ ఫిరాయించి మంత్రి పదవులిచ్చిన చరిత్ర బీఆర్ఎస్ పార్టీది. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ…. బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలను తీసుకొని పదవులిస్తోంది. కాంగ్రెస్ నాయకులు బీఆర్ఎస్ పార్టీలోకి, బీఆర్ఎస్ పార్టీ నాయకులు కాంగ్రెస్ లోకి వెళ్లడం కొత్త వ్యవహారమేమీ కాదు.
పాలనలో బీఆర్ఎస్-కాంగ్రెస్ పార్టీలవి ఒకే తీరు. ఖమ్మంలో రైతులకు బేడీలేసిన చరిత్ర బీఆర్ఎస్ ప్రభుత్వానిది. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు బేడీలేసి జైలుకు పంపిస్తున్నది. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో మాదిరిగానే కాంగ్రెస్ పాలనలో గురుకులాల్లో నాసిరకం పురుగుల బియ్యం పెడుతూ విద్యార్థులను అనారోగ్యంపాల్జేస్తున్నరు. బీఆర్ఎస్ ప్రభుత్వం మాదిరిగానే రేవంత్ ప్రభుత్వం నిరుద్యోగులపై లాఠీచార్జీ చేసి, ఉస్మానియా యూనివర్సిటీని లాకౌట్ చేసి బంధిస్తున్నది. నిరుద్యోగులను అరెస్టులు చేస్తున్నది. అందుకు సజీవ సాక్ష్యం అశోక్ నగర్ వ్యవహారం.
ఓటుకు నోటు కేసులో రేవంత్ రెడ్డికి శిక్ష పడకుండా కాపాడింది బీఆర్ఎస్ పార్టీ. అందుకు బదులుగా కాంగ్రెస్ పార్టీ కేసీఆర్ కుటుంబాన్ని రక్షిస్తున్నది. బీఆర్ఎస్ పాలనలో లక్షకోట్ల అవినీతి జరిగిందని ఢంకా బకాయించి చెప్పి, అవినీతి సొమ్ము కక్కిస్తానని రేవంత్ రెడ్డి మాటలు చెప్పిండు. ఏడాది పాలనలో ఇంతవరకు దోషులెవ్వరినీ జైలుకు పంపించలేదు.
కేటీఆర్..!! 2004లో బీఆర్ఎస్-కాంగ్రెస్ కలిసి పోటీ చేశాయి. బహుశా అప్పుడు నువ్వు అమెరికాలో ఉన్నవేమో. అందుకే నీకు తెల్వదేమో..!! చరిత్ర తెలుసుకోవాలి. రాష్ట్రపతి ఎన్నికల్లో ఆదివాసీ మహిళ ద్రౌపది ముర్ము గారిని రాష్ట్రపతి అభ్యర్థిగా నిలబెడితే కాంగ్రెస్-బీఆర్ఎస్ లు కలిసి వ్యతిరేకిస్తూ ప్రచారం చేశాయి. కాంగ్రెస్ పార్టీ బలపర్చిన రాష్ట్రపతి అభ్యర్థికి యశ్వంత్ సిన్హాకు మద్దతుగా బీఆర్ఎస్ పార్టీ ప్రచారం చేసింది.
నాడు ఆర్టికల్ 370 రద్దుని కాంగ్రెస్ వ్యతిరేకిస్తే.. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత కశ్మీర్ ప్రత్యేక దేశమంటూ ప్రకటించింది. కాంగ్రెస్-బీఆర్ఎస్ పాలన, విధివిధానాలు ఒక్కటే. దేశహితాన్ని కాంక్షించకుండా సర్జికల్ స్ట్రయిక్ పై సాక్షాలడిగింది కాంగ్రెస్-బీఆర్ఎస్ పార్టీలు. దేశంలో నరేంద్ర మోదీ ప్రభుత్వం స్వచ్ఛమైన, సుపరిపాలన అందిస్తున్నది. గత బీఆర్ఎస్ ప్రభుత్వం మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ, ధరణి పోర్టల్, టీఎస్ పీఎస్సీ నియామకాల్లో అవినీతికి పాల్పడింది.
ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం హైడ్రా, మూసీ, పాలమూరు-రంగారెడ్డి ఇరిగేషన్ ప్రాజెక్టు అంచనాల పెంపు, ధాన్యం కొనుగోళ్లలో అవినీతికి తెరలేపింది. కాంగ్రెస్ పార్టీ చేతిలో కమలం లేదు.. బీఆర్ఎస్ కారు స్టీరింగ్ కాంగ్రెస్ పార్టీ చేతిలో ఉంది. కేటీఆర్ ఇప్పటికైనా ఇష్టానుసారంగా కూతలు మానుకోవాలి. లేదంటే ప్రజల్లో కేఏ పాల్ మాదిరిగా కామెడీ పీస్ గా మిగిలిపోకతప్పదు. మీడియా సమావేశంలో ఓబీసీ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు ఆనంద్ గౌడ్ గారు, పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి కట్టా సుధాకర్ గారు, తదితరులు పాల్గొన్నారు.