– అధికారులు వారి ప్రతిభ ను సమస్యల పరిష్కారం పై పెట్టండి..
– రెవెన్యూ సమస్యల పరిష్కారం పై ప్రత్యేక దృష్టి…
– భూగర్భ జలాలు పెంపు నకు చర్యలు చేపట్టండి
– ఏకో టూరిజం అభివృద్ధి దిశగా చర్యలు
– సచివాలయ సిబ్బంది రేషనలైజేషన్ ప్రక్రియ ను పూర్తి చేయండి:
– ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు
కుప్పం: ప్రజలకు సుపరిపాలన ను అందించేందుకు అధికారులు అలసత్వం వీడి అంకిత భావంతో భాధ్యతతో పనిచేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు.
ముఖ్యమంత్రి చిత్తూరు జిల్లా కుప్పం మూడు రోజుల పర్యటన లో భాగంగా మంగళవారం రాత్రి గుడిపల్లి మండలం ద్రావిడ యూనివర్సిటీ లోని సెమినార్ హాల్ లో జిల్లా అధికారులతో జిల్లా ప్రగతి పై సమీక్షించి అభివృద్ధి కొరకు తీసుకోవాల్సిన చర్యలు పై అధికారులకు దిశా నిర్దేశం చేశారు.
ముఖ్యమంత్రి మాట్లాడుతూ…. ప్రభుత్వ సేవలు ప్రజలకు సంతృప్తి స్థాయి లో చేరవేసేందుకు అధికారులు బాధ్యతతో పనిచేయాలని,సుపరిపాలన ను అందించేందుకు అధికారులు అలసత్వం వీడి పని చేయాలని తెలిపారు.ప్రధానంగా రెవిన్యూ సమస్యల పరిష్కారం పై ప్రత్యేక దృష్టి పెట్టాలని, ప్రణాళిక తో ముందుకు వెళ్లి పరిష్కారం చూపాలన్నారు. గతంతో పోలిస్తే ఆర్డీఓ లకు మండలాల సంఖ్య తక్కువగా ఉంటుందని, వారి పరిధిలో రెవెన్యూ సమస్యలను పరిష్కారానికి చొరవ చూపి సమర్థవంతంగా పనిచేయాలన్నారు.
రాష్ట్రంలో ప్రతి రిజర్వాయర్ నందు నీటి నిల్వలు కలవని జిల్లాలో ఎక్కడ తాగునీటి సమస్య తలెత్తే అవకాశం లేకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని ఆర్ డబ్ల్యూ ఎస్ అధికారులను ఆదేశించారు. భూగర్భ జలాల పెంపు నకు చెక్ డ్యామ్ ల నిర్మాణం నకు చర్యలు చేపట్టాలని డ్వామా అధికారులను ఆదేశించారు.
చిత్తూరు జిల్లాలో పంట పొలాల పై ఏనుగుల దాడులను అరికట్టేందుకు అటవీశాఖ అధికారులు తీసుకుంటున్న చర్యలపై సమీక్షించారు.జిల్లాలో ఏకో టూరిజం అభివృద్ధికి సంబంధిత శాఖలు సమిష్టిగా పని చేయాలన్నారు సచివాలయాల రేషనలైజేషన్ భాగంగా జనాభా ప్రాతిపదికన చేపట్టాలని, తద్వారా సిబ్బంది కొరతను నివారించవచ్చునని ఈ దిశగా చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ ను ఆదేశించారు.
జిల్లాలో వ్యవసాయానికి ప్రత్యామ్నాయంగా ఉద్యాన పంటలైన కూరగాయలు పూలు పండ్లు పెంపకాలను ప్రోత్సహించాలన్నారు. కొత్త పంటల సాగుకు రైతుల ఆసక్తి చూపే విషయంలో అందుకు ఆ ప్రాంతాల్లో ఆ పంట సాగుకు అనుకూలమైన వాతావరణం ఉన్నది లేనిది సరి చూసు కోవాలని ఆదేశించారు. గంజాయి నియంత్రణకు అటవీ పోలీసు అధికారులు ప్రత్యేక డ్రైవ్ ను చేపట్టి పగడ్బందీగా జాయింట్ యాక్షన్ ప్లాన్ ను అమలు చేయాలని అధికారులను ఆదేశించారు.
సమావేశంలో భాగంగా జిల్లా లో రెవెన్యూ సదస్సుల నిర్వహణ, ఆర్ డబ్ల్యూ ఎస్, మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా చేపడుతున్న పనుల పురోగతి,వ్యవసాయ, ఉద్యాన శాఖల పురోగతి,వైద్య సేవలు సంబంధిత అంశాలపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ ముఖ్యమంత్రి కి వివరించారు.
ఈ సమీక్షా సమావేశంలో చిత్తూరు పార్లమెంటు సభ్యులు దగ్గుమళ్ళ ప్రసాదరావు, ముఖ్యమంత్రి కార్యదర్శి ప్రద్యుమ్న, ప్రభుత్వ విప్ మరియు ఎమ్మెల్సీ డాక్టర్ కంచర్ల శ్రీకాంత్, జిల్లా ఎస్పీ మణికంఠ ఛందోలు, జిల్లా జాయింట్ కలెక్టర్ జి. విద్యాధరి, కడ పిడి వికాస్ మర్మత్, డీఎఫ్ఓ భరణి, ట్రైనీ కలెక్టర్ హిమ వంశీ, రాష్ట్ర ఏపీఎస్ఆర్టీసీ వైస్ చైర్మన్ పిఎస్ మునిరత్నం, మాజీ ఎమ్మెల్సీ గౌనివాని శ్రీనివాసులు వివిధ శాఖల జిల్లా స్థాయి అధికారులు కుప్పం నియోజక వర్గ, మండల స్థాయి అధికారులు పాల్గొన్నారు.