– బీజేపీ, యూత్ కాంగ్రెస్ కార్యకర్తల మధ్య ఘర్షణ
– కాంగ్రెస్ కార్యకర్తల దాడిలో బీజేపీ ప్రధాన కార్యదర్శి కాసం తలకు గాయాలు
– బీజేపీ అగ్రనేతల ఆగ్రహం
హైదరాబాద్ : రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగర నడిబొడ్డులోని నాంపల్లిలో తొలిసారి తీవ్ర ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. గాంధీభవన్‌కు ఎదురుగా ఉన్న బీజేపీ రాష్ట్ర కార్యాలయంపైకి యూత్ కాంగ్రెస్ కార్యకర్తలు దూసుకువచ్చే ప్రయత్నం చేశారు. అందులో భాగంగా రాళ్లదాడికి దిగగా, బీజేపీ కార్యకర్తలు దానిని ప్రతిఘటించారు. ఆ ప్రయత్నంలో బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కాసం వెంకటేశ్వర్లు తలకు బలమైన గాయమవగా, ఆయనను చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. రాష్ట్ర రాజధాని నగర నడిబొడ్డులో జరిగిన ఈ దాడి ప్రజలను ఉలిక్కిపడేలా చేసింది.
నాంపల్లి బీజేపీ కార్యాలయం వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. బీజేపీ మాజీ ఎంపీ రమేష్ బిదురి ఇటీవల కాంగ్రెస్ అగ్రనేత, వయనాడ్ ఎంపీ ప్రియాంక గాంధీని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలను నిరసిస్తూ కాంగ్రెస్ శ్రేణులు బీజేపీ కార్యాలయం ముట్టడికి యత్నించారు. దీంతో బీజేపీ కార్యకర్తలు కాంగ్రెస్ నాయకులను అడ్డుకునే ప్రయత్నం చేశారు.
బీజేపీ కార్యాలయంపై కోడిగుడ్లు, రాళ్లతో దాడి చేశారు. దీంతో బీజేపీ నాయకులు కాంగ్రెస్ శ్రేణులపై తిరగబడటంతో.. కర్రలతో రెండు పార్టీల నాయకులు కొట్టుకున్నారు. ఈ దాడిలో బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కాసం వెంకటేశ్వర్లు తలకు తీవ్రమైన గాయమయింది. వెంటనే క్షతగాత్రుడిని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు.
బీజేపీ అధికారంలోకి వస్తే ఢిల్లీలో రోడ్లను ప్రియాంక గాంధీ బుగ్గలలా తయారుచేస్తామన్నారు. ఈ వ్యాఖ్యలపై కాంగ్రెస్ శ్రేణులు మండిపడ్డారు. మరోవైపు ఆప్ నేత అతిషిపై కూడా రమేష్ బిదురి సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలోని కాంగ్రెస్ శ్రేణులు మంగళవారం మధ్యాహ్నం 12 గంటల తర్వాత గాంధీ భవన్ నుంచి నాంపల్లి బీజేపీ కార్యాలయానికి భారీగా చేరుకున్నారు. బీజేపీ కార్యాలయం ముట్టడికి ప్రయత్నించారు. ఈలోపు బీజేపీ శ్రేణులు ప్రతిఘటించడంతో తీవ్ర ఘర్షణ వాతావరణం నెలకొంది. కాంగ్రెస్ దాడిని బీజేపీ నేతలు తీవ్రంగా ఖండిస్తున్నారు.
కేంద్రమంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ స్పందిస్తూ బీజేపీ శ్రేణులపై దాడిని హేయమైన చర్యగా పేర్కొన్నారు. తక్షణమే నిందితులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
జరగబోయే పరిణామాలకు ప్రభుత్వానిదే బాధ్యత: కేంద్రమంత్రి, తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి
తెలంగాణ బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యాలయం పైన యూత్ కాంగ్రెస్ కార్యకర్తలు గూండాలు, రౌడీల్లాగా వ్యవహరిస్తూ.. రాళ్లతో, కర్రలతో చేసిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాను. ఇది పిరికిపిందల చర్య. ఇలాంటి దుర్మార్గమైన రాజకీయాలకు కేరాఫ్ అడ్రస్ అయిన కాంగ్రెస్ పార్టీ తన తీరును మార్చుకోకపోతే పరిస్థితులు తీవ్రంగా ఉంటాయని హెచ్చరిస్తున్నాను.
పోలీసుల సమక్షంలోనే కాంగ్రెస్ కార్యకర్తలు రాష్ట్ర బీజేపీ ఆఫీస్ గేటు వద్ద దాడికి పాల్పడటం దుర్మార్గం. బీజేపీ కార్యాలయం ముందు వరకు చేరుకుని రాళ్లు, కర్రలతో కాంగ్రెస్ గూండాలు పోలీసుల సమక్షంలో, పోలీసులతో కలిసి వచ్చి ఆఫీస్ పైన, బీజేపీ కార్యకర్తలపైన దాడులు చేస్తుంటే పోలీసులు ప్రేక్షకపాత్ర పోషించారు.
గతంలో సొంతపార్టీకి చెందిన ముఖ్యమంత్రులను గద్దెదించేందుకు మతకల్లోలాలు సృష్టించిన దుర్మార్గమైన చరిత్ర కాంగ్రెస్ పార్టీ సొంతం. ఇలాంటి దాడులను ఆపకపోతే.. ఆ తర్వాత తలెత్తే పరిస్థితులకు సిద్ధంగా ఉండాలని కాంగ్రెస్ పార్టీని హెచ్చరిస్తున్నాను. పోలీసుల సమక్షంలో బీజేపీ కార్యాలయంపై దాడిచేసి.. మా కార్యకర్తలను గాయపరిచే విషయం ముఖ్యమంత్రికి తెలియకుండా జరగదు.
ఖబడ్దార్, అసహనం కోల్పోయి మీరు చేస్తున్న చర్యలకు వ్యతిరేకంగా బీజేపీ కార్యకర్తలు తిరగబడితే.. దేశంలో కాంగ్రెస్ కు ఉన్న కొద్దిపాటి నాయకులు తిరుగలేని పరిస్థితులు ఏర్పడుతాయి. రాష్ట్రంలో ఈ రకమైన దాడులతో భవిష్యత్తులో జరగబోయే పరిణామాలకు రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరిస్తున్నాను.
మా సహనాన్ని అసమర్థతగా భావించొద్దు. మేం హింసా రాజకీయాలను ప్రోత్సహించం. అలాగని మాపై దాడులు చేస్తే సహించం. ఎవరి వ్యాఖ్యలైనా మీకు నచ్చకపోతే.. నిరసన తెలియజేయండి అంతే కానీ.. కార్యాలయంపై భౌతికంగా దాడి చేయడం, రాళ్లు, కర్రలతో దాడికి దిగడం సరికాదు. తన వ్యాఖ్యలకు ఢిల్లీకి చెందిన మాజీ ఎంపీ రమేశ్ భిదూరీ క్షమాపణలు చెప్పిన తర్వాత కూడా.. అసహనంతో దాడులు చేయడం సరైనదేనా?
గతంలోనూ ప్రధానమంత్రి గారికి పెరుగుతున్న ఆదరణ చూసి తట్టుకోలేక గాంధీ-నెహ్రూ కుటుంబసభ్యులు.. తీవ్ర అసహనంతో.. తక్కువ కులంవాడు, చాయ్ అమ్ముకునే వ్యక్తి ఎలా ప్రధాని అవుతారు, మౌత్ కా సౌదాగర్, హిట్లర్ వంటి ఎన్నో అవాకులు, చెవాకులు పేలారు. దీన్ని ఖండిస్తూ బీజేపీ ఎక్కడైనా దాడులు చేసిందా? మేం దీనికి ప్రతిగా సమాధానం చెబితే.. ఏ ఒక్క కాంగ్రెస్ నాయకుడు దేశంలో రోడ్లపై తిరగలేడు. కానీ ఇది మా సంస్కృతి కాదు. మీ సంస్కృతిని మార్చుకోండి. ఖబడ్దార్.
పోలీసుల ప్రేక్షకపాత్ర: ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షులు డాక్టర్ కె.లక్ష్మణ్
భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యాలయంపై, బిజెపి కార్యకర్తలపై కాంగ్రెస్ కార్యకర్తలు గూండాలతో కలిసి దాడికి పాల్పడిన ఘటనను రాజ్యసభ సభ్యులు, బిజెపి ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు డాక్టర్ కె.లక్ష్మణ్ తీవ్రంగా ఖండించారు. కాంగ్రెస్ కార్యకర్తలు రాడ్లు, కర్రలతో బిజెపి కార్యాలయానికి వస్తున్నారనే సమాచారం తెలిసినా, దాడికి పాల్పడుతున్నా పోలీసులు ప్రేక్షకపాత్ర వహించడం దారుణమన్నారు.
సీఎం రేవంత్ రెడ్డి మెప్పు పొందేందుకే పోలీసులు రాష్ట్ర ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని లక్ష్మణ్ మండిపడ్డారు.ఈ దాడులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ పూర్తిబాధ్యత వహించాలని ఆయన హెచ్చరించారు. ఇప్పటికైనా దాడికి పాల్పడిన వారిని గుర్తించి, చట్టపరంగా చర్యలు తీసుకోవాలని లక్ష్మణ్ డిమాండ్ చేశారు. హింసాత్మక దాడులకు పాల్పడటం కాంగ్రెస్ పార్టీ రాజకీయ సమాధికి గోతులు తవ్వుకున్నట్లేనన్నారు.
మిస్టర్ రేవంత్ రెడ్డి.. ఖబర్దార్: జాతీయ ఉపాధ్యక్షురాలు, మహబూబ్‌నగర్ ఎంపి డికె అరుణ
బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై కాంగ్రెస్ దాడి దుర్మార్గం. ఇలాంటి గుండా రాజకీయాలు సాగవు. మిస్టర్ రేవంత్ రెడ్డి ఖబర్దార్. ఇలాంటి చిల్లర రాజకీయాలు మానుకోకపోతే తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. రాష్ట్ర పార్టీ కార్యాలయం మీద, మా కార్యకర్తల మీద దాడులను తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇలాంటి దాడులకు భయపడేది లేదు. ఈ ఘటన వెనుక రేవంత్ కుట్ర దాగుంది.ఈ ఘటనకు రేవంత్ బాధ్యత వహించాలి. పోలీస్ అధికారులు కఠినంగా వ్యవహారించాలి, ఎవ్వరిని వదలొద్దు. జరిగిన ఘటనలో బాధ్యులను వెంట అరెస్ట్ చేయాలి.
మీ ఇంటిలిజెన్స్ పనిచేస్తుందా లేదా ?: మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్
మిస్టర్ రేవంత్ రెడ్డి.. ఈ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ ఉందా లేదా ? మీ ఇంటిలిజెన్స్ పనిచేస్తుందా లేదా ? పార్టీ కార్యాలయాల మీద దాడి చేసే సంసృతి సిగ్గుచేటు. మీ పాలనలో ఈ రాష్ట్రాన్ని ఎటు తీసుకుపోదాం అనుకుంటున్నారు. బీజేపీ కార్యకర్తల సహనాన్ని పరీక్షించవద్దు. గుండాల మాదిరిగా దాడిచేసిన కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలపై కఠిన చర్యలు తీసుకోవాలి. లేదంటే జరిగే పరిణామాలకు మీరే బాధ్యత వహించాలని హెచ్చరించారు.
దాడికి రేవంత్ రెడ్డి అసదుద్దీన్ ఓవైసీ బాధ్యత వహించాలి : ఎంపీ రఘునందన్ రావు
బిజెపి రాష్ట్ర కార్యాలయం పై గూండాలు రౌడీషీటర్లు కాంగ్రెస్ కార్యకర్తల ముసుగులో దాడి చేశారు ఈ దాడికి రేవంత్ రెడ్డి అసదుద్దీన్ ఓవైసీ బాధ్యత వహించాలి. నిన్న ఒకే వేదికపై ఓవైసీ సోదరులతో వేదిక పంచుకోగానే రేవంత్ రెడ్డి అక్కడే ఈ దాడికి పథకాన్ని రచించారు.
గతంలో తమ సొంత ముఖ్యమంత్రిని దించడం కోసం చెప్పులు వేయడం మత కల్లోలాలు సృష్టించడం వారి చరిత్రలో భాగమే. నకిలీ గాంధీ కుటుంబ సభ్యుల కోసం ఇక్కడ కొందరు రౌడీషీటర్లు కాంగ్రెస్ ముసుగులో ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారు.
తెలంగాణలో శాంతి భద్రతలు పూర్తిగా సన్నగిల్లిపోయినాయి గుండాలకు రౌడీషీటర్లకు ఉగ్రవాదులకు నక్సలైట్లకు పూర్తి స్వేచ్చని ఇచ్చి తెలంగాణను కుక్కలు చంపిన విస్తరి చేయమని సోనియా గాంధీ రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీలు చెప్పారా?
బీజేపీ కార్యాలయంపై కార్యకర్తలపై నాయకులపై దాడులకు పిసిసి అధ్యక్షుడు ముఖ్యమంత్రి ప్రియాంక గాంధీ రాహుల్ గాంధీలు క్షమాపణ చెప్పాలి మా ఓపికను సహనాన్ని పరీక్షించాలి అనుకుంటే అది మీ ఇష్టం.
పోలీసుల వైఫల్యం వల్లే దాడి: మాజీ ఎమ్మెల్సీ రాంచందర్ రావు
ప్రజాస్వామ్య వ్యవస్థలో ఇటువంటి దాడులు సంఘవిద్రోహకర కార్యక్రమాల కిందకు వస్తాయి. రాహుల్ గాంధీ రాజ్యాంగ పుస్తకాన్ని చేతిలో పట్టుకుని తిరుగుతుంటారు. అసలు ఆయన రాజ్యాంగాన్ని చదివారా? రాజ్యాంగాన్ని చదవని, అనుసరించని కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలే ఇటువంటి దాడులకు పాల్పడుతుంటారు.
ప్రజాస్వామ్యంలో నిరసన తెలిపే హక్కు ప్రతిఒక్కరికి ఉంది. కానీ, రాజకీయ పార్టీ కార్యాలయాలపై, కార్యకర్తలపై దాడి చేసే అధికారం ఎవ్వరికీ లేదు. ఒక పథకం ప్రకారమే కాంగ్రెస్ పార్టీ ఈ దాడులకు పాల్పడింది.
ఒకవైపు అబిడ్స్ నుంచి, మరోదిక్కు గాంధీభవన్ నుంచి రెండువైపులా వందమందికి పైగా కాంగ్రెస్ కార్యకర్తలు భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో ఉన్న పార్టీ నాయకులపై దాడి చేసేందుకు వచ్చారు. పోలీసుల వైఫల్యం వల్లే భారతీయ జనతా పార్టీ కార్యాలయంపై దాడి జరిగింది. పోలీసులకు ఇంటెలిజెన్స్ రిపోర్టు ఉన్నప్పటికీ దాడికి ప్లాన్ చేసిన కాంగ్రెస్ కార్యకర్తలు బిజెపి ఆఫీసు గేట్ వద్దకు వచ్చేవరకు నిలువరించలేదు. ఈ దాడి పోలీసులు, కాంగ్రెస్ పార్టీ కలిసి చేసినట్లుగా భావిస్తున్నాం. దాడిని ఖండిస్తున్నాం.
పోలీసుల సమక్షంలోనే కాంగ్రెస్ కార్యకర్తలు చేతిలో ఇనుపరాడ్లు, రాళ్లు తీసుకువచ్చారు. ఈ దాడిలో బిజెపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కాసం వెంకటేశ్వర్లు, ఓబీసీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు ఆనంద్ గౌడ్, కార్యకర్త నందు కి గాయాలయ్యాయి. దాడి చేసింది కాంగ్రెస్ కార్యకర్తలయితే.. పోలీసులు బిజెపి యువమోర్చా కార్యకర్తలను అరెస్ట్ చేయడం అన్యాయం.
పోలీసు అధికారులు రాష్ట్ర ప్రభుత్వానికి ఎందుకు భయపడుతున్నారు? ఇటువంటి దాడులకు పాల్పడి, తిరిగి కాంగ్రెస్ నాయకులే ఖండిస్తుండటాన్ని దుర్మార్గం. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉండొచ్చు. అలాగే కేంద్రంలో బిజెపి ప్రభుత్వం ఉందనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలని హెచ్చరిస్తున్నాం. అబద్ధాలకు కేరాఫ్ కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ నిరసన తెలపాలనుకుంటే బిజెపి ఆఫీసు గేట్ వరకు రాడ్లు, రాళ్లు ఎందుకు తీసుకొచ్చినట్లు? కాంగ్రెస్ పాలనలో రాష్ట్రంలో శాంతిభద్రతలు క్షీణించాయి.